Sundar Pichai : ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ మధ్య గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో బంతితో అదరగొడుతున్న టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా బౌలింగే కాదు బ్యాటింగ్ తోనూ ఆకట్టుకుంటున్నాడు. అయితే బుమ్రా బ్యాటింగ్ గురించి తెలుసుకోవాలంటే ‘గూగుల్‌లో వెతకండి’ అంటూ బూమ్రానే సొంతంగా వ్యాఖ్యలు చేశాడు. దీనిపై తాజాగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పందించారు. తాను గూగుల్ చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా భారత బౌలర్‌పై పిచాయ్ ప్రశంసల వర్షం కురిపించారు. అసలు ఏం జరిగిందంటే.. బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. మూడో టెస్టు మూడో రోజు మ్యాచ్ ముగిసిన తర్వాత బుమ్రా మీడియా మీట్ లో మాట్లాడాడు. గబ్బా పిచ్, అక్కడి బ్యాటింగ్ పరిస్థితుల గురించి ఓ జర్నలిస్ట్ బుమ్రాను ప్రశ్నించాడు. దీనికి సీనియర్ పేసర్ స్పందిస్తూ.. ‘మీరు నా బ్యాటింగ్ సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నారు. టెస్టుల్లో ఒక్క ఓవర్‌లో అధిక పరుగులు చేసింది ఎవరో గూగుల్ చేసి చూడండి’ అని సమాధానంగా చెప్పాడు. బర్మింగ్‌హమ్-2022 టెస్టులో ఇంగ్లాండ్‌పై బుమ్రా ఒకే ఓవర్ లో 35 పరుగులు రాబట్టుకున్నాడు. ఇది ప్రపంచ రికార్డు అని అందరికీ తెలిసిందే దీన్ని ఉద్దేశిస్తూనే బుమ్రా సరదాగా వ్యాఖ్యలు చేశాడు. దీంతో బూమ్రా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
బూమ్రా వ్యాఖ్యలపై తాజాగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ‘ఎక్స్’లో స్పందించారు. ‘నేను గూగుల్ చేశా! కమిన్స్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టినవారికి బ్యాటింగ్ ఎలా చేయాలో తెలుసు’ అని రాశారు. మూడో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆకాశ్‌దీప్‌తో కలిసి బుమ్రా భారత్‌కు ఫాలో ఆన్ గండాన్ని తప్పించాడని ప్రశంసలు కురిపించారు. గూగుల్ ఇండియా కూడా బుమ్రా వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘జస్సీ భాయ్‌ను మాత్రమే మేం నమ్ముతాము’ అని రాసింది.
బార్డర్ గవాస్కర్ ట్రోఫీ గబ్బా వేదికగా జరుగుతున్న 3వ టెస్టులో అంచనాలకు మించి భారత్ గొప్పగా పోరాడింది. ఫస్ట్ రాహుల్ – జడేజా గట్టెక్కించగా.. లాస్ట్ లో ఆకాశ్‌దీప్ – బుమ్రా జోడీ అద్భుతంగా పోరాడింది. ఈ క్రమంలోనే కమిన్స్ బౌలింగ్‌లో బుమ్రా హుక్ షాట్‌తో సిక్సర్ బాది అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. ఆకాశ్ కు జోడీగా బుమ్రా నిలవడంతో టీమిండియా ఫాలోఆన్ తప్పించుకొని మ్యాచ్‌ను డ్రా చేసుకునే అవకాశాలను మెరుగుపరుచుకుంది.