GT Vs KKR: పరీక్ష రాకుండానే ఫెయిల్ అయితే ఎలా ఉంటుంది.. ఆ బాధ మామూలుగా ఉండదు కదా.. ప్రస్తుతం ఐపీఎల్ లో గుజరాత్ జట్టు అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. మునుపు విజేత.. నిరుడు రన్నరప్ గా నిలిచిన గుజరాత్ జట్టు.. ఈ ఏడాది లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఈ సీజన్లో పడుతూ లేస్తూ సాగిన గుజరాత్ ప్రయాణం.. చివరికి ప్లే ఆఫ్ చేరుకోకుండానే వైదొలగాల్సి వచ్చింది.. వాస్తవానికి సోమవారం రాత్రి కోల్ కతా తో జరగాల్సిన మ్యాచ్ లో విజయం సాధించి, ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని గుజరాత్ జట్టు భావించింది. కానీ, గుజరాత్ జట్టు ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. వాతావరణం ప్రతికూలంగా ఉండడంతో టాస్ ఆలస్యంగా వేస్తారని నిర్వాహకులు ప్రకటించారు. ఆ తర్వాత విపరీతంగా వర్షం కురిసింది.
రాత్రి 10:30 నిమిషాల సమయంలో వర్షం తగ్గింది. దీంతో మైదానంపై తప్పిన కవర్లను సిబ్బంది బయటకు తీశారు. ఈ నేపథ్యంలో 5 ఓవర్ల పాటు మ్యాచ్ కొనసాగిస్తారని అభిమానులు భావించారు. కానీ, రిఫరీ మ్యాచ్ కొనసాగించడం సాధ్యం కాదని స్పష్టం చేశాడు. దీంతో మ్యాచ్ రద్దయింది. మ్యాచ్ రద్దు కావడంతో గుజరాత్ జట్టు అధికారికంగా ఔట్ అయింది. మ్యాచ్ రద్దు వల్ల రెండు జట్లకు, చెరో పాయింట్ వచ్చింది. ఫలితంగా గుజరాత్ ఖాతాలో 11 పాయింట్లు చేరాయి. ప్రస్తుతం గుజరాత్ జట్టు తన తదుపరి మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో గుజరాత్ జట్టు విజయం సాధిస్తే.. కేవలం 13 పాయింట్లే ఆ జట్టు ఖాతాలో ఉంటాయి. గుజరాత్ కంటే హైదరాబాద్, లక్నో, చెన్నై, బెంగళూరు ఎక్కువ పాయింట్లు కలిగి ఉన్నాయి. కోల్ కతా 19, రాజస్థాన్ 16, చెన్నై 14, హైదరాబాద్ 14 పాయింట్లతో టాప్ -4 లో కొనసాగుతున్నాయి.
మ్యాచ్ రద్దు కావడంతో ప్రస్తుత సీజన్లో లీగ్ దశలోనే వైదొలిగిన మూడవ జట్టుగా గుజరాత్ నిలిచింది. ఇప్పటికే ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ టోర్నీ నుంచి బయటికి వెళ్లిపోయాయి. కోల్ కతా 19 పాయింట్లతో టేబుల్ టాపర్ గా ఉంది. ఒకవేళ కోల్ కతా జట్టు తను ఆడే చివరి మ్యాచ్లో ఓడిపోతే టాప్ -2 లో ఉంటుంది. కోల్ కతా ను రాజస్థాన్ జట్టు తప్ప.. మిగతా ఏ జట్టూ అధిగమించే అవకాశం లేదు. 12 మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ 16 పాయింట్లతో రెండవ స్థానంలో కొనసాగుతోంది. ఒకవేళ రాజస్థాన్ మిగిలిన రెండు మ్యాచ్లలో విజయం సాధిస్తే 20 పాయింట్లతో, టేబుల్ టాపర్ గా ఉంటుంది.