Yashasvi Jaiswal: జైస్వాల్ బ్యాటింగ్ పరాక్రమం వెనుక ఉన్నది ఇతడే

జైస్వాల్ టీమిండియా యువ సంచలనంగా మారాడు. భారత టెస్ట్ క్రికెట్ జట్టుకు దొరికిన వజ్రాయుధంగా ప్రశంసలు పొందుతున్నాడు. ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో తన బ్యాటింగ్ పరాక్రమాన్ని చూపిస్తున్నాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : February 19, 2024 5:35 pm
Follow us on

Yashasvi Jaiswal:  విశాఖపట్నం టెస్టులో డబుల్ సెంచరీ సాధించాడు.. రాజ్ కోట్ టెస్టులోనూ డబుల్ సెంచరీ బాదాడు.. వెన్నునొప్పి ఇబ్బంది పెడుతున్నప్పటికీ.. వెన్ను చూపించని పరాక్రమం చూపించాడు. పై మాటలు చాలు టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్ గురించి చెప్పాలంటే.. ఏ ముహూర్తాన భారత జట్టులోకి అడుగు పెట్టాడో గాని.. అతడిని చూస్తేనే ఇంగ్లాండ్ బౌలర్లు వణికి పోతున్నారు. ఈ టెస్ట్ సిరీస్ లో ఇప్పటివరకు జై స్వాల్ రెండు డబుల్ సెంచరీలు సాధించాడు. ఒక హాఫ్ సెంచరీ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. జైస్వాల్ ఈ స్థాయిలో ఘనత సాధించేందుకు అతడి వెనుక ఒక వ్యక్తి ఉన్నాడు. స్థూలంగా చెప్పాలంటే అతడు జైస్వాల్ కు దేవుడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో ఈ కథనంలో తెలుసుకుందాం.

జైస్వాల్ టీమిండియా యువ సంచలనంగా మారాడు. భారత టెస్ట్ క్రికెట్ జట్టుకు దొరికిన వజ్రాయుధంగా ప్రశంసలు పొందుతున్నాడు. ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో తన బ్యాటింగ్ పరాక్రమాన్ని చూపిస్తున్నాడు. తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 80 పరుగులు చేసి సత్తా చాటిన ఈ యువకుడు.. విశాఖపట్నం టెస్టుల్లో డబుల్ సెంచరీ, రాజ్ కోట్ లో జరిగిన మ్యాచ్ లోనూ డబుల్ సెంచరీ సాధించాడు. ఈ సిరీస్ లో అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారుడిగా నిలిచాడు. బలమైన ఇంగ్లాండ్ జట్టుపై అనుభవం ఉన్న కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ వంటి వారు లేకపోయినప్పటికీ.. టీమిండియా బ్యాటింగ్ ను ఒంటి చేత్తో మోస్తున్నాడు జైస్వాల్. అతడి ఆటకు సీనియర్ల నుంచి జూనియర్ల వరకు ఫిదా అయిపోతున్నారు. 22 సంవత్సరాలకే ఈ స్థాయిలో ఆడుతుంటే.. కొంచెం అనుభవం వస్తే ఎంతటి బౌలర్లకైనా నిద్రలేని రాత్రులు పరిచయం చేస్తాడని క్రికెట్ అన్ని పనులు చెబుతున్నారు.

జై స్వాల్ ఈ స్థాయిలో రాణించడం వెనుక ఎంతో కష్టం దాగుంది. ఈ స్థాయికి రావడానికి అతడు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. జీవితానికి సరిపడా కష్టాలు ఎదుర్కొన్నాడు. కానీ అవన్నీ దాటి క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టి.. తన ఆట ద్వారా అందర్నీ సమ్మోహితులను చేశాడు. జైస్వాల్ లో ఉన్న ప్రతిభను ముందుగా జుబిన్ భారుచా అనే వ్యక్తి గుర్తించాడు. జుబిన్ భారుచా ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ టీంకు డైరెక్టర్ ఆఫ్ క్రికెటర్ గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ లో ట్రయల్స్ కోసం వచ్చిన జైస్వాల్ తాను ఎదుర్కొన్న మొదటి బంతినే  స్టంప్స్ వైపు వెనక్కి వంగి స్క్వేర్ షాట్ ఆడి సిక్సర్ గా మలిచాడు. ఆ షాట్ చూసిన జుబిన్ భారుచా జైస్వాల్ ఆటకు ఫిదా అయిపోయాడు. వెంటనే రాజస్థాన్ జట్టు కోసం తీసుకొని.. అతనిపై ప్రత్యేక దృష్టి సారించి.. స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించాడు. అతడి ఆట తీరుకు మరింత పదును పెట్టించాడు. ఒక్కో షాట్ ను 300 సార్లు ప్రాక్టీస్ చేయించి.. 100 మీటర్ల దూరం కొట్టేలాగా జైస్వాల్ కు శిక్షణ ఇచ్చాడు. అలా రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున 2020 సీజన్లోకి బరిలోకి దింపాడు. అప్పటినుంచి జైస్వాల్ ఆట ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జుబిన్ భారుచా నాడు జైస్వాల్ ఆటలో నైపుణ్యాన్ని గుర్తించకుండా ఉండి ఉంటే టీమిండియా ఒక వజ్రాయుధాన్ని కోల్పోయేదనడంలో ఎటువంటి సందేహం లేదు.