IND vs AUS : టీమిండియాలో విరాట్ కోహ్లీకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. 36 సంవత్సరాల వయసులోనూ అతడు అద్భుతమైన శరీర సామర్థ్యాన్ని కొనసాగిస్తూ.. యువ ఆటగాళ్లతో పోటీపడి పరుగులు చేస్తున్నాడు. అందువల్లే అతడికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సచిన్ తర్వాత టీమ్ ఇండియాలో ఆ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సాధించుకున్న ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. శరీర సామర్థ్యం విషయంలో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పే విరాట్ కోహ్లీ.. చేజింగ్ లోనూ అదే స్థాయిలో జోరు కొనసాగిస్తున్నాడు.
Also Read : శ్రేయస్ అయ్యర్ త్రో కు వికెట్లు నేలకొరిగాయి.. బిత్తర పోయిన అలెక్స్ క్యారీ.. వైరల్ వీడియో
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమ్ ఇండియా ఆస్ట్రేలియా తో దుబాయ్ వేదికగా సెమి ఫైనల్ మ్యాచ్ ఆడుతోంది. ఇందులో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 264 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత చేజింగ్ ప్రారంభించిన టీమిండియా.. ఈ కథనం రాసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. టీమిండియా విజయం సాధించాలంటే 40 బంతుల్లో 38 పరుగులు చేయాలి. ప్రస్తుతం క్రీజ్ లో కేఎల్ రాహుల్ (31), హార్దిక్ పాండ్యా (2) ఉన్నారు.. టీమిండియాలో రోహిత్ (28), గిల్(8), విరాట్ కోహ్లీ(84), శ్రేయస్ అయ్యర్(45), అక్షర్ పటేల్ (27) పరుగులు చేశారు. అయితే విరాట్ కోహ్లీ సెంచరీకి చేస్తాడనుకుంటున్న తరుణంలో 84 పరుగులు చేసి జంపా బౌలింగ్లో డ్వార్ షుష్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో స్టేడియంలో ఒక్కసారిగా అభిమానులు షాక్ కు గురయ్యారు. గెలుపు దిశగా సాగుతున్న టీమ్ ఇండియా విరాట్ కోహ్లీ అవుట్ కావడంతో ఒకసారి గా కుదుపునకు గురైంది. సెంచరీ కోల్పోయినప్పటికీ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు.
చేజింగ్ మాస్టర్
విరాట్ కోహ్లీ చేజింగ్ మాస్టర్ అని అందరికీ తెలుసు. అయితే అతడు అందులోను సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. ముందుగా బ్యాటింగ్ చేసినప్పుడు 130 ఇన్నింగ్స్ లలో విరాట్ కోహ్లీ 6,117 పరుగులు చేశాడు. ఇందులో అతడు యావరేజీ స్ట్రైక్ రేట్ 93.48. ఇందులో 23 హాఫ్ సెంచరీలు, 33 సెంచరీలు ఉన్నాయి.. ఇక చేజింగ్ విషయంలో విరాట్ కోహ్లీ 159 ఇన్నింగ్స్ లు ఆడాడు. ఇందులో అతడు 8,003 పరుగులు చేశాడు. అతడు యావరేజ్ 64.53. స్ట్రైక్ రేట్ 93.26. ఇందులో 28 హాఫ్ సెంచరీలు ఉంటే.. 40 సెంచరీలు ఉన్నాయి. ఇక సింగిల్స్ రన్ తీసే విషయంలోనూ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. వన్డేలలో ఏకంగా 5,868 సింగిల్ రన్స్ తీసి విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు జయవర్ధన పేరు మీద ఉండేది. విరాట్ కోహ్లీ సెంచరీ కోల్పోయినప్పటికీ అతడు చేసిన పరుగులు టీమిండియా కు బలమైన పునాదిగా నిలిచాయి. రోహిత్, గిల్ వెంట వెంటనే అవుట్ అయిన నేపథ్యంలో.. శ్రేయస్ అయ్యర్ తో కలిసి విరాట్ కోహ్లీ టీమిండియా కు మెరుగైన స్కోర్ అందించాడు. అందువల్లే పటిష్టమైన ఆస్ట్రేలియా బౌలింగ్ ముందు కూడా టీమ్ ఇండియా బలంగా నిలిచింది.