NGAW Vs NZW: క్రికెట్లో మహిళలకు కూడా మరింత ప్రాధాన్యం పెంచేందుకు ఐసీసీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా పురుషులకు నిర్వహించినట్టుగానే, మహిళలకు కూడా అండర్ 19 (U-19) వరల్డ్ కప్ పోటీలు నిర్వహిస్తున్నది. ప్రస్తుతం గ్రూప్ దశలో పోటీలు జరుగుతున్నాయి. ఈ గ్రూప్ పోటీలలో సంచలనం చోటుచేసుకుంది. నైజీరియా, న్యూజిలాండ్ జట్లు తలపడిన మ్యాచ్లో రెండు పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై నైజీరియా గెలిచింది.. తద్వారా అండర్ 19 మహిళల క్రికెట్లో పెను సంచలనాన్ని నమోదు చేసింది. దీంతో నైజీరియా జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది.. స్వల్ప స్కోరు నమోదైన ఈ మ్యాచ్లో వికెట్లు వెంట వెంటనే పడిపోగా.. టైలండర్లు కీలకపాత్ర పోషించడం విశేషం.
13 ఓవర్ల మ్యాచ్..
ఈ మ్యాచ్ జరుగుతున్న సారా వాక్ మైదానం అత్యంత చిత్తడిగా ఉంది. దీంతో అంపైర్లు మ్యాచ్ ను 13 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన నైజీరియా జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 63 పరుగులు మాత్రమే చేసింది. మైదానం చిత్తడిగా ఉండడంతో పరుగులు తీయడం నైజీరియా బ్యాటర్లకు వీలు కాలేదు. లిల్లియన్ ఉడె(19), కెప్టెన్ లక్కీ పిటే (18) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో అనిక, హన్నా, అనిక టాడ్, తాష్, హన్నా ఫ్రాన్సిస్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇన్నింగ్స్ ప్రారంభంలో ఒక పరుగు మాత్రమే చేసి ఓపెనర్ వికెట్ ను నైజీరియా జట్టు కోల్పోయింది. ఆ తర్వాత నిదానంగా పరుగులు చేసింది. ఈ దశలో న్యూజిలాండ్ బౌలర్లు విజృంభించారు. అయితే లిల్లియన్ ఉడె, కెప్టెన్ లక్కీ పిటే కాస్త ప్రతిఘటించడంతో నైజీరియా ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది.
రెండు పరుగుల తేడాతో..
ఆ తర్వాత 64 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు.. ఏ దశలోనూ టార్గెట్ వైపు సాగుతున్నట్టు కనిపించలేదు. 0 పరుగుల వద్ద ఓపెనర్ కేట్ ఐర్విన్(0) రూపంలో న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మరో ఓపెనర్ మూడు పరుగులకే వెనుదిరిగింది. ఈ దశలో వచ్చిన ఉలాండ్(14), అనికా టాడ్(19), తాష్ వాకిలన్(18) నైజీరియా బౌలర్లను ప్రతిఘటించారు. అయితే కీలక దశలో ఉలాండ్, అనికా టాడ్ అవుట్ అయ్యారు. తాష్ వాకిలన్ అనవసరైన పరుగుకు యత్నించి రానౌట్ అయింది. ఇక చివర్లో వచ్చిన డార్సీ రోజ్ ప్రసాద్ నాలుగు బంతులు ఎదుర్కొని.. ఒక పరుగు కూడా చేయకుండా రన్ అవుట్ అయింది. అప్పటికే ఓవర్లు పూర్తి కావడంతో.. నైజీరియా జట్టు రెండు పరుగుల తేడాతో గెలిచింది.. ఈ గెలుపును పునస్కరించుకొని నైజీరియా ప్లేయర్లు మైదానంలో సందడి చేశారు. వారికి అభిమానులు కూడా మద్దతు పలికారు. సోషల్ మీడియాలో అయితే నైజీరియా ప్లేయర్లపై ప్రశంసల జల్లు కురుస్తోంది. దుర్భరమైన దారిద్ర్యం తో కొట్టుమిట్టాడుతున్న దేశం క్రికెట్లో సంచలనం సృష్టించిందని.. వారికి మరిన్ని ప్రోత్సహకాలు అందిస్తే ఆటలో మరింతగా రాణిస్తారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.. ఐసీసీ కూడా ఆదిశగా ప్రోత్సాహకాలు అందించాలని.. నైజీరియా జట్టు క్రికెట్ లో అత్యున్నత శిఖరాలు అధిరోహించే విధంగా తోడ్పాటు అందించాలని కోరుతున్నారు.
U-19 WORLD CUP లో సంచలనం. న్యూజిలాండ్ జట్టును రెండు పరుగుల తేడాతో ఓడించిన నైజీరియా..#Nigeria#NewZealand #u19worldcup pic.twitter.com/BURh66L7sj
— Anabothula Bhaskar (@AnabothulaB) January 20, 2025