Bangladesh Vs Afghanistan: ఎంతకు తెగించార్రా? ఆఫ్ఘాన్ ఆటగాళ్ల నటన.. నోరెళ్లబెట్టిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు

టి20 వరల్డ్ కప్ లో భాగంగా సెయింట్ విన్సెంట్ వేదికగా మంగళవారం బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన సూపర్ -8 మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించింది. 8 పరుగుల తేడాతో గెలుపును దక్కించుకొని.. దర్జాగా సెమీస్ వెళ్ళిపోయింది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 25, 2024 5:47 pm

Bangladesh Vs Afghanistan

Follow us on

Bangladesh Vs Afghanistan: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు అంటేనే స్లెడ్జింగ్ కు పర్యాయపదం. పొరబాటున ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు మెరుగ్గా బ్యాటింగ్ చేసినా.. అద్భుతంగా బౌలింగ్ చేసినా.. చురుగ్గా ఫీల్డింగ్ చేసినా.. ఓర్చుకోలేరు. పైగా నోటికి పని చెబుతారు. మానసికంగా ప్రత్యర్థి ఆటగాళ్లను దెబ్బ కొడతారు. అంతిమంగా విజయం సాధిస్తారు. గతంలో ఆస్ట్రేలియా ఈ తీరుగానే వ్యవహరించినప్పటికీ.. గత కొంతకాలంగా వారి వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. అయితే స్లెడ్జింగ్ కు పర్యాయపదంగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుకు.. మంగళవారం నాటి సూపర్ -8 మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ స్లెడ్జింగ్ కు మించిన పని చేసింది. టీవీల్లో దీంతో మ్యాచ్ చూస్తున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లకు మతి పోయినంత పనైంది.. అదేంటి ఆఫ్ఘనిస్తా సూపర్ -8 మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో కదా తలపడింది.. మధ్యలో ఆస్ట్రేలియా వచ్చింది ఎందుకు? అనేకదా మీ డౌటు? అయితే ఈ కథనం చదివేయండి.

టి20 వరల్డ్ కప్ లో భాగంగా సెయింట్ విన్సెంట్ వేదికగా మంగళవారం బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన సూపర్ -8 మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించింది. 8 పరుగుల తేడాతో గెలుపును దక్కించుకొని.. దర్జాగా సెమీస్ వెళ్ళిపోయింది. అయితే బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ సమయంలో మైదానంలో అనేక నాటికే పరిణామాలు చోటుచేసుకున్నాయి. టి20 వరల్డ్ కప్ చరిత్రలో ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్ వెళ్లడం ఇదే తొలిసారి. సూపర్ -8 పోరులో భాగంగా బంగ్లాదేశ్ జట్టుతో ఆఫ్ఘనిస్తాన్ హోరాహోరిగా పోరాడాల్సి వచ్చింది. ఒకానొక దశలో ఆస్ట్రేలియా సెమీస్ వెళ్లే అవకాశాలు కనిపించాయి. బంగ్లాదేశ్ చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ఓటమిపాలైతే కచ్చితంగా కంగారు జట్టు సెమీఫైనల్ కు అర్హత సాధిస్తుంది. అంతేకాదు ఆ సమయంలో బంగ్లాదేశ్ జట్టు గెలుపు దిశగా సాగుతోంది.

సరిగ్గా ఇలాంటప్పుడే ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు ఆటకు కావాలనే ఆటంకం కలిగించారు. ఆటను ఆలస్యంగా ప్రారంభిస్తే.. ఒకవేళ ఆ సమయంలో వర్షం కురిస్తే.. మ్యాచ్ రద్దు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే అప్పటికే డక్ వర్త్ లూయిస్ విధానం ప్రకారం చూసుకుంటే బంగ్లాదేశ్ రెండు పరుగుల దూరంలో ఉంది.. 11.4 ఓవర్లకు బంగ్లాదేశ్ ఏడు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. ఆ సమయంలో బంగ్లాదేశ్ విజయానికి 45 బంతుల్లో 33 పరుగులు కావలసి వచ్చింది. అయితే ఆ సమయంలో చిన్నపాటి వాన జల్లులు కురవడం ప్రారంభమైంది. అప్పటికే పలుమార్లు వాన జల్లులు కురవడంతో ఆటకు ఆటంకం ఏర్పడింది.. ఓసారి ఆటను నిలిపి వేస్తే ఓవర్లను కచ్చితంగా తగ్గించి మ్యాచ్ ను కుదిస్తారు. ఇది ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఉపకరిస్తుంది. ఈ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ కోచ్ జొనాతన్ ట్రోట్ మైదానంలో ఉన్న తమ జట్టు ఆటగాళ్లకు సంకేతాలు ఇచ్చాడు. మ్యాచ్ ను నెమ్మదిగా సాగేలా చేయాలని సూచనలు చేశాడు. దీంతో స్లిప్ లో ఉన్న గుల్బాదిన్ నైబ్ తొడ కండరాలు పట్టేశాయని అకస్మాత్తుగా మైదానంలో కుప్పకూలిపోయాడు.. వాస్తవానికి ఆ విషయం అంపైర్లకు తెలిసినప్పటికీ చేష్టలుడిగి చూశారు.. ఇది జరుగుతుండగానే మరోవైపు జల్లులు కురవడం మరింత పెరిగింది. దీంతో అంపైర్లు కవర్లు తెప్పించారు. ఔట్ ఫీల్డ్ పై కప్పారు. 10 నిమిషాలకే మ్యాచ్ మళ్లీ తిరిగి ప్రారంభమైంది.

ఈ క్రమంలో డక్ వర్త్ లూయిస్ విధానంలో బంగ్లా జట్టు విజయ లక్ష్యాన్ని 48 బంతుల్లో 33 పరుగుల నుంచి 42 బంతుల్లో 32 పరుగులుగా అంపైర్లు నిర్ణయించారు. ఆ ప్రకారం ఓవర్ తగ్గించి బంగ్లా లక్ష్యాన్ని ఒక్క పరుగుకు తగ్గించారు. ఇది ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు అనుకోని అదృష్టంగా మారింది. మరోవైపు ఈ పరిణామం బంగ్లాదేశ్ జట్టును తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. ఫలితంగా బంగ్లాదేశ్ కీలక సమయంలో చేతులెత్తేసింది. బంగ్లా తో పాటు ఆస్ట్రేలియా కూడా ఈ టోర్నీ నుంచి ఇంటిదారి పట్టింది.