GT Vs DC IPL 2024: ఇది ఆ గుజరాత్ జట్టేనా..మరీ ఇంత చెత్తగానా..

వాస్తవానికి ఈ ఐపీఎల్లో పరుగుల వరద పారుతోంది. కానీ బుధవారం రాత్రి అహ్మదాబాద్ లో ఇందుకు విరుద్ధమైన సంఘటన చోటుచేసుకుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : April 18, 2024 10:25 am

GT Vs DC IPL 2024

Follow us on

GT Vs DC IPL 2024: ఎంట్రీ సీజన్లో ఐపీఎల్ కప్ దక్కించుకుంది. మరుసటి సీజన్ లో రన్నరప్ గా నిలిచింది. ఆ రెండు సీజన్లకు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా ఉన్నాడు.. ఈసారి అతడు ముంబై జట్టుకు వెళ్ళిపోయాడు. దీంతో గిల్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.. అయితే ఆ జట్టు రోజురోజుకు తీసి కట్టు తీరైన ఆటను ప్రదర్శిస్తోంది. గత రెండు సీజన్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఆ జట్టు ఇప్పుడు గల్లి స్థాయి ఆటతో నగుబాటుకు గురవుతోంది. బుధవారం రాత్రి సొంతమైదానంలో ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో అత్యంత చెత్త ఆటను ప్రదర్శించి దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. ఈ సీజన్లో ఏడు మ్యాచ్లు ఆడి.. నాలుగో పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. వైఫల్యం నుంచి గుణపాఠం నేర్చుకోలేక.. మ్యాచ్ మ్యాచ్ కూ బలహీనపడుతోంది. సొంత గడ్డపై 89 పరుగులకే కుప్పకూలి.. పరువు తీసుకుంది.

వాస్తవానికి ఈ ఐపీఎల్లో పరుగుల వరద పారుతోంది. కానీ బుధవారం రాత్రి అహ్మదాబాద్ లో ఇందుకు విరుద్ధమైన సంఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ బౌలర్లు రెచ్చిపోయిన వేళ.. గుజరాత్ ఆటగాళ్లు చేతులెత్తేశారు. ఏదో అర్జెంట్ పని ఉందన్నట్టు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. ఆ జట్టులో ఎనిమిదవ స్థానంలో వచ్చిన రషీద్ ఖాన్ (31) ఆడకుంటే గుజరాత్ పరిస్థితి మరింత దారుణంగా ఉండేది.

ఢిల్లీ బౌలర్ల ధాటికి గుజరాత్ బ్యాటర్లు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. పంత్ టాస్ గెలిచి తెలివిగా గుజరాత్ ను బ్యాటింగ్ ఆహ్వానించాడు. ఇక అప్పుడు మొదలైంది గుజరాత్ పతనం.. మైదానంపై ఉన్న తేమను ఢిల్లీ బౌలర్లు సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు. ఇశాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్ గుజరాత్ బ్యాటర్లకు కనీసం నిలదొక్కుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. గిల్ రెండు ఫోర్లు కొట్టినప్పటికీ ఆ ఊపు చివరి వరకూ కొనసాగించలేకపోయాడు. పృథ్వీ షా కు క్యాచ్ ఇచ్చి గిల్ అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ సాహా(2)ను ముఖేష్ బౌల్డ్ చేశాడు. సాయి సుదర్శన్ (12) ను సుమిత్ అద్భుతమైన త్రో తో రన్ అవుట్ చేశాడు. సీనియర్ బ్యాటర్ మిల్లర్ (2) ను కూడా ఇషాంత్ వెనక్కి పంపించాడు. అప్పటికే 5 ఓవర్లు పూర్తికాగా, గుజరాత్ నాలుగు వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసి తీవ్ర కష్టాల్లో పడింది.

ఇక అప్పుడు మొదలుపెట్టాడు కులదీప్ తన అసలు సిసలైన మ్యాజిక్ ను. కనీసం బంతిని టచ్ చేసే అవకాశం కూడా అతడు బ్యాటర్లకు ఇవ్వలేదు. ఓవైపు అతడు పరుగులు ఇవ్వకుండా కట్టడి చేస్తుంటే.. మరోవైపు మిగతా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీశారు. వికెట్ల మీద వికెట్లు పడుతుంటే ఇంపాక్ట్ ప్లేయర్ గా గుజరాత్ జట్టు షారుఖ్ ఖాన్ ను మైదానంలోకి పంపింది. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికే 50 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయిన గుజరాత్ జట్టు ను రషీద్ ఖాన్ ఆదుకున్నాడు. అతడు గనుక ఎదురుదాడికి దిగక పోయి ఉంటే గుజరాత్ ఆ మాత్రం స్కోర్ కూడా చేసి ఉండేది కాదు. రషీద్ ఎదురుదాడి వల్ల గుజరాత్ 100 పరుగులు చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ముఖేష్ కుమార్ ఆ జట్టు ఆశలపై నీళ్లు చల్లాడు.

కోల్ కతా తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 272 పరుగుల సమర్పించుకొని.. 100 పరుగులకు పైగా తేడాతో ఢిల్లీ ఓడిపోయింది. నెట్ రన్ రెట్ లో వెనుకబడిపోయింది. అయితే దీన్ని సరిచేసుకునేందుకు ఢిల్లీ జట్టు ఈ మ్యాచ్ ను సరిగ్గా ఉపయోగించింది. లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీని తన అర్థ శతకంతో గెలిపించిన ఆస్ట్రేలియా బ్యాటర్ ఫ్రేజర్.. గుజరాత్ జట్టు జరిగిన మ్యాచ్ లోనూ అదే స్థాయిలో మెరుపులు మెరిపించాడు. గత మ్యాచ్ మాదిరే.. ఈ మ్యాచ్ లోనూ తను ఎదుర్కొన్న తొలి బంతిని స్టాండ్స్ లోకి పంపించాడు. ఆ తర్వాత అతడు స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ పృథ్వి షా (7) ఎక్కువసేపు క్రీజ్ లో ఉండలేకపోయాడు.. అతడు సందీప్ వారియర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన అభిషేక్ పోరెల్ (15), శై హోప్ (19) ధాటిగా ఆడటంతో ఢిల్లీ స్కోర్ పరుగులు పెట్టింది. విజయానికి చేరువుతున్న క్రమంలో పోరెల్, హోప్ అవుట్ కావడంతో.. కెప్టెన్ పంత్ (16*), సుమిత్ కుమార్ (9*) గెలుపు లాంచనాన్ని పూర్తి చేశారు. ఈ మ్యాచ్ లో భారీ తేడాతో గెలుపొందడంతో ఢిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో ఏకంగా ఆరవ స్థానానికి చేరుకుంది.. ఏడు మ్యాచ్లు ఆడిన ఆ జట్టు మూడు గెలుపులు, నాలుగు ఓటములతో ఆరస్థానంలో కొనసాగుతోంది.