https://oktelugu.com/

KKR vs SRH : ప్లే ఆఫ్ వేళ.. సన్ రైజర్స్ కు గుడ్ న్యూస్.. కేకేఆర్ కు కీలక ఆటగాడు దూరం..

కొన్ని మ్యాచ్ లలో ఓడిపోయినప్పటికీ.. ఆ జట్టు ఆటగాళ్లు పోరాట పటిమను ప్రదర్శించడంలో వెనకడుగు వేయలేదు. ప్లే ఆఫ్ లోనూ లీగ్ స్థాయికి మించి ఆటతీరును ప్రదర్శించాలని కోల్ కతా అభిమానులు కోరుకుంటున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : May 21, 2024 / 09:33 AM IST

    kkr vs srh

    Follow us on

    KKR vs SRH : ఐపీఎల్ లీగ్ లో అద్భుత విజయాలు సాధించి ప్లే ఆఫ్ కు వచ్చిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కు చేదు గుళిక తగిలింది. మంగళవారం గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలో నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా హైదరాబాద్ జట్టుతో కోల్ కతా తలపడనుంది. ఈ మ్యాచ్ కు కోల్ కతా జట్టుకు చెందిన విధ్వంసకర ఓపెనర్ సాల్ట్ దూరమయ్యాడు.. అతడు దూరం కావడంతో అది కోల్ కతా జట్టు స్కోరు ను ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాల్ట్ మ్యాచ్ కు దూరం కావడంతో హైదరాబాద్ ఆటగాళ్లు సంబరపడుతున్నారు. ఎందుకంటే సాల్ట్ దుర్భేద్యమైన ఆట తీరుకు పెట్టింది పేరు. పైగా అతడు క్షణాల్లో మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేయగలడు.

    పాకిస్తాన్ జట్టుతో టి20 సిరీస్ ఆడేందుకు సాల్ట్ ఇంగ్లాండ్ బయలుదేరి వెళ్లాడు. అతడి స్థానంలో కోల్ కతా జట్టు ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఓపెనర్ రెహమానుల్లా గుర్బాజ్ ను తీసుకుంది. ఈ ఒక్క మార్పు మినహా మిగతా జట్టు మొత్తం యధావిధిగా ఉంటుంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ కు అహ్మదాబాద్ మైదానం అనుకూలిస్తుంది.. అంతేకాదు ఈ మైదానంపై కోల్ కతా మెంటార్ గౌతమ్ గంభీర్ కు పూర్తి అవగాహన ఉంది. ఇది కోల్ కతా జట్టుకు బలం లాగా మారే అవకాశం ఉంది. పరిస్థితులకు తగ్గట్టుగా మార్పులు, చేర్పులు చేయడంలో గౌతమ్ గంభీర్ ది అందెవేసిన చెయ్యి. అందుకే అతడి ఆధ్వర్యంలో కోల్ కతా జట్టు ఈసారి పాయింట్ల పట్టికలో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. అంతేకాదు లీగ్ దశలో హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో నాలుగు పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది..

    సాల్ట్ దూరమైనప్పటికీ కోల్ కతా జట్టు బ్యాటింగ్ లైనప్ భయంకరంగా కనిపిస్తోంది. సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా, ఆండ్రి రస్సెల్, రింకూ సింగ్ వంటి వారు బ్యాట్ తో మెరుపులు మెరిపిస్తున్నారు.. ఇక వీరందరూ కనుక టచ్ లోకి వస్తే కోల్ కతా కు అడ్డు ఉండదు.. హర్షిత్ రాణా, మిచెల్ స్టార్క్, రస్సెల్ వంటి వారు పేస్ బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించగలరు. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి వంటి వారు స్పిన్ బౌలింగ్ వేస్తున్నప్పటికీ.. ఆశించినంత స్థాయిలో వికెట్లు తీయలేకపోతున్నారు. ఇక వైభవ్ ఆరో రాను ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఇప్పటివరకు కోల్ కతా, సన్ రైజర్స్ హైదరాబాద్ 29 సార్లు పరస్పరం తలపడ్డాయి. కోల్ కతా 17 సార్లు, హైదరాబాద్ 9సార్లు విజయాన్ని అందుకున్నాయి. ఒక్క మ్యాచ్ లో ఫలితం తేలలేదు.

    ఇక ఈ టోర్నీలో కోల్ కతా జట్టు అద్భుతమైన విజయాలు సాధించింది.. అప్రతిహత బ్యాటింగ్ తో దూసుకెళ్లింది.. టోర్నీ లో లీగ్ దశ ప్రారంభం నుంచి.. ముగింపు వరకు ఒకే తీరైన ఆట తీరును ప్రదర్శించింది. కొన్ని మ్యాచ్ లలో ఓడిపోయినప్పటికీ.. ఆ జట్టు ఆటగాళ్లు పోరాట పటిమను ప్రదర్శించడంలో వెనకడుగు వేయలేదు. ప్లే ఆఫ్ లోనూ లీగ్ స్థాయికి మించి ఆటతీరును ప్రదర్శించాలని కోల్ కతా అభిమానులు కోరుకుంటున్నారు.

    తుది జట్టు అంచనా ఇలా

    సునీల్ నరైన్, రెహమానుల్లా గుర్బాజ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, మిచెల్ స్టార్క్, రమణ్ దీప్ సింగ్, రస్సెల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, రస్సెల్.

    ఇంపాక్ట్ ప్లేయర్: వైభవ్ అరోరా.