YS Jagan tweets: ఏపీలో( Andhra Pradesh) ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పోరుబాట పట్టనున్నాయా? కూటమి ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించనున్నాయా? అందుకు తగ్గ గ్రౌండ్ వర్క్ సిద్ధమవుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ వైద్యులు, సచివాలయ ఉద్యోగులు, విద్యుత్ శాఖ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వంపై. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన ఉద్యోగ సంఘాల నేతలు తెరపైకి వస్తున్నారు. జిల్లాల పర్యటన చేస్తున్నారు. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ సంఘాలకు మద్దతుగా ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులను రోడ్డున పడేసిందని.. వారి బకాయిలను తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులతో కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే ప్రయత్నం జరుగుతోందన్న అనుమానాలు పెరుగుతున్నాయి.
వైసిపి ఓటమికి ఉద్యోగులే కారణం..
2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ ఓటమికి ప్రధాన కారణం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు. నవరత్నాలకు ప్రాధాన్యం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులను చాలా తేలికగా తీసుకున్నారు. చివరకు వారి జీతాల చెల్లింపులో కూడా ఇబ్బందులు తెచ్చిపెట్టారు. ఒకటో తేదీన అందాల్సిన జీతాన్ని ఎప్పుడో నెల మధ్యలో ఇచ్చేవారు. వారికి సంబంధించిన రాయితీలను నిలిపివేశారు. అన్ని రకాల చెల్లింపులను జాప్యం చేశారు. ఉద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తం అయింది. రోడ్లపైకి వచ్చి నిరసన చేసే పరిస్థితికి వచ్చింది. ప్రభుత్వం నుంచి కవ్వింపు చర్యలు ఎదురు కావడంతో ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రత్యర్థులకు మించి.. ఉద్యోగులు శత్రువులుగా మారారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని దారుణంగా ఓడించడంలో వారి పాత్ర కీలకం.
సరిగ్గా ప్రభుత్వ ప్రకటన సమయంలో..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి ఎదురైన అంశాలను గుణపాఠాలుగా మార్చుకోవాల్సిన కూటమి ప్రభుత్వం.. ఉద్యోగుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ముఖ్యంగా పెండింగ్ డీఏ విషయంలో ప్రతి మంత్రివర్గ సమావేశంలో సానుకూల ప్రకటన వస్తుందని ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులు ఎదురుచూస్తూ వచ్చారు. కానీ నిరాశ ఎదురవుతూ వచ్చింది. అయితే దసరాకు పెండింగ్ డీఏలు విడుదల చేస్తారని భావించారు. కానీ అలా జరగలేదు. ఈనెల 10 న మంత్రివర్గ సమావేశం జరగనుంది. దీపావళి కానుకగా రాయితీలతో పాటు చెల్లింపులు చేస్తారని ఇప్పుడు ప్రచారం ప్రారంభం అయింది.
అయితే ఒకవైపు ఉద్యోగుల డీఏలకు సంబంధించి ప్రభుత్వ ప్రకటన ఉంటుందని పెద్ద ఎత్తున వార్తలు వస్తుండగా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల ఉద్యోగ సంఘం నేత ఒకరు సంచలన ఆరోపణలు చేశారు. వైసిపి ప్రభుత్వం పై ఉద్యోగులు విరక్తి చెంది మూడేళ్ల తర్వాత బయటకు వచ్చారని.. కానీ కూటమి ప్రభుత్వ చర్యల పుణ్యమా అని ఇప్పుడే రోడ్లపైకి వస్తున్నారని వచ్చారు. ఎంత జరుగుతున్నా కూటమికి అనుకూలంగా పనిచేసిన ఉద్యోగుల సంఘ నేతలు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగులను దారుణంగా వంచిందని.. తక్షణం వారికి ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. దీంతో ఉద్యోగ సంఘాల కదలికలు అనుసరించి తెర వెనుక ఉద్యమాలకు సన్నద్ధం అవుతున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో?
.@ncbn గారూ.. ఎన్నికలకు ముందు మీరు ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు ఏమిటి? ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి? తీపితీపి మాటలతో అరచేతిలో వారికి వైకుంఠం చూపి, తీరా ఇప్పుడు వారిని మోసం చేస్తారా? నడిరోడ్డుమీద నిలబెడతారా? ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది? మంత్రివర్గ సమావేశం జరిగిన ప్రతిసారి,… pic.twitter.com/CFIDuN9w7W
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 6, 2025