Ind Vs Aus BGT 2024: పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా విజయం సాధించింది. ఏకంగా 295 పరుగుల తేడాతో భారీ గెలుపును సొంతం చేసుకుంది. రెండవ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టును 238 పరుగులకు ఆల్ అవుట్ చేసింది. ఆస్ట్రేలియా జట్టులో హెడ్ (89) పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు మిచెల్ మార్ష్ (47), అలెక్స్ క్యారీ (36) రాణించినప్పటికీ.. పరుగుల తేడాను మాత్రమే తగ్గించ గలిగారు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్ చెరి మూడు వికెట్లు దక్కించుకున్నారు. వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు పడగొట్టాడు. హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి చెరో వికెట్ సాధించారు. మూడు వికెట్ నష్టానికి 12 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు.. మరో ఐదు పరుగులు మాత్రమే జోడించి ఉస్మాన్ ఖవాజా వికెట్ కోల్పోయింది.. ఆ తర్వాత స్టీవెన్ స్మిత్, హెడ్ జోడి భారత బౌలర్లను కాస్తలో కాస్త ప్రతిఘటించింది. వీరిద్దరూ ఆరో వికెట్ కు 92 పరుగులు జోడించారు. స్మిత్ నిదానంగా ఆడినప్పటికీ.. హెడ్ మాత్రం భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. మరోవైపు స్మిత్ 17 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సిరాజ్ వేసిన అద్భుతమైన బంతిని తప్పుడు అంచనావేసి కీపర్ రిషబ్ పంత్ కు దొరికిపోయాడు. ఆ తర్వాత వచ్చిన మిచల్ మార్ష్ దూకుడు గా ఆడాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. అయితే జట్టు స్కోరు 161 పరుగుల వద్దకు చేరుకున్నప్పుడు హెడ్ బుమ్రా బౌలింగ్లో పంత్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మార్ష్ కూడా నితీష్ రెడ్డి బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అలెక్స్ క్యారీ చివర్లో కాస్త మెరుపులు మెరిపించినప్పటికీ.. హర్షిత్ రాణా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మిచల్ స్టార్క్, నాథన్ లయన్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. వీరిద్దరిని వాషింగ్టన్ సుందర్ అవుట్ చేశాడు.
295 పరుగుల తేడాతో..
తొలి ఇన్నింగ్స్ లో భారత్ 150 పరుగులకు ఆల్ అవుట్ అయింది.. ఆ తర్వాత ఆస్ట్రేలియాను 104 పరుగులకు ఆల్ అవుట్ చేసింది. మొత్తంగా 46 పరుగుల లీడ్ సంపాదించింది. ఇక రెండవ ఇన్నింగ్స్ లో భారత్ ఆరు వికెట్లు కోల్పోయి 487 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.. యశస్వి జైస్వాల్ 161 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ సెంచరీ తో అజేయంగా నిలిచాడు. టీమిండియా విధించిన భారీ పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో… ఆస్ట్రేలియా జట్టు 238 పరుగులకు ఆల్ అవుట్ అయింది. భారత్ 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ జట్టు చేతుల్లో వరుసగా మూడు టెస్టుల ఓటమి ఎదుర్కొన్న టీమిండియా… ఆస్ట్రేలియాపై విజయం సాధించి ఒత్తిడిని తగ్గించుకుంది. అదే కాదు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ కు వెళ్లే అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.