IND Vs AUS: మైదానం నిర్జీవంగా కనిపిస్తోంది. బంతిని పాత పడేదాకా ఆడిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు.. దాని ఫలితాన్ని అద్భుతంగా చవిచూస్తున్నారు. మొదటిరోజు భారత బౌలర్ల పై సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఆస్ట్రేలియా బ్యాటర్లు.. రెండో రోజు కూడా అదే ధోరణి కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా స్మిత్ క్రీజ్ లో పాతుకుపోయాడు. సిసలైన టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాడు. చివరికి కమిన్స్ కూడా 49 పరుగులు చేశాడంటే భారత బౌలింగ్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది అంటే.. ప్రత్యర్థి జట్టు పై విపరీతమైన ఒత్తిడి పెడుతుందనేది జగమెరిగిన సత్యమే. గత రెండు టెస్టులలో భారత బ్యాటింగ్ పరిశీలిస్తే.. ఇది నిజం కావడానికి ఎంతో సమయం పట్టదు. మరోవైపు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లడానికి భారత్ కు ఈ మ్యాచ్ అత్యంత అవసరం. ఇందులో కచ్చితంగా గెలవాలి. గెలవాలంటే అద్భుతం చోటు చేసుకోవాలి. అద్భుతం చోటు చేసుకోవాలంటే టీమిండియా ఆటగాళ్లు శక్తికి మించి ప్రదర్శన చేయాలి.
ఆకాష్ దీప్ ను వాడుకోవాలి
ఆకాష్ దీప్ కు ఎక్కువగా బౌలింగ్ అవకాశం ఇవ్వాలి. అతనిపై ఆంక్షలు విధించకుండా స్వేచ్ఛ ఇవ్వాలి. ముఖ్యంగా షార్ట్ పిచ్ బంతులను వేయాలని కెప్టెన్ రోహిత్ ప్రోత్సహించాలి. బంతితో స్వింగ్ రాబట్టడం ఆకాష్ దీప్ కు వెన్నతో పెట్టిన విద్య. తొలిరోజు అతడికి కొత్త బంతి ఇవ్వకుండా రోహిత్ శర్మ ఘోర తప్పిదం చేశాడు.. చివరికి ఆకాష్ దీప్ కు అవకాశం రావడంతో.. క్యారీని వెంటనే అవుట్ చేశాడు. పెవిలియన్ పంపించాడు. ఇక రెండవ రోజు కూడా కెప్టెన్ రోహిత్ ఆకాష్ వైపు అంతగా ఆసక్తి చూపించలేదు. స్మిత్ ఇప్పటికే 139 రన్స్ చేశాడు.. అతడి పైకి ఆకాశ్ ను పదేపదే దింపితేనే ప్రయోజనం ఉంటుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా 500 స్కోర్ దిశగా వెళ్తోంది. 500 వరకు వెళ్ళింది అంటేనే భారత్ కు మరో స్కెచ్ వేసిందని అర్థం. బ్రిస్ బేన్ లో వర్షం వల్ల టీమిండియా బతికిపోయింది. మెల్ బోర్న్ లో అలాంటి అవకాశం లేదు. అలాంటప్పుడు ఆటగాళ్లు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడాలి.
బ్యాటర్లు ఇలా చేయాలి
రెడ్ బాల్ ఫార్మాట్లో భారత ప్లేయర్లు వైట్ బాల్ గేమ్ ఆడుతున్నారు. దానివల్ల జట్టు విజయా అవకాశాలు దారుణంగా దెబ్బతింటున్నాయి. నిర్లక్ష్యంగా ఆడితే మాత్రం భారత్ భారీ మూల్యం చెల్లించక తప్పదు. ముఖ్యంగా బంతి పాత పడే వరకు ఓపెనర్లు నిదానంగా ఆడాలి. ఓపికగా బ్యాటింగ్ చేయాలి. లబూ షేన్, ఉస్మాన్ ఖవాజా ఎలా బ్యాటింగ్ చేశారో గుర్తుకు తెచ్చుకోవాలి. లేనిపక్షంలో టీమిండియా చేతులెత్తేయక తప్పదు. ముఖ్యంగా రోహిత్, విరాట్, యశస్వి జైస్వాల్, రాహుల్ బ్యాటింగ్ భారాన్ని మోస్తేనే టీమ్ ఇండియాకు ఆమోదయోగ్యమైన ఫలితం ఉంటుంది.