ICC Rankings : ప్రపంచ క్రికెట్ లో ఇన్నాళ్లు మూడు ఫార్మాట్లలో నంబర్ 1గా ఉన్న టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. టెస్టుల్లో నంబర్ 1 నుంచి నంబర్ 2 స్థానానికి టీమిండియా దిగజారింది. నిజానికి ఆస్ట్రేలియా వరుస టెస్టు విజయాలతో టీమిండియాను వెనక్కి నెట్టి పై స్థానానికి చేరుకుంది.
-ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా టాప్
తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాంకులు చూస్తే.. ఆస్ట్రేలియా జట్టు టెస్టుల్లో నంబర్ 1 స్థానానికి చేరుకుంది. ఇటీవల పాకిస్తాన్ పై స్వదేశంలో వరుస విజయాలు, వెస్టిండీస్ పై తొలి టెస్టులో విజయంతో ఆస్ట్రేలియా విజయాల శాతం పెరిగి 121 పాయింట్లతో టెస్టుల్లో నంబర్ 1 జట్టుగా అవతరించింది. ఇక టీమిండియా 117 పాయింట్లతో రెండో స్థానానికి పరిమితమైంది. ఇంగ్లండ్ పై సిరీస్ గెలిస్తే మళ్లీ టీమిండియా టాప్ ప్లేసులోకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఇక టెస్టుల్లో 3వ ర్యాంకులో ఇంగ్లండ్, 4వ స్థానంలో సౌతాఫ్రికా, 5వ స్థానంలో న్యూజిలాండ్ నిలిచాయి.
-వన్డేల్లో టీమిండియానే నంబర్ 1
వన్డేల్లో టీమిండియా టాప్ 1లో కొనసాగుతోంది. మొన్నటి వన్డే ప్రపంచకప్ ఫైనల్ కు చేరిన టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో తృటిలో ఓడింది. అయినా టాప్ లోనే వన్డేల్లో కొనసాగుతోంది. టీమిండియాకు 121 పాయింట్లు ఉండగా.. ఆస్ట్రేలియా 117 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక సౌతాఫ్రికా 3వ స్థానంలో.. పాకిస్తాన్ 4వ స్థానంలో.. న్యూజిలాండ్ 5వ స్థానంలో నిలిచింది.
-టీ20 ర్యాంకింగ్స్ లోనూ ఇండియానే తోపు
ఇక టీ20 ఫార్మాట్ లోనూ టీమిండియా టాప్ 1లో ఉంది. ఇంగ్లండ్ 2వ స్థానంలో, న్యూజిలాండ్ 3వ స్థానంలో ఉంది. ఇక పాక్ 4వ , ఆస్ట్రేలియా 5వ స్థానంలో నిలిచాయి.
-బ్యాట్స్ మెన్లలో చూస్తే..
– టెస్టుల్లో నంబర్ 1 బ్యాట్స్ మెన్ గా కేన్ విలయంసన్ నిలిచారు. 2వ ప్లేసులో జోరూట్ ఉన్నారు. ఇండియా నుంచి టాప్ 5లో ఎవరూ లేరు.
-వన్డేల్లో బాబర్ నంబర్ 1
వన్డేల్లో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజాం నంబర్ 1లో కొనసాగుతున్నారు. ఇక నంబర్ 2గా మన శుభ్ మన్ గిల్, నంబర్ 3లో కోహ్లీ, నంబర్ 4లో రోహిత్ శర్మ ఉన్నారు. 5వ ప్లేసులో డేవిడ్ వార్నర్ నిలిచారు..
-టీ20లో మన సూర్యనే నంబర్ 1
టీ20లో మన సూర్యకుమార్ యాదవ్ నంబర్ 1 బ్యాటర్ గా కొనసాగుతున్నారు. 2వ స్థానంలో ఇంగ్లండ్ ప్లేయర్ ఫిల్ సాల్ట్ ఉన్నారు.3వ స్థానంలో పాకిస్తానీ రిజ్వాన్, 4వ స్థానంలో బాబర్ అజాం, 5వ స్థానంలో ఎయిడెన్ మార్క్రమ్ ఉన్నారు.
మొత్తంగా టెస్టుల్లో భారత్ ఆధిపత్యానికి ఆస్ట్రేలియా చెక్ పెట్టింది. ఇన్నాళ్లు మూడు ఫార్మాట్లలో నంబర్ 1గా ఉన్న భారత్ ఇప్పుడు రెండు ఫార్మాట్లకే పరిమితమైంది. ఇంగ్లండ్ పై సిరీస్ గెలిస్తే టీమిండియా మళ్లీ టెస్టుల్లోనూ నంబర్ 1గా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఏం జరుగుతుందన్నది వేచిచూడాలి.