
Sania Mirza : టెన్నిస్ కి మనదేశంలో ఆదరణ అంతంత మాత్రమే. కొన్ని దశాబ్దాల క్రితం అయితే ఎవరూ పట్టించుకునే వారు కాదు..దీంతో క్రీడాకారుల్లో భవిష్యత్తుపై భరోసా ఉంటుందని ఆశలు ఉండేవి కావు.. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె టెన్నిస్ ను కెరియర్గా ఎంచుకుంది. ఎన్నో ఆటంకాలను అధిగమించింది. అద్భుతమైన పోరాట స్ఫూర్తిని ప్రదర్శించింది. తాను ఎరిగింది. ఎంతో మందికి ప్రేరణగా నిలిచింది. తన అకాడమీ భవిష్యత్తు తారలకు శిక్షణ ఇస్తోంది. సానియా మీర్జా. తన కెరియర్ లో చివరి అంకాన్ని ముగించింది. 36 సంవత్సరాల సానియా ఆఖరి ఆట ఆడేసింది. మంగళవారం సాయంత్రం అమెరికా క్రీడాకారిణి మాడిసన్ కీస్ తో కలిసి డబుల్స్ మ్యాచ్ లో పాల్గొన్న సానియా ఆరంభ రౌండ్ లోనే ఓటమిపాలై అంతర్జాతీయ టెన్నిస్ కు గుడ్ బై చెప్పేసింది.
మొదట సింగిల్స్ లో…
సానియా మీర్జా మొదట సింగిల్స్ లో అడుగు పెట్టింది. తర్వాత డబుల్స్ లోకి మారింది. డబుల్స్ లో నెంబర్ వన్ ర్యాంక్, మూడు డబుల్స్, మూడు మిక్స్డ్ గ్రాండ్ స్లామ్స్ తో పాటు ఆసియా క్రీడల్లో 8, కామన్వెల్త్ క్రీడల్లో రెండు పతకాలు సాధించింది. ఇలా ఆమె సుదీర్ఘ కెరియర్లో ఎన్నో మహిళలు సాధించింది. సనాతన కట్టుబాట్లను అధిగమించి, కలలుగన్న జీవితం కోసం పోరాడి గెలిచింది. సానియా మీర్జా పుట్టింది ముంబైలో.. పెరిగింది మాత్రం హైదరాబాదులోనే. ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పోర్ట్స్ జర్నలిస్ట్. తల్లి నసీమా వ్యాపారం చేసేది. చిన్నప్పుడే సానియాకు టెన్నిస్ అంటే ఇష్టం ఏర్పడింది. దీంతో ఆమె తండ్రి కొంతకాలం శిక్షకుడిగా వ్యవహరించాడు. 2001 నుంచి 2003 వరకు జూనియర్ సర్క్యూట్లో సానియా రాణించింది. 2003లో ప్రొఫెషనల్ గా మారింది. జూనియర్ స్థాయిలో 10 సింగిల్స్, 13 డబుల్స్ టైటిల్ లు కొల్లగొట్టింది. వైల్డ్ కార్డు ఎంట్రీ తో తొలిసారి డబ్బు టి ఏ టోర్నీ హైదరాబాద్ ఓపెన్ బరిలోకి దిగే అవకాశం దక్కించుకుంది. 2002 ఆసియా క్రీడల్లో లియాండర్ పేస్తో కలిసి మిక్స్డ్ డబుల్స్ లో కాంస్య పతకం సాధించింది.
-ఎంత సంపాదించింది అంటే?
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తన ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్‌లో మంగళవారం చివరి మ్యాచ్ ఆడింది. 2003లో ప్రొఫెషనల్‌గా మారిన 36 ఏళ్ల ఆమె కెరీర్‌లో ఒక సింగిల్స్ టైటిల్ మరియు 43 డబుల్స్ టైటిల్‌లను గెలుచుకుంది. ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ (WTA) ప్రకారం ఇప్పటివరకు ఆమె కెరీర్ మొత్తం ప్రైజ్ మనీ $7,261,296 (సుమారు ₹60 కోట్లు). అప్పట్లో తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయింది..ఇందుకు గానూ ప్రభుత్వం కోటి ఇచ్చింది. దీనిపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఇక సానియా ప్రస్తుతం ఆర్సీబీ వుమెన్స్ జట్టుకు మెంటార్ గా వ్యహరిస్తున్నది..ఇందుకు గానూ ఆర్సీబీ భారీగా ముట్టచెప్పినట్టు సమాచారం. ఇక హైదరాబాద్ శివారు లో నిర్వహిస్తున్న టెన్నిస్ అకాడమీ కి ప్రభుత్వం అప్పట్లో స్థలం కూడా ఇచ్చినట్టు,కేటీఆర్ కూడా చొరవ చూపినట్టు అప్పట్లో టాక్ నడిచింది.