ODI World Cup 2023 Schedule: భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ఈ ఏడాది ఆఖరులో జరగనుంది. ఇందుకోసం భారత జట్టు సన్నద్ధమవుతోంది. వరల్డ్ కప్ నిర్వహణకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన షెడ్యూల్ ను ఐసీసీకి అందించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ షెడ్యూల్ ను ఐసీసీ వరల్డ్ కప్ లో పాల్గొనే దేశాలకు పంపించి అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించింది. అయితే ఒక్క పాకిస్తాన్ జట్టు మినహా ఇతర దేశాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. పాకిస్తాన్ జట్టు మాత్రం రెండు నగరాల్లో నిర్వహించే మ్యాచ్ లను ఆడేందుకు సుముఖతను వ్యక్తం చేయడం లేదు. ఇదే ప్రస్తుతం ఇబ్బందికరమైన సమస్యగా మారింది.
భారత్ – పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే చాలు కోట్లాదిమంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇక వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీల్లో రెండు జట్ల మధ్య పోరు అంటే అభిమానుల ఆసక్తి మరింత పెరుగుతుంది. వరల్డ్ కప్ లో భాగంగా లీగ్ దశలో పాకిస్తాన్ జట్టు ఆడాల్సిన రెండు మ్యాచ్ లకు సంంధించిన వేదికలపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ఈ మ్యాచ్ లు నిర్వహణకు అనుగుణంగా షెడ్యూల్ ఖరారు చేసి బీసీసీఐ.. ఐసీసీ ద్వారా ఆయా దేశాలకు పంపించింది. అయితే, ఆఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా జట్లతో జరగనున్న మ్యాచ్ కు సంబందించిన వేదికలో ఆడేందుకు పాకిస్తాన్ జట్టు ఆసక్తి చూపించకపోవడంతో ఈ షెడ్యూల్ ప్రకటనపై ఆలస్యం జరుగుతూ వస్తోంది. పాకిస్తాన్ జట్టు భారత్ పిచ్ లపై ఆడేందుకు భయపడుతూ ఉండడం వల్లే జాప్యం చేస్తుందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
అసంతృప్తిని వ్యక్తం చేసిన పాకిస్తాన్..
వరల్డ్ కప్ లో భాగంగా నిర్వహించే మ్యాచులకు సంబంధించిన ముసాయిదా షెడ్యూల్ ను బీసీసీఐ తయారుచేసి ఐసీసీకి అందించింది. ఇందులో ఏ మ్యాచ్ ఏ స్టేడియంలో జరగనుందో ఉంది. సూచనలు, సలహాలు ఉంటే సభ్య దేశాలు అందించాలని ఐసీసీ కోరింది. ఇతర దేశాల మాత్రం దీనిపై ఎటువంటి అభ్యంతరాలను వ్యక్తం చేయలేదు. కానీ పాకిస్తాన్ మాత్రం ముసాయిదా షెడ్యూల్ పై అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఐసీసీ అందించిన ముసాయిదా షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్ జట్టు చెన్నై మరియు బెంగళూరు స్టేడియాల్లో ఆడనుంది. ఈ రెండు మ్యాచ్లకు సంబంధించిన వేదికలను మార్చాలని ఐసీసీని పాకిస్తాన్ కోరింది. చెన్నైలో ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ జరిగితే ఆ జట్టు స్పిన్నర్లు రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ నుంచి ప్రమాదం పొంచి ఉందన్న ఉద్దేశంతో పాకిస్తాన్ జట్టు భయపడుతున్నట్లు చెబుతున్నారు. ఈ మైదానం స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండడంతో పాకిస్తాన్ భయపడుతోందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆ ఉద్దేశంతోనే ఇక్కడ ఆడేందుకు పాకిస్తాన్ జట్టు ఆందోళన చెందుతుంది. ఇక బెంగళూరులో ఆస్ట్రేలియా తో కనుక ఆడితే మరింత ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందని పాక్ భావిస్తోంది. ఇది పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలించే పిచ్చి కావడంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు విజయంభించే అవకాశం ఉందని, అదే జరిగితే తమకు ఇబ్బందులు తప్పవని పాకిస్తాన్ జట్టు భావిస్తుంది. రెండు మ్యాచ్ ల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉండడంతోనే పాకిస్తాన్ జట్టు ఇలా అడ్డంకులు పెడుతుందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చూడాలి మరి పాకిస్తాన్ జట్టు లేవనెత్తిన అభ్యంతరాలను ఐసీసీ పరిగణలోకి తీసుకుంటుందా..? వేదికలను మార్పు చేసే అవకాశం ఉందా..? అన్నది కొద్ది రోజుల్లోనే తేలనుంది.