ICC Champions Trophy
ICC Champions Trophy : చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో అడుగు పెట్టింది. సొంత దేశంలో ఆడుతోంది కాబట్టి.. 100% అడ్వాంటేజ్ ను భుజాలకు ఎత్తుకుంది. కానీ దానిని నిలబెట్టుకునే ప్రయత్నం చేయలేదు.. న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది.. భారత్ చేతిలో భంగపాటుకు గురైంది. మొత్తంగా చాంపియన్స్ ట్రోఫీలో తీవ్ర నిరాశ మధ్య నిష్క్రమించింది. వరుసగా రెండు మ్యాచులు ఓడిపోవడంతో.. పాకిస్తాన్ అధికారికంగానే ఛాంపియన్ ట్రోఫీ నుంచి వైదొలిగింది. 2023 వన్డే వరల్డ్ కప్, 2024 t20 వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ లీగ్ దశ నుంచే ఇంటికి వెళ్లిపోయింది. జట్టులో నెలకొన్న అంతర్గత సమస్యలు.. ఆటగాళ్ల మధ్య విభేదాలు.. మేనేజ్మెంట్ నిర్లక్ష్యం.. జట్టు కూర్పులో బాధ్యతరాహిత్యం వెరసి.. పాకిస్తాన్ జట్టు పరువును తీశాయి. అంతిమంగా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించేలా చేశాయి.
Also Read : పాక్ ఔట్.. అగ్రస్థానంలో భారత్.. ఛాంపియన్స్ ట్రోఫీ తాజా పాయింట్ల పట్టిక ఇదే
591 కోట్లు ఖర్చు చేసింది
1996 తర్వాత పాకిస్తాన్ ఇంతవరకు ఐసీసీ టోర్నీ నిర్వహించిన దాఖలాలు లేవు. సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్తాన్ క్రికెట్ మేనేజ్మెంట్ కు ఆ అవకాశం వచ్చింది. దీంతో ఆ మేనేజ్మెంట్ ఛాంపియన్స్ ట్రోఫీని గొప్పగా నిర్వహించాలని భావించింది. ఇందులో బాగానే 591 కోట్లు ఖర్చు చేసింది. ఇంత ఖర్చు చేసినప్పటికీ పాకిస్తాన్ గొప్పగా ఆడిన దాఖలాలు లేవు. ఒక్క మ్యాచ్లో కూడా పాకిస్తాన్ గెలువకపోవడంతో లీగ్ దర్శనం నుంచి ఇంటికి వెళ్ళిపోయింది. ఇక గ్రూప్ దశలో ఓడిపోయిన జట్టుకు ఐసిసి 2.3 కోట్లు మాత్రమే ఇస్తుంది.. దీంతో పాకిస్తాన్ జట్టుపై నెటిజన్లు తీవ్ర స్థాయి లో విమర్శలు చేస్తున్నారు..” చారాణ కోడికి బారాణ మసాలా నూరింది. ఆరు రూపాయలు సంపాదించడానికి 60 రూపాయలు ఖర్చు చేసింది. ఇప్పటికైనా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరు మారాలి. సెలక్టర్లు, క్రికెటర్లు, జట్టు కూర్పు.. ఇలా అన్ని విషయాలలో సమూల మార్పుకు శ్రీకారం చుట్టాలి. లేకపోతే పాకిస్తాన్ ఆట తీరు జింబాబ్వే కంటే దారుణంగా మారిపోతుంది. అప్పుడు అనుకున్నప్పటికీ ఉపయోగం ఉండదు. ఇప్పటికే సమయం మించిపోయింది. ఇకనైనా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టాలని” నెటిజన్లు పేర్కొంటున్నారు. జట్టులో ఉన్న విభేదాలపై ఇప్పటికే పాక్ కోచ్ పరోక్షంగా వ్యాఖ్యానించాడు..” జట్టులో ఆటగాళ్లకు ఎక్కువగా ఆడిన అనుభవం లేదు. కొన్ని విషయాలపై మేము ఇంకా దృష్టి సారించాల్సి ఉంది. ఆ తర్వాత జట్టు విషయంలో కూడా కసరత్తు చేయాల్సి ఉంది. అప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయి. కాకపోతే ఈ ఓటములను మేము సవాల్ గా తీసుకుంటామని” అతడు వ్యాఖ్యానించడం విశేషం.
Also Read : సంక్షోభంలో పాక్ క్రికెట్ జట్టు.. అలా చేస్తేనే గట్టెక్కేది?