Beggars: దేశంలో అత్యధికంగా భిక్షగాళ్లు ఉన్న రాష్ట్రం ఏది? ఎంతమంది ఉన్నారో తెలుసా?

దేశంలో అత్యధికంగా యాచకులు ఈశాన్య రాష్ట్రం అసోంలో ఉన్నారు. ఇక్కడ లక్ష మంది జనాభాలో 71 మంది యాచకులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Written By: Raj Shekar, Updated On : June 25, 2024 5:51 pm

Beggars

Follow us on

Beggars: నిత్యం మనకు రోడ్లమీద యాచకులు కనిపిస్తారు. మనకు సాయం చేయాలనిపిస్తే తోచిన సాయం చేస్తాం.. లేదంటే మనకెందుకులే అని వెళ్లిపోతాం. కానీ ఎప్పుడూ ఈ యాచకుల గురించి ఆలోచించలేదు. కానీ రానురాను… ఇది సామాజిక సమస్యగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యాచక వృత్తి అతిపెద్ద సమస్యగా రూపాంతరం చెందుతుందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా మన దేశం ఎదుర్కొనే అతి పెద్ద సమస్యల్లో ఇది కూడా చేరుతుందని అంటున్నారు. ప్రస్తుతం దేశంలో లక్ష మంది జనాభాలో 30 మంది యాచకులే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీనికితోడు బెగ్గింగ్‌ మాఫియా రెచ్చిపోతోంది. ఈ పరిస్థితిలో దేశంలోని యాచకుల బాధ్యత ఎవరిది అన్న ప్రశ్న తలెత్తుతోంది.

అసోంలో అత్యధికంగా..
దేశంలో అత్యధికంగా యాచకులు ఈశాన్య రాష్ట్రం అసోంలో ఉన్నారు. ఇక్కడ లక్ష మంది జనాభాలో 71 మంది యాచకులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈశాన్య రాస్ట్రాల్లో అత్యధికంగా 22,116 మంది యాచకులతో అసోం అగ్రస్థానంలో ఉంది. ఇక పశ్చిమ బెంగాల్‌లో లక్ష మంది జనాభాకు గతంలో 89 మంది యాచకులు ఉండేవారు. ప్రస్తుతం అక్కడ యాచకులు తగ్గిపోయారు. దీంతో ఆ స్థానాన్ని అసోం అక్రమించింది.

ఈశాన్య రాష్ట్రాల్లోనే..
యాచకులు మన దేశంలో ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాల్లోనే ఉన్నారు. త్రిపురలో లక్ష మందికి 41 మంది యాచకులు ఉన్నారు. మిజోరంలో లక్ష మంది జనాభాకు 5 మంది యాచకులు మాత్రమే ఉండగా, నాగాలాండ్‌లో 6 మంది ఉన్నారు.

దేశంలో 4 లక్షలకుపైగా యాచకులు..
ఇక అధికారిక లెక్కల ప్రకారం దేశంలో 4,13,670 మంది యాచకులు ఉన్నారు. అయితే అనధికారికంగా ఈ సంఖ్య రెండు మూడు రెట్లు ఉంటుందని తెలుస్తోంది. అధికారిక లెక్కల్లో 2,21,673 మంది పురుష యాచకులు ఉండగా, 1,91,997 మంది మహిళా బిచ్చగాళ్లు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా, పశ్చిమ బెంగాల్, అసోం, మణిపూర్‌ రాష్ట్రాల్లో మహిళా బిచ్చగాళ్ల సంఖ్య వారి పురుషుల కంటే ఎక్కువగా ఉందని పేర్కొంది.

రాష్ట్రాల వారీగా ఇలా..
ఇక దేశంలో రాష్ట్రాల వారీగా యాచకుల సంఖ్య పరిశీలిస్తే పశ్చిమబెంగాల్‌లో 81,224 మంది, ఉత్తరప్రదేశ్‌లో 65,835 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 30,218 మంది, బిహార్‌లో 29,723 మంది, మధ్యప్రదేశ్‌లో 28,695 మంది, రాజస్థాన్‌లో 25,853 మంది ఉన్నారు. దేశరాజధాని ఢిల్లీలో 2,187 మంది యాచకులు ఉండగా, చండీగఢ్‌లో 121 మంది బిచ్చగాళ్లు ఉన్నారు. అత్యల్పంగా లక్ష్యద్వీప్‌లో కేవలం ఇద్దరు యాచకులే ఉన్నారు. దాద్రా నగర్‌ హవేలీ, డామన్, డయ్యూ, అండమాన్, నికోబార్‌ దీవులలో వరుసగా 19, 22, 56 మంది బిచ్చగాళ్లు ఉన్నారు.

పెరుగుతున్న యాచకులు..
ప్రస్తుతం ఈ సంఖ్య రెండు మూడు రెట్లు పెరిగి ఉంటుంది. ఇందుకు కారణం, పేదరికం ఒకటి అయితే.. సోమరితనం, మానసిక సమస్యలు, చదువుకు తగిన ఉద్యోగం రాకపోవడం వంటి కారణాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఉన్నత చదువులు చదివిన వారు కూడా యాచకులుగా మారుతున్నారని పేర్కొంటున్నారు. దీని నియంత్రణకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టకుంటే.. భవిష్యత్‌లో అతిపెద్ద సమస్యగా మారడం ఖాయం.