https://oktelugu.com/

ICC: ఐసీసీ చారిత్రాత్మక నిర్ణయం.. ఇకపై మహిళా క్రికెటర్లకు అందులో సమాన వాటా

క్రికెట్.. ఈ జెంటిల్మెన్ గేమ్ లో మొదటి నుంచి పురుషులదే ఆధిపత్యం. గత దశాబ్దంగా మహిళల క్రికెట్ ప్రాచుర్యం పొందుతున్నప్పటికీ.. పురుషుల క్రికెట్ తో పోల్చితే చాలా తక్కువ. ఇప్పుడిప్పుడే మహిళలకు అవకాశాలు లభిస్తున్నప్పటికీ.. వారికి అందుతున్న ప్రైజ్ మనీ చాలా తక్కువ.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 17, 2024 / 04:24 PM IST

    ICC

    Follow us on

    ICC: ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీలలో పురుష జట్లకు భారీగా నజరానా అందుతుంది. టి20, వన్డే, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్, ఛాంపియన్స్ ట్రోఫీ.. ఇలా ఐసీసీ నిర్వహించే మేజర్ టోర్నీలకు ప్రైజ్ మనీ భారీగా ఉంటుంది. అదే మహిళల విషయానికి వచ్చేసరికి ప్రైజ్ మనీ ఈ స్థాయిలో ఉండదు. అయితే ఈ అంతరానికి ఐసీసీ చెక్ పెట్టనుంది . పురుషులతో పాటుగా స్త్రీలకు కూడా సమాన ప్రైజ్ మనీ అందించనుంది. త్వరలో యూఏఈ వేదిక జరిగే మహిళల టి20 ప్రపంచ కప్ లో మొత్తం ప్రైజ్ మనీ 7.96 మిలియన్ డాలర్లుగా ఐసీసీ ప్రకటించింది. ఇందులో విజేత జట్టుకు 2.34 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ లభిస్తుంది. అంతకుముందు దానితో పోల్చితే పెంచిన ప్రైజ్ మనీ 225% ఎక్కువ. మహిళలకు పురుషులతో సమానంగా ప్రైజ్ మనీ ఇవ్వాలని జూలై 2023 లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ సమానత్వ లక్ష్యాన్ని 2030 నుంచి అమలు చేయాలని భావించింది. కానీ ఆరు సంవత్సరాల ముందుగానే దానిని అమలు చేయడం మొదలుపెట్టింది. దీంతో మహిళా క్రికెటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ తీసుకున్న నిర్ణయం మహిళల క్రికెట్ వృద్ధి చెందినందుకు కారణమవుతుందని వ్యాఖ్యానించారు.

    యూఏఈ వేదికగా ..

    యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా త్వరలో మహిళల టి20 వరల్డ్ కప్ జరుగుతుంది. 2023లో మహిళల t20 వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. అప్పుడు ఆస్ట్రేలియా మహిళల జట్టుకు 1 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ లభించింది. ఇప్పుడు ఆ నగదు బహుమతిని 2.34 మిలియన్ డాలర్లకు పెంచుతూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. గతంతో పోల్చుకుంటే దాదాపు 134 శాతం పెరిగింది. ప్రస్తుతం పెరిగిన ప్రైజ్ మనీ ప్రకారం రన్నరప్ జట్టు 1.17 మిలియన్ డాలర్లు అందుకుంటుంది. గత వరల్డ్ కప్ లో రన్నరప్ జట్టుకు 500,000 డాలర్లు లభించాయి. గతంతో పోల్చితే ఈసారి ప్రైజ్ మనీ 134 శాతం పెరిగింది. ఇక సెమి ఫైనలిస్టులకు గతంలో 210,000 డాలర్ల ప్రైజ్ మనీ లభించేది. ఇప్పుడు అది 675,000 డాలర్లకు చేరుకుంది. ఈ టోర్నీ మొత్తం ప్రైజ్ మనీ మొత్తం 7,958,080 డాలర్లకు పెరిగింది. గతంలో ఇది 2.45 మిలియన్ డాలర్లుగా ఉండేది. దాంతో పోలిస్తే 225 శాతం పెరిగింది. మహిళల్లో క్రికెట్ ఆటపై ఆసక్తి పెంచేందుకు.. 2032 వరకు మరింత అభివృద్ధి సాధించేందుకు ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. పురుషులతో సమానంగా ప్రైజ్ మనీ ఇవ్వడం వల్ల ఆడవాళ్లకు కూడా క్రికెట్ ఆడాలనే కోరిక పెరుగుతుంది. తద్వారా క్రికెట్ విస్తరణకు మార్గం ఏర్పడుతుంది. కొత్త క్రీడాకారిణులు క్రికెట్ ను కెరియర్ గా ఎంచుకుంటారు.

    గ్రూప్ దశలో..

    గ్రూప్ దశలో విజయం సాధించిన జట్టుకు ఒక్కో మ్యాచ్ పై 31,154 డాలర్లు లభిస్తాయి. ప్రతి గ్రూపులో మూడు లేదా నాలుగు స్థానంలో నిలిచిన జట్లకు 270,000, 135,000 డాలర్ల ప్రైజ్ మనీ లభిస్తుంది. అలాగే పోటీలో పాల్గొనే అన్ని జట్లకు 112,500 డాలర్ల బహుమతి లభిస్తుంది. ఐసీసీ 2022 ప్రైజ్ ఫండ్ లో భాగంగా జమ చేసిన 3.5 మిలియన్ డాలర్లకు అనుగుణంగా ఈ నగదు బహుమతి ఉంటుంది. ఐసీసీ మహిళల టి20 ప్రపంచ కప్ -2024 అక్టోబర్ 3 షార్జా లోని క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్ – స్కాట్లాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ తో మొదలవుతుంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ ఐదు న శ్రీలంకతో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ తో ఇంగ్లాండ్ జట్టు తలపడతాయి. మొత్తం ఈ టోర్నీలో పది జట్లు పోటీ పడుతున్నాయి. దుబాయ్, షార్జా వేదికగా మొత్తం 23 మ్యాచ్ లు జరుగుతాయి.