Malayalam industry : చిన్న చిత్రాలతో పెద్ద విజయాలు, వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఆ మలయాళ మంత్రం ఏమిటీ?

చిన్న సినిమా పెద్ద సినిమా... స్టార్ హీరో స్మాల్ హీరో అనే తారతమ్యాలు లేవు. కంటెంట్ నచ్చితే భాషాబేధం లేకుండా ఆదరిస్తున్నారు. ప్రేక్షకుల నాడి పట్టుకున్న మలయాళ పరిశ్రమ తక్కువ బడ్జెట్ తో సరికొత్త చిత్రాలు అందిస్తూ సక్సెస్ అవుతుంది.

Written By: NARESH, Updated On : May 21, 2024 10:10 am

Malayalam Industry

Follow us on

Malayalam industry : ఒకప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమ అంటే చిన్న చూపు ఉండేది. సౌత్ లోని నాలుగు పరిశ్రమలతో పోల్చితే మార్కెట్ విలువ చాలా తక్కువ. స్టార్ హీరో సినిమా కూడా రూ. 50 కోట్ల బడ్జెట్ దాటదు. కారణం… మలయాళ పరిశ్రమ మార్కెట్ పరిధి పరిమితంగా ఉండేది. 2016లో విడుదలైన పులి మురుగన్ తొలి వంద కోట్ల సినిమా. ఇతర భాషల్లో కూడా పులి మురుగన్ ఆదరణ పొందిన నేపథ్యంలో ఆ ఫీట్ సాధించగలిగింది. తమిళంలో శివాజీ, తెలుగులో మగధీర ఫస్ట్ వంద కోట్ల గ్రాస్ వసూలు చేసిన చిత్రాల జాబితాలో ఉన్నాయి.

బాహుబలి అనంతరం టాలీవుడ్ ముఖ చిత్రం మారిపోయింది. తెలుగు సినిమాల్లో విషయం ఉంటుందనే భావన ఇతర పరిశ్రమల్లో ఏర్పడింది. దేశంలోనే అతిపెద్ద కమర్షియల్ చిత్రాలు తెరకెక్కించే పరిశ్రమగా టాలీవుడ్ అవతరించింది. దశాబ్దాలుగా ఆధిపత్యం ప్రదర్శిస్తున్న కోలీవుడ్ ని టాలీవుడ్ వెనక్కి నెట్టింది అనడంలో సందేహం లేదు.

అయితే మలయాళ చిత్ర పరిశ్రమ అంతకు మించిన అద్భుతాలు చేస్తుంది. చిన్న సినిమాలతో పెద్ద విజయాలు అందుకుంటూ కాసుల వర్షం కురిపిస్తుంది. రూ. 500 కోట్ల బడ్జెట్ మూవీ రూ. 1000 కోట్లు వసూలు చేసినా లాభాలు అంతంత మాత్రమే. కానీ రూ. 10 కోట్ల బడ్జెట్ మూవీ 100 కోట్లు వసూలు చేస్తే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ జేబులు నిండుతాయి. మలయాళ పరిశ్రమ ఇదే ఫార్ములా ఫాలో అవుతుంది. కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన మలయాళ పరిశ్రమ ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేస్తుంది.

గత ఐదు నెలల్లో మలయాళ పరిశ్రమ నుండి 5 అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. ఎలాంటి స్టార్ క్యాస్ట్ లేని చిన్న సినిమాలు వందల కోట్లు వసూలు చేశాయి. ఒక్కో సినిమా ఒక్కో జోనర్. మలయాళ సినిమాలతో ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అనే భావన కలిగించాయి. 2024లో విడుదలైన చిత్రాల్లో మంజుమ్మెల్ బాయ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇదో సర్వైవల్ థ్రిల్లర్. ఇండియాలో ఈ జోనర్ కి ఆదరణ తక్కువ. వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు చిదంబరం మంజుమ్మెల్ బాయ్స్ తెరకెక్కించాడు.

లోయలో పడిన మిత్రుడి కోసం స్నేహితులు చేసిన సాహసమే మంజుమ్మెల్ బాయ్స్ మూవీ. సౌబిన్ షాహిర్ నటించి నిర్మించిన ఈ చిత్రం రూ. 242 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్ర బడ్జెట్ కేవలం రూ. 20 కోట్లు. ఇక లాభాలు ఏ స్థాయిలో వచ్చాయో ఊహించుకోవచ్చు. ఇదే తరహాలో లాభాలు పంచిన మరొక మలయాళ చిత్రం ప్రేమలు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ప్రేమలు చిత్రంలో కూడా స్టార్ క్యాస్ట్ లేరు.

కేవలం రూ. 3 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తే… రూ. 136 కోట్లు వసూలు చేసింది. బాహుబలి 2కి మించిన లాభాలు అని చెప్పొచ్చు. తెలుగులో విడుదల చేస్తే ఇక్కడ కూడా ఆదరణ పొందింది. సలార్ ఫేమ్ పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా విడుదలైన సర్వైవల్ థ్రిల్లర్ ది గోట్ లైఫ్. దర్శకుడు బ్లెస్సీ వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించారు. ది గోట్ లైఫ్ రూ. 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. రూ. 158 కోట్లు వసూలు చేసింది.

ఈ ఏడాది బాక్సాఫీస్ కొల్లగొట్టిన మరొక మలయాళ చిత్రం ఆవేశం. పుష్ప ఫేమ్ ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్ర చేశాడు. ఈ యాక్షన్ కామెడీ డ్రామా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. రూ. 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే రూ. 153 కోట్లు వసూలు చేసింది. అలాగే మమ్ముట్టి భ్రమయుగం సైతం హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాల సక్సెస్ కి ప్రధాన కారణం కంటెంట్. ప్రేక్షకుల అభిరుచి, సినిమాను చూసే దృష్టి కోణం మారింది. చిన్న సినిమా పెద్ద సినిమా… స్టార్ హీరో స్మాల్ హీరో అనే తారతమ్యాలు లేవు. కంటెంట్ నచ్చితే భాషాబేధం లేకుండా ఆదరిస్తున్నారు. ప్రేక్షకుల నాడి పట్టుకున్న మలయాళ పరిశ్రమ తక్కువ బడ్జెట్ తో సరికొత్త చిత్రాలు అందిస్తూ సక్సెస్ అవుతుంది.