IND vs ENG 4th test: ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా రాజ్ కోట్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత్ భారీ విజయం సాధించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 434 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ సీరీస్ కు ముందు బజ్ బాల్ క్రికెట్ అంటూ రకరకాల వ్యాఖ్యలు చేసిన ఇంగ్లాండ్ జట్టును రోహిత్ ఆధ్వర్యంలో టీమిండియా రెండోసారి ఓడించడం విశేషం. ఇదే సమయంలో రాంచి వేదికగా జరిగే 4వ టెస్టులో నెగ్గి సిరీస్ పట్టాలని టీం ఇండియా చూస్తోంది. ఇప్పటికే 2-1 లీడ్ లో ఉన్న టీమిండియా.. రాంచి టెస్ట్ గెలిస్తే 3- 1 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంటుంది. అందుకే ఈ మ్యాచ్ ను భారత్ చాలా సీరియస్ గా తీసుకుంటున్నది.
రాజ్ కోట్ లో గెలిచి ఎంతో ఉత్సాహంగా ఉన్న టీమిండియా కు రాంచీ టెస్ట్ లో ఒక కీలకమైన బ్యాటర్ దూరం కానున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ టీం కు దూరం కావడం.. యశస్వి జైస్వాల్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు కాబట్టి ఆ ప్రభావం కనిపించడం లేదు. అయితే ఆ బ్యాటర్ దూరమైతే రోహిత్ ఎలా నెట్టుకు వస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఆ మ్యాచ్ విన్నర్ తో పాటు రాంచీ టెస్ట్ మ్యాచ్ కు టీమిండియా ఫేస్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా దూరం కానున్నాడని సమాచారం. పని భారం కారణంగా అతనికి విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్టు సమాచారం. విశ్రాంతిలో భాగంగా అతడు తన స్వస్థలం అహ్మదాబాద్ వెళ్తాడని జట్టు వర్గాలు చెబుతున్నాయి. ఇక నాలుగో టెస్ట్ కోసం భారత ఆటగాళ్ల బృందం ఫిబ్రవరి 20న రాంచి చేరుకుంటుంది. ఫిబ్రవరి 21 నుంచి అక్కడ ప్రాక్టీస్ మొదలు పెడుతుంది. విశ్రాంతి ఇస్తున్న నేపథ్యంలో బుమ్రా రాంచి కాకుండా అహ్మదాబాద్ వెళ్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై భారత క్రికెట్ సమాఖ్య అధికారికంగా ప్రకటన చేయలేదు.
నాలుగో టెస్ట్ మాత్రమే కాదు ఐదో టెస్టులో కూడా బుమ్రా ఆడేది అనుమానమేనని క్రీడా నిపుణులు అంటున్నారు. నాలుగో టెస్ట్ ఫలితం భారత జట్టుకు అనుకూలంగా వస్తే ఐదో టెస్టులో బుమ్రా ఆడబోడని.. ఒకవేళ నాలుగో టెస్ట్ ఫలితం భారత జట్టుకు వ్యతిరేకంగా వస్తే ఐదో టెస్ట్ మ్యాచ్లో అతడు ఆడతాడని క్రీడానిపుణులు చెబుతున్నారు. అతడి స్థానంలో యువ ఆటగాడికి అవకాశం ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఈ సిరీస్ కు నాలుగో టెస్ట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారిన నేపథ్యంలో. బుమ్రాను ఆడించాలని అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా బీసీసీఐని కోరుతున్నారు. మరి దీనిపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.