Ravichandran Ashwin : టీమిండియా ఏస్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో 500 వికెట్లు తీశాడు. ఈ ఘనత సాధించిన రెండవ భారత జట్టు బౌలర్ గా రికార్డు సృష్టించాడు. అతని కంటే ముందు టీమిండియా స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఉన్నాడు. 132 మ్యాచ్ ల్లో 619 వికెట్లు తీశాడు. రవిచంద్రన్ 98 మ్యాచ్ లలో 501 వికెట్లు తీశాడు.
రాజ్ కోట్ మైదానం వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్లో అతడు ఈ ఘనత సాధించాడు.. ఈ ఘనత సాధించిన ఆనందం అతడికి ఎంతో సేపు లేదు. ఇంటి దగ్గర నుంచి ఫోన్ రావడంతో జట్టు అనుమతి తీసుకుని రాజ్ కోట్ నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లిపోయాడు.. తన మాతృమూర్తికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో.. క్లిష్ట పరిస్థితుల్లో ఆమె పక్కనే ఉండాలని అతడు నిర్ణయించుకున్నాడు. అతని కోరికను భారత జట్టు మేనేజ్మెంట్ మన్నించింది. ఆ తర్వాత అతడు ఒకరోజు తన తల్లి వద్ద గడిపి ఆదివారం జరిగిన ఆటలో జట్టులో భాగమయ్యాడు.
రవిచంద్రన్ అశ్విన్ 500 వికెట్లు తీసిన తర్వాత అతడి భార్య ప్రీతి భావోద్వేగానికి గురైంది. ఈ సందర్భంగా తన అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది. ” ఇది ఎంతో ఉద్వేగమైన సమయం. రాజ్ కోట్ లో కాకుండా హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం వేదిక జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లోనే ఈ ఘనత సాధించాలని అశ్విన్ చాలా ప్రయత్నించాడు. కానీ అది నెరవేరలేదు. విశాఖపట్నంలోనూ తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ ఉపయోగం లేకుండా పోయింది. 499 వికెట్లు సాధించినప్పుడే.. కచ్చితంగా 500 వికెట్లు కూడా తీస్తాడని అందరం అనుకున్నాం. ఆ వేడుకను ఇతరులతో జరుపుకోవాలని భావించి మిఠాయిలు కూడా పంచిపెట్టాం. మూడో టెస్టులో రాజ్ కోట్ మైదానంలో అతడు 500 వ టెస్ట్ వికెట్ సాధించాడు. కానీ మేమంతా అలా చూస్తూ ఉండిపోయాం. ఎందుకంటే 500 నుంచి 501 వికెట్లను అతడు సాధించేవరకు మా కుటుంబంలో చాలా జరిగాయి. ఆ 48 గంటలు అత్యంత సుదీర్ఘంగా సాగాయి. నేను చెప్తున్నది 500వ వికెట్ సాధించినప్పుడు.. అంతకు ముందు జరిగిన దాని గురించి.. నిజంగా అశ్విన్ చాలా ప్రతిభావంతమైన వ్యక్తి. అతడిని చూసి మేము చాలా గర్వపడుతున్నాం. అతడిని ఎప్పటికీ మేము ప్రేమిస్తూనే ఉంటాం” అని ప్రీతి ఇన్ స్టా గ్రామ్ లో రాసుకొచ్చింది.
అశ్విన్ తల్లి అనారోగ్యానికి గురైనప్పుడు ప్రీతి చెన్నైలోనే ఉంది.. అతడు బాధపడకుండా ఉండేందుకు ధైర్య వచనాలు చెప్పింది. ఆస్పత్రిలో వైద్యులతో ఎప్పటికప్పుడు తన అత్త ఆరోగ్యం గురించి వాకబు చేసింది. అర్ధాంతరంగా జట్టు నుంచి వెళ్లిపోయిన అశ్విన్.. ఆ తర్వాత ఒక్కరోజులోనే జట్టులోకి వచ్చాడు అంటే దానికి కారణం ప్రీతీనే.. అందుకే తను నా విజయాల వెనుక ఉన్న అత్యంత కీలకమైన వ్యక్తి అని పలు సందర్భాల్లో అశ్విన్ వ్యాఖ్యానించాడు.