Hardik Pandya Captain Mumbai Indians: ఐపీఎల్ లో అత్యంత ప్రభావంతమైన జట్లలో ముంబై ఇండియన్స్ ముందు వరుసలో ఉంటుంది. ఈ జట్టు ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. రోహిత్ శర్మ నేతృత్వంలో ఐపీఎల్ లో ముంబై జట్టు ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ప్రతిభావంతమైన ప్లేయర్లు ఉన్నప్పటికీ ఈ జట్టు కొంతకాలంగా స్థిరమైన విజయాలను కొనసాగించలేకపోతోంది. దీంతో ముంబై జట్టు యాజమాన్యం నాయకుడిని మార్చేసింది. రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాకు జట్టు పగ్గాలు అప్పగించింది.
2024 నుంచి ముంబై జట్టుకు పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు. ఆ సీజన్లో ముఖేష్ అంబానీ జట్టు ఆశించిన స్థాయిలో ఆడ లేకపోయింది. ఇక 2025లో ప్లే ఆఫ్ దాకా వెళ్ళినప్పటికీ.. ఒత్తిడికి గురై ఓటమిపాలైంది. ఈ సీజన్లో తొలి మ్యాచ్ లో ముంబై జట్టు ఘనవిజయం సాధించింది. 200 మించిన పరుగుల లక్ష్యాన్ని సైతం సులువుగా ఫినిష్ చేసింది. రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, రికెల్టన్ వంటి ప్లేయర్లతో అత్యంత భయంకరంగా ఉంది ముంబై జట్టు.
ఈ జట్టులో బౌలర్లు కూడా అదే స్థాయిలో ఉన్నారు. బుమ్రా, చాహర్, శాంట్నర్ ఇటువంటి బౌలర్లతో బౌలింగ్ దళం అత్యంత బలంగా ఉంది. అట్లాంటి ఈ జట్టు శనివారం ఢిల్లీలో ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓడిపోయింది. వాస్తవానికి ఈ మ్యాచ్ లో ముంబై జట్టుకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహించలేదు. అతడి స్థానంలో సూర్య కుమార్ యాదవ్ వచ్చాడు. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో సూర్య కుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్నప్పటికీ.. మిగతా బ్యాటర్లు అంతగా ఆకట్టుకోలేకపోవడంతో ముంబై జట్టు ఆశించిన స్కోర్ చేయలేకపోయింది.
ముంబై జట్టు ఓడిపోవడం అభిమానులకు ఏమాత్రం అంతుపట్టడం లేదు. అయితే ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా సారధిగా లేకపోవడం పట్ల రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. వ్యక్తిగత కారణాలవల్ల అతడు ఈ మ్యాచ్ కు దూరమయ్యాడని కొందరు అంటుంటే.. మరికొందరేమో గాయం వల్ల మ్యాచ్ కు దూరంగా ఉన్నాడని అంటున్నారు. ఇంకొందరేమో మేనేజ్మెంట్ అతడి ఆట తీరు పట్ల అంత సుముఖంగా లేదని.. అందువల్లే సూర్య కుమార్ యాదవ్ కు సారధ్య బాధ్యతలు అప్పగించిందని తెలుస్తోంది.
సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంలో ఇటీవల టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచింది. అతడు జట్టు పగ్గాలు అందుకున్న నాటి నుంచి ఇప్పటివరకు టీమిండియా ఒక్క టి20 సిరీస్ కూడా కోల్పోలేదు. ఆసియా కప్.. టి20 వరల్డ్ కప్ అతడి నాయకత్వంలో టీమిండియా సాధించింది. ఈ నేపథ్యంలో అతడికి జట్టు పగ్గాలు అప్పగించడానికి హార్దిక్ పాండ్యాను దూరం పెట్టారని.. ఒకవేళ తదుపరి మ్యాచ్లలో అందుబాటులోకి వచ్చినప్పటికీ.. అతడు సాధారణ ఆటగాడిగానే ఉంటాడని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా కూడా గాలి ప్రచారమని.. ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని.. ముంబై యాజమాన్యం హార్దిక్ పాండ్యా అనే సారధిగా కొనసాగిస్తుందని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ అట తీరుతో కాకుండా.. రెండవ మ్యాచ్ కు దూరమై హార్దిక్ పాండ్యా అటు జాతీయ.. ఇటు సోషల్ మీడియాలో ప్రధాన వార్తగా నిలుస్తున్నాడు.
