https://oktelugu.com/

India Vs Australia: ఆస్ట్రేలియా అంటేనే స్లెడ్జింగ్.. కానీ ఈసారి తిరగబడింది.. టీమిండియా వల్ల కంగారులకు దిమ్మ తిరుగుతోంది!

తాడిని తన్నేవాడు ఉంటే.. తలను తన్నేవాడు మరొకడు ఉంటాడు. ఈ సామెత ఆస్ట్రేలియాకు ఈసారి జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అనుభవంలోకి వచ్చింది. స్వదేశంలో ఆస్ట్రేలియా తొలిసారిగా బాధిత పక్షం అయింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 26, 2024 / 11:25 AM IST

    India Vs Australia(3)

    Follow us on

    India Vs Australia:  ఆస్ట్రేలియా.. క్రికెట్ ను శాసించే రోజులు నాటి నుంచి నేటి వరకు స్లెడ్జింగ్ ను ప్రధాన అస్త్రంగా వాడుకుంటుంది. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను మాటలతో, చేతలతో కవ్విస్తుంది. మైదానంలో తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. గేలి చేస్తుంది, ఆత్మస్థైర్యం దెబ్బతినేలాగా ప్రవర్తిస్తుంది. అందువల్లే ఆస్ట్రేలియా అంటే ప్రత్యర్థి ఆటగాళ్లు భయపడిపోతుంటారు. ఒక్కోసారి తమ ఆట తీరు అంతగా బాగో లేకపోయినప్పటికీ.. మాటల ద్వారానే ఆస్ట్రేలియా మ్యాచ్ గెలుస్తుంది. ఇలాంటి సందర్భాలు చాలా చోటుచేసుకున్నాయి. క్రికెట్ పుట్టిన ఇంగ్లాండ్.. క్రికెట్ కు ఆధునికతను జోడించిన దక్షిణాఫ్రికా.. స్మార్ట్ గేమ్ ఆడే న్యూజిలాండ్ వల్ల కూడా ఆస్ట్రేలియా దూకుడును తగ్గించడం వీలు కాలేదు. కానీ తొలిసారిగా ఈ బాధ్యతను భారత్ తీసుకుంది. అంతేకాదు ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియా గడ్డపై తలవంపులకు గురిచేసింది. మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా ఓపెనర్ బ్యాటర్ సాన్ కొన్ స్టాస్ భుజాన్ని రాసుకుంటూ వెళ్ళాడు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. భుజాన్ని రాసుకున్న తర్వాత కొన్ స్టాన్ – విరాట్ మధ్య మాటల యుద్ధం సాగింది. సహజంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆస్ట్రేలియా ప్రత్యర్థి జట్టుపై పై చేయి సాధిస్తుంది. అయితే ఈసారి మాత్రం బాధిత పక్షం అయిపోయింది.

    ఇది మాత్రమే కాదు..

    ఈసారి ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న టీమిండియా దూకుడు మీద ఉంది. మ్యాచ్ ఫలితాలను పక్కన పెడితే ఆస్ట్రేలియా ఆటగాళ్లపై పై చేయి సాధిస్తోంది. పెర్త్ టెస్టులో నీ బౌలింగ్లో వేగం తగ్గిందని స్టార్క్ ను ఉద్దేశించి టీమిండియా ఆటగాడు యశస్వి జైస్వాల్ వ్యాఖ్యానించడం సంచలనం కలిగించింది. అంతేకాదు స్టార్క్ బౌలింగ్ లో అతడు ఏకంగా భారీ సిక్సర్ కొట్టడం చర్చకు దారి తీసింది. అప్పుడు మొదలైన టీమిండియా దూకుడు మెల్ బోర్న్ మైదానం వరకు సాగింది. ఇక మహమ్మద్ సిరాజ్, హెడ్ మధ్య జరిగిన వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హెడ్ క్రికెట్ తీసిన ఆనందంలో సిరాజ్ మైదానం నుంచి బయటికి వెళ్ళు అన్నట్టుగా సంకేతాలు ఇవ్వడం సంచలనం కలిగించింది. మొత్తంగా ఈ పరిణామాలు టీమ్ ఇండియా దూకుడును ప్రదర్శిస్తుండగా.. స్లెడ్జింగ్ వల్ల ప్రత్యర్ధి దేశాలు ఎంతటి ఇబ్బంది పడుతున్నాయో ఆస్ట్రేలియాకు తెలిసి వచ్చింది. అయితే ఈ పరిణామాలతోనైనా ఆస్ట్రేలియా జట్టు మారుతుందా.. స్లెడ్జింగ్ కు దూరం జరుగుతుందా? జెంటిల్మెన్ గేమ్ లో జెంటిల్మెన్ తత్వాన్ని ప్రదర్శిస్తుందా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది. ప్రస్తుతానికి అయితే మెల్బోర్న్ మైదానంలో భారత బౌలర్ల పప్పులు ఉడకడం లేదు. ఆస్ట్రేలియా బ్యాటర్లు దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నారు.