Sunil Gavaskar: ఈ తరం వాళ్లకు సునీల్ గవాస్కర్ అంటే తెలియకపోవచ్చు గాని.. ఒకప్పుడు టీమ్ ఇండియాకు అద్భుతమైన విజయాలు అందించిన చరిత్ర అతడిది. సన్నీ అని అతడిని పిలుచుకుంటారు. ఏడు పదులు దాటిన వయసులోనూ సునీల్ గవాస్కర్ ఇప్పటికీ అదే స్థాయిలో శరీర సామర్థ్యంతో కనిపిస్తుంటాడు. ఈ వ్యాఖ్యతగా.. క్రికెట్ విశ్లేషకుడిగా సేవలు అందిస్తున్నాడు. అటువంటి సునీల్ గవాస్కర్ టీమిండియా విషయంలో తన అభిప్రాయాన్ని మొహమాటం లేకుండా చెబుతాడు. ఆటగాళ్లు బాగా ఆడితే అభినందిస్తాడు. దారుణంగా ఆడితే ఎటువంటి మొహమాటం లేకుండా విమర్శిస్తాడు.
Also Read: 2026 లో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వనున్న మెగాస్టార్..చరిత్రలో ఇదే తొలిసారి!
ముక్కుసూటి మనిషిగా పేరుపొందిన సునీల్ గవాస్కర్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా దర్శనమిస్తోంది. ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో విపరీతంగా సర్కులేట్ అవుతోంది. ఒక వ్యక్తిని సునీల్ గవాస్కర్ తీవ్రంగా తిట్టాడు. అసలు అతనికి బతికే హక్కు లేదని విమర్శించాడు. ఇంతకీ సునీల్ గవాస్కర్ ఆ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడానికి.. ఎవరూ ఊహించని విధంగా మండిపడడానికి ఒక కారణం ఉంది.
ప్రస్తుతం మన దేశం వేదికగా మహిళల వన్డే వరల్డ్ కప్ సాగుతోంది. ఈ సిరీస్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, భారత్, సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్ వెళ్ళిపోయాయి. సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత్, ఆస్ట్రేలియా తలపడాల్సి ఉంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు దక్షిణాఫ్రికా తో మ్యాచ్ ఆడేందుకు ఇండోర్ వచ్చారు. ఈ క్రమంలో తాము స్టే చేస్తున్న హోటల్ నుంచి కాఫీ షాప్ కోసం బయటికి వెళ్లారు. ఆ సమయంలో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వారిని వెంబడించాడు. అసభ్యకరంగా తాకాడు. ఆ వ్యక్తి పేరు అఖిల్ ఖాన్. పోలీసులు సీసీ కెమెరాలో కనిపించిన దృశ్యాల ఆధారంగా అతడిని గుర్తించారు. ఆ తర్వాత తమదైన శైలిలో అతనికి ట్రీట్మెంట్ ఇచ్చారు.
ఈ ఘటనపై సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. ఇటువంటి దారుణానికి పాల్పడిన ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించాడు.. ” మన దేశం మర్యాదలకు పెట్టింది పేరు. ఈ ఘటన గురించి విన్న తర్వాత బాధ కలిగింది. ఇది అత్యంత దారుణమైన సంఘటన. చట్టం తన పని తాను తీసుకొని పోతుంది. కానీ అటువంటి వ్యక్తికి కఠిన శిక్ష పడాలి. ఈ తరహా మనస్తత్వం ఉన్న వ్యక్తులకు భూమి మీద బతికే హక్కు లేదు. అతడికి కఠిన శిక్ష పడుతుందని భావిస్తున్నాను. అలాంటి చర్యలు తీసుకుంటేనే ఈ తరహా ఘటనలు మరోసారి జరగవు. న్యాయం జరగాలంటే ఇటువంటి వ్యక్తులకు సరైన బుద్ధి చెప్పాలి. ఆ శిక్ష కూడా నేరాలకు పాల్పడే వ్యక్తులకు భయం కలిగించే విధంగా ఉండాలని” సునీల్ పేర్కొన్నాడు.
వరల్డ్ కప్ లో భాగంగా టీమ్ ఇండియా ఆదివారం బంగ్లాదేశ్ జట్టుతో తన చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ తర్వాత టీమ్ ఇండియా ఆస్ట్రేలియా తో సెమీఫైనల్ ఆడుతుంది. గ్రూప్ దశలో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓటమిపాలైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. 2017 వన్డే ప్రపంచ కప్ సెమి ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఆస్ట్రేలియాను సెమీఫైనల్ లో ఓడించింది. ఇక ఫైనల్ చేరుకుంది. ఈసారి కూడా అదే సన్నివేశాన్ని పునరావృతం చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇటీవల న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత ఓపెనర్లు స్మృతి, ప్రతీక సెంచరీలతో అదరగొట్టారు. సెమి ఫైనల్లో కూడా వారు అదే స్థాయిలో ప్రదర్శన చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.