Hardik Pandya: ఆసియా కప్ లో అద్భుతమైన ప్రతిభ చూపించి.. ఏకంగా ట్రోఫీని సాధించి.. తిరుగులేని ఉత్సాహంలో ఉంది టీమిండియా. ఇదే ఊపులో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ కు సిద్ధమవుతోంది. ఈ సిరీస్ ద్వారా టీమ్ ఇండియాలోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆగమనం చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రోహిత్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. విరాట్ కోహ్లీ ఇంకా ప్రాక్టీస్ ప్రారంభించలేదు. బీసీసీఐ సంకేతాలు ఇచ్చినప్పటికీ విరాట్ నుంచి ఎటువంటి బదులు రాలేదని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఆస్ట్రేలియా జట్టుతో వన్డే సిరీస్ అంటే భారత్ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ రెండు జట్లు సమఉజ్జీలు.. ఆటపరంగా రెండు జట్లు పోటాపోటీ ప్రదర్శన చేస్తుంటాయి. బౌలింగ్లో అదరగొడుతుంటాయి. బ్యాటింగ్లో దుమ్ము లేపుతుంటాయి. మొత్తంగా చూస్తే రెండు కొదమసింహాల మధ్య అన్నట్టుగా పోటీ ఉంటుంది. అయితే ఇంతటి ప్రతిష్టాత్మకమైన ఈ సిరీస్ కు టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా దూరమవుతారని తెలుస్తోంది. ఎందుకంటే అతడు తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. ఆ గాయం నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. వన్డే సిరీస్ పూర్తయ్యే నాటికి గాయం మానకపోతే.. టి20లకు కూడా దూరమవుతాడని తెలుస్తోంది. అయితే దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అక్టోబర్ 19 నుంచి టీమిండియా ఆస్ట్రేలియాలో 3 వన్డేలు, 5 t20 లు ఆడుతుంది.
హార్దిక్ పాండ్యా ఇటీవల జరిగిన ఆసియా కప్ టోర్నీలో బౌలింగ్ లో మెరుగైన ప్రశ్న చేశాడు. బ్యాటింగ్లో మాత్రం సత్తా చూపించలేకపోయాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఒక ఓవర్ మాత్రమే వేసి అతడు తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత మళ్లీ బౌలింగ్ వేయడానికి రాలేదు. గాయం తగ్గకపోవడంతో ఫైనల్ మ్యాచ్ కు దూరమయ్యాడు. ఫైనల్ మ్యాచ్లో బౌలింగ్, బ్యాటింగ్ చేస్తాడనుకున్నప్పటికీ.. అతడు రిజర్వ్ బెంచ్ కు పరిమితమయ్యాడు. అతడి స్థానంలో రింకూ సింగ్ జట్టులోకి వచ్చాడు.
హార్దిక్ పాండ్యా ప్రస్తుతం తొడ కండరాల గాయం నయం కావడానికి చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. అయితే అతడు ఇంట్లో ఉన్నాడా? నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నాడా? అనే విషయాల గురించి క్లారిటీ లేదు. ఒకవేళ గాయం గనుక తగ్గితే అతడు ఆస్ట్రేలియా సిరీస్ లో ఆడతాడు. లేకపోతే అతడి స్థానంలో మరొక ఆటగాడికి అవకాశం లభిస్తుందని తెలుస్తోంది. అయితే ఇటీవల కాలంలో బౌలింగ్, బ్యాటింగ్ లో అదరగొడుతున్న హార్దిక్ పాండ్యా.. ఆసియా కప్ లో మాత్రం ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోయాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు.