https://oktelugu.com/

LSG vs GT : గెలిచే మ్యాచ్ చేజేతులారా ఓడిన లక్నో.. కేఎల్ రాహుల్ నీకు శని ఉందబ్బా!

LSG vs GT : గుజరాత్ టైటాన్స్ – లక్నో సూపర్ జెయింట్స్ మధ్య శనివారం సాయంత్రం జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ రేపింది. మొదటి బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 135 పరుగులు మాత్రమే చేయగా.. 136 పరుగుల స్వల్ప లక్ష్యంతో చేజింగ్ కు దిగిన లక్నో జట్టు ఏడు పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. సులభంగా గెలవాల్సిన ఈ మ్యాచ్ లో లక్నో జట్టు ఓటమికి గురికావడం అందరినీ ఆశ్చర్యానికి […]

Written By:
  • NARESH
  • , Updated On : April 22, 2023 / 08:40 PM IST
    Follow us on

    LSG vs GT : గుజరాత్ టైటాన్స్ – లక్నో సూపర్ జెయింట్స్ మధ్య శనివారం సాయంత్రం జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ రేపింది. మొదటి బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 135 పరుగులు మాత్రమే చేయగా.. 136 పరుగుల స్వల్ప లక్ష్యంతో చేజింగ్ కు దిగిన లక్నో జట్టు ఏడు పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. సులభంగా గెలవాల్సిన ఈ మ్యాచ్ లో లక్నో జట్టు ఓటమికి గురికావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చివరి ఓవర్ వరకు క్రీజులో ఉన్నప్పటికీ మ్యాచ్ గెలిపించుకోలేకపోయాడు కేఎల్ రాహుల్.

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ ఆసక్తికరంగా సాగుతోంది. దాదాపు ప్రతి మ్యాచ్ చివరి ఓవర్ వరకు వస్తుండడంతో విజయం రెండు జట్ల మధ్య దోబూచులాడుతోంది. థ్రిల్లింగ్ కలిగించేలా మ్యాచ్ లు సాగుతుండడంతో అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. శనివారం సాయంత్రం జరిగిన మొదటి మ్యాచ్ లో గుజరాత్ జట్టు చివరి ఓవర్ లో గెలిచి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. స్వల్ప లక్ష్యమే అయినప్పటికీ చివరి ఓవర్ లో తడబాటుకు గురై లక్నో జట్టు ఓటమి పాలు కావాల్సి వచ్చింది.

    టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హార్దిక్ పాండ్యా..

    లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ జట్టు ముందు బ్యాటింగ్ ఎంచుకుంది. బౌలింగ్ కు అనుకూలించిన ఈ పిచ్ పై బ్యాటింగ్ చేయడం ఇబ్బందికరంగా ఉండడంతో పరుగులు పెద్దగా రాలేదు. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా 37 బంతుల్లో 47 పరుగులు చేయగా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 50 బంతుల్లో 66 పరుగులు చేశాడు. మ్యాచ్ చివరి ఓవర్ వరకు క్రీజులో లో నిలిచి జట్టు మెరుగైన స్కోర్ చేసేందుకు హార్దిక్ పాండ్యా ఎంతగానో కృషి చేశాడు. వీరిద్దరు మినహా జట్టులో ఎవరు చెప్పుకోదగ్గ స్కోర్ చేయకపోవడంతో.. మొదటి బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. లక్నో జట్టులో స్టోయినిస్, క్రునాల్ పాండ్యా రెండేసి వికెట్లు తీశారు.

    స్వల్ప లక్ష్యం.. అదరగొట్టిన ఓపెనర్లు..

    బౌలింగ్ కు అనుకూలించే పిచ్ పై ఈ స్కోర్ ను లక్నో జట్టు ఎలా చేజ్ చేస్తుందని అంతా భావించారు. మొదటి రెండు ఓవర్లు కాస్త చూసి ఆడిన ఓపెనర్లు కేఎల్ రాహుల్, కైల్ మేయర్.. మూడో ఓవర్ నుంచి జూలు విధిల్చారు. 6.2 ఓవర్లలో 55 పరుగులు చేసి.. జట్టుకు విజయాన్ని సునాయాసం చేశారు. 6.3 ఓవర్ లో 55 పరుగుల వద్ద మేయర్స్ తొలి వికెట్ ను లక్నో జట్టు కోల్పోయింది. ఆ తర్వాత నుంచి జట్టుకు కోలుకోవడం కష్టమైంది. చేతిలో వికెట్లు ఉండడంతో చివర్లో హిట్టింగ్ చేసైనా విజయాన్ని చేజిక్కించుకుంటుందని లక్నో జట్టు అభిమానులు భావించారు. అందుకు అనుగుణంగానే వికెట్లు కాపాడుకుంటూ లక్నో జట్టు ముందుకు సాగింది. 14.3 ఓవర్ లో 106 పరుగులు వద్ద కృనాల్ రూపంలో రెండో వికెట్ కోల్పోయింది లక్నో జట్టు. అంటే ఈ దశలో లక్నో జట్టుకు 33 బంతుల్లో 30 పరుగులు కావాలి. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. లక్నో జట్టు విజయం గురించి ఎవరు ఆలోచించాల్సిన పని కూడా లేనంత పటిష్ట స్థితిలో ఉంది. అయితే ఇక్కడే ఓ అద్భుతం జరిగింది.

    పరుగు తీసేందుకు పాట్లు పడ్డ బ్యాటర్లు..

    33 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన దశలో క్రీజులో కెప్టెన్ కేఎల్ రాహుల్ అప్పటికే జోరుమీద ఉండడంతో విజయం గురించి ఎవరు ఆందోళన చెందలేదు. పాండ్య అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ కూడా విధ్వంసం సృష్టించగల బ్యాటర్ కావడంతో.. రెండు మూడు ఓవర్లు ఉండగానే మ్యాచ్ ఫినిష్ అవుతుందని అంతా భావించారు. కానీ ఎవరి ఊహలకు అందని విధంగా మ్యాచ్ ముగిసింది. 110 పరుగులు వద్ద నికోలస్ పూరన్ అవుట్ అయ్యాడు. క్రీజులో ఉన్నంతసేపు పూరన్ పరుగులు తీసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు.

    చివరి ఓవర్ లో తిప్పేసిన మోహిత్ శర్మ..

    చివరి రెండు ఓవర్లలో లక్నో జట్టు విజయానికి 17 పరుగులు అవసరం కాగా.. 19 ఓవర్ బౌలింగ్ చేసిన మహమ్మద్ షమీ ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో చివరి ఓవర్లో లక్నో జట్టు విజయానికి 12 పరుగులు కావాల్సి వచ్చింది. అప్పటికే క్రీజులో కేఎల్ రాహుల్, ఆయుష్ బదోని ఉన్నారు. దీంతో విజయం సులభంగానే దక్కుతుందని లక్నో అభిమానులు భావించారు. అయితే ఇక్కడే మోహిత్ శర్మ అద్భుతం చేశాడు. తొలి బంతిని రాహుల్ కు బౌలింగ్ చేయగా రెండు పరుగులు వచ్చాయి. రెండో బంతికి రాహుల్ క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు. దీంతో గుజరాత్ జట్టు వైపు మ్యాచ్ మొగ్గింది. క్రీజులోకి స్టోయినిస్ వచ్చాడు. అప్పటికీ లక్నో జట్టు అభిమానులకు విజయంపై ఆశలు పోలేదు. అయితే, స్టోయినిస్ కూడా ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అవడంతో మ్యాచ్ దాదాపు గుజరాత్ జట్టు వశమైంది. చివరి మూడు బంతుల్లో పది పరుగులు అవసరం కాగా.. నాలుగో బంతిని హుడా ఎదుర్కొన్నాడు. రెండో పరుగుకు యత్నించి బదొని రన్ అవుట్ అయ్యాడు. దీంతో వరుస 3 బంతుల్లో మూడు వికెట్లను లక్నో జట్టు కోల్పోవాల్సి వచ్చింది. చివరి ఓవర్ లో మోహిత్ శర్మ అద్భుత బౌలింగ్ కు బోల్తా పడిన లక్నో జట్టు ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. కేఎల్ రాహుల్ దురదృష్టమే ఈ ఓటమి అంటూ పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇంతకంటే దారుణమైన ఓటమి మరొకటి ఉండదంటూ పలువురు వ్యాఖ్యానిస్తూ ఉండడం గమనార్హం.