Homeక్రీడలుU19 World Cup 2024: అండర్‌ – 19 వరల్డ్‌ కప్‌లో భారత్‌ జోరు.....

U19 World Cup 2024: అండర్‌ – 19 వరల్డ్‌ కప్‌లో భారత్‌ జోరు.. 5 సార్లు ఛాంపియన్‌.. 3 సార్లు రన్నరప్‌!

U19 World Cup 2024: భారత్‌ జూనియర్‌ జట్టు 15వ అండర్‌ – 19 వరల్డ్‌ కప్‌లో అదరగొడుతోంది. దక్షిణాఫ్రికాతో మంగళవారం(ఫిబ్రవరి 6న) జరిగిన సెమీ ఫైనల్‌లో 2 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. వరుసగా ఐదోసారి ఫైనల్‌కు చేరుకుంది. టీమిండియా అండర్‌ – 19 వరల్డ్‌ కప్‌లో ఫైనల్‌కు చేరడం ఇది 9వ సారి.

5 సార్లు ఛాంపియన్‌..
ఇప్పటి వరకు 14 అండర్‌ – 19 వరల్డ్‌ కప్‌ సిరీస్‌లు జరిగాయి. ప్రస్తుతం జరుగతున్నది 15వది. 14 సిరీస్‌లలో భారత జట్టు 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. 3 సార్లు రన్నరప్‌గా రెండో స్థానానికి పరిమితమైంది. తాజాగా ఉదయ్‌ సహారన్‌ నాయకత్వంలో 9వసారి ఫైనల్‌ మ్యార్‌ ఆడబోతోంది. ఈసారి కూడా ట్రెఫీ గెలుచుకునే జట్టుగానే బరిలో దిగింది. అంచనాల మేరకు కుర్రాళ్లు రాణిస్తున్నారు.

వరల్డ్‌ కప్‌ ఇన్నింగ్‌ మూమెంట్స్‌..
= మహ్మద్‌ కైఫ్‌ నాయకత్వంలో టీమిండియా 2000 సంవత్సరంలో తొలిసారి అండర్‌ – 19 వరల్డ్‌ కప్‌ సాధించింది. ఫైనల్‌ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 178 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన భారత్‌ నాలుగు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసి తొలి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.

– తొలిసారి 2000 సంవత్సరంలో ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియా రెండోసారి సిరీస్‌ కోసం ఎనిమిదేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. 2008లో విరాట్‌ కోహ్లి సారథ్యంలో టీమిండియా జట్టు డక్‌వర్త్‌ లూయీస్‌ నిబంధనల ప్రకారం దక్షిణాఫ్రికాను 12 పరుగులతో ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 159 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యార్‌ను 25 ఓవర్లకు కుదించారు. డక్‌వర్త్‌ లూయీస్‌ ప్రకారం దక్షిణాప్రికా లక్ష్యం 115 పరుగలకు కుదించారు. అయితే ఆ జట్టు కేవలం 103 పరుగులు మాత్రమే చేసి ఆల్‌ఔట్‌ అయింది.

– ఉన్ముక్త్‌ చంద్‌ కెప్టెన్సీలో భారత జట్టు 2012లో భారతదేశానికి మూడోసారి వరల్డ్‌ కప్‌ అందించింది. ఈ సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 225 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని టీమిండియా 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

– పృథ్వీషా నాయకత్వంలో టీమిండియా 2018లో నాలుగోసారి విశ్వ విజేతగా నిలిచింది. ఫైనల్‌ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 216 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని టీమిండియా 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.

– యశ్‌ ధుల్‌ నేతృత్వంలోని టీమ్‌ ఇండియా గత ప్రపంచ కప్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా ఐదోసారి అవతరించింది. చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ నిర్దేశించిన 190 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు 47.4 ఓవర్లలో ఛేదించింది. 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

మూడుసార్లు రన్నరప్‌గా..
ఇక టీమిండియా 2006, 2016, 2020లో రన్నరప్‌గా నిలిచింది. ఇప్పుడు టీమ్‌ ఇండియా 6వసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకునే దిశగా దూసుకుపోతోంది. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీస్‌లో విజయం సాధించిన భాతర జట్టు ఫైనల్‌లో రెండో సెమీఫైనల్‌లో విజేతగా నిలిచే జట్టుతో తలపడుతుంది. రెండో సెమీఫైనల్‌ ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ మధ్య జరుగనుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version