Harshit Rana: గంభీర్ సపోర్ట్ తో టీమిండియాలో వరుస సిరీస్ లలో చోటు సంపాదించుకుంటున్నాడు హర్షిత్ రాణా. ఐపీఎల్ లో ఒక మోస్తరు ప్రదర్శనతో ఇతడు వెలుగులోకి వచ్చాడు. అప్పట్లో ఇతడు గౌతమ్ గంభీర్ కు అత్యంత ఇష్టమైన క్రికెటర్ గా మారిపోయాడు. గౌతమ్ గంభీర్ కోచ్ అయిన తర్వాత హర్షిత్ ను అవకాశాలు తలుపు తట్టాయి. దీంతో అతడు వరుస సిరీస్లలో ఆడాడు. అవకాశాలు భారీగానే వచ్చినప్పటికీ అతడు అంతగా ఉపయోగించుకోలేదు. దీంతో గౌతమ్ గంభీర్ తో పాటు హర్షిత్ మీద కూడా విమర్శలు పెరిగిపోయాయి. ఎంతమంది సామర్థ్యం ఉన్న ఆటగాళ్లు ఉన్నప్పటికీ హర్షిత్ ను ఎందుకు ఎంపిక చేస్తున్నారని మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్ ను విమర్శించడం మొదలుపెట్టారు.
Also Read: 2026 లో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వనున్న మెగాస్టార్..చరిత్రలో ఇదే తొలిసారి!
ఆస్ట్రేలియా సిరీస్ లో కూడా తొలి రెండు వన్డేలలో హర్షిత్ అంతగా ఆకట్టుకోలేదు. ధారాళంగా పరుగులు ఇచ్చాడు. వికెట్లు తీయడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో అతడికి అసలు జట్టులో ఉండే అవకాశం కూడా లేదని అభిమానులు వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. అతని స్థానంలో మరొక బౌలర్ కు అవకాశం ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. అయితే హర్షిత్ సిడ్నీ వన్డేలో ఒక్కసారిగా అదరగొట్టాడు. భారీ స్కోర్ దిశగా పరుగులు పెడుతున్న ఆస్ట్రేలియా కు కళ్లెం వేశాడు. ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. 8.4 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన హర్షిత్.. 39 పరుగులు ఇచ్చాడు. నాలుగు వికెట్లు పడగొట్టాడు. ప్రమాదకరమైన అలెక్స్ క్యారీ, కనోలీ, ఓవెన్, హేజిల్ వుడ్ వికెట్లను పడగొట్టి.. అదరగొట్టాడు. హర్షిత్ దూకుడు వల్లే ఆస్ట్రేలియా జట్టు 236 పరుగులకు కుప్పకూలింది.
హర్షిత్ ఈ స్థాయిలో ప్రదర్శన చేయడానికి కారణం ఉంది. ఆ కారణం పేరు గౌతమ్ గంభీర్. ఎందుకంటే హర్షిత్ కు వరుస అవకాశాలు ఇస్తోంది గౌతమ్ గంభీర్. కాకపోతే వాటిని హర్షిత్ అంతగా వినియోగించుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో అతనిపై గౌతమ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడని తెలుస్తోంది. పూర్తిస్థాయిలో గనుక ప్రతిభను ప్రదర్శించకపోతే తదుపరి సిరీస్ లలో చోటు లభించదని గౌతమ్ గంభీర్ హెచ్చరించడంతో.. హర్షిత్ గాడిలో పడ్డట్టు తెలుస్తోంది. అందువల్లే సిడ్నీ వన్డేలో అదరగొట్టాడు. ఈ విషయాన్ని హర్షిత్ తన స్నేహితుడు శ్రవణ్ కు ఫోన్ చేసి చెప్పాడు. సిడ్నీ వన్డే కి ముందు శ్రవణ్ కు హర్షిత్ ఫోన్ చేశాడు.. తన ప్రదర్శన పై గౌతమ్ గంభీర్ ఏమాత్రం సంతృప్తిగా లేడని.. తదుపరి అవకాశాలు రావాలంటే ప్రతిభను నిరూపించుకోవాలని చెబుతున్నారని.. అందువల్లే తాను మైదానంలో ఎక్కువ గడుపుతున్నట్టు శ్రవణ్ తో హర్షిత్ వ్యాఖ్యానించాడు. వాస్తవానికి హర్షిత్ ను గౌతమ్ గంభీర్ కు అత్యంత దగ్గర వ్యక్తి అని చాలామంది పేర్కొంటారు. కానీ గౌతమ్ ప్రతిభ విషయంలో మాత్రమే అలా ఆలోచిస్తాడని.. వ్యక్తిగత స్వార్థానికి దూరంగా ఉంటాడని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.