T20 World Cup 2024 Champions: దాదాపు 17 సంవత్సరాల తర్వాత టీమిండియా పొట్టి ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. గత శనివారం వెస్టిండీస్ లోని బార్బడోస్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది.. ఈ విజయం ద్వారా టీమిండియా వన్డే వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లలో ఎదురైన ఓటములకు బదులు తీర్చుకుంది.. విజేతగా ఆవిర్భవించినప్పటికీ టీమిండియా బుధవారం తెల్లవారుజామున దాకా బార్బడోస్ లోనే ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ శనివారం రాత్రి ఏర్పడిన హరికేన్ వల్ల విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో విమానాశ్రయాలలోకి వరద నీరు పోటెత్తింది. ఫలితంగా టీమిండియా ఆటగాళ్లు, కోచ్ లు, ఇతర సహాయక సిబ్బంది అక్కడే ఉండాల్సి వచ్చింది. చివరికి బుధవారం తెల్లవారుజామున ప్రత్యేక విమానంలో టీమిండియా ఆటగాళ్లు స్వదేశానికి బయలుదేరారు.
గురువారం తెల్లవారుజామున ఆరు గంటలకు ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రటరీ జై షా, రోహిత్ శర్మ కేక్ కట్ చేశారు.. ఆ తర్వాత ట్రోఫీని చూపించుకుంటూ రోహిత్ అభిమానులను ఉత్సాహపరిచారు. అనంతరం ఆటగాళ్లతో కలిసి ప్రత్యేక బస్సులు ఐటిసి మౌర్య హోటల్ లోకి వెళ్లారు. అక్కడ స్థానిక కళాకారులతో కలిసి టీమిండియా ఆటగాళ్లు నృత్యాలు చేశారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ని కలిశారు. ఈ సందర్భంగా వారితో కలిసి ప్రధాని ఫోటోలు దిగారు. కొద్దిసేపు కుశల ప్రశ్నలు వేశారు. ప్రధానితో భేటీ అనంతరం టీమిండియా ఆటగాళ్లు ముంబై వెళ్ళిపోయారు. ఓపెన్ టాప్ బస్సులో విక్టరీ పరేడ్ లో పాల్గొన్నారు. ఈ పరేడ్ కు భారీగా అభిమానులు హాజరయ్యారు. అభిమానుల రాకతో ముంబై మహానగరం కిక్కిరిసిపోయింది. సముద్రతీరం మొత్తం జనసంద్రంగా మారింది.
సాధించిన టి20 వరల్డ్ కప్ ట్రోఫీని చూపించుకుంటూ టీమిండియా ఆటగాళ్లు విక్టరీ పరేడ్ లో పాల్గొన్నారు. టీమిండియా ఆటగాళ్లు ప్రదర్శించిన ఆ కప్ నిజమైనది కాదట.. ఒరిజినల్ ట్రోఫీని కేవలం ఫోటో షూట్ కోసం మాత్రమే ఇస్తారట.. విజేతలు ట్రోఫీని తమ దేశానికి తీసుకెళ్ళేందుకు అచ్చం దానినే పోలిన వెండి ట్రోఫీని ఇస్తారట. ఒరిజినల్ ట్రోఫీ మాత్రం దుబాయిలోని ఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఉంటుందట.. అయితే దీనిపై అభిమానులు మండిపడుతున్నారు.. ఒరిజినల్ ట్రోఫీ విషయంలో ఐసీసీ టీమ్ ఇండియాను మోసం చేసిందని సరదాగా కామెంట్లు చేస్తున్నారు..