Gautam Gambhir: టీమిండియా మాజీ ఓపెనర్, డాషింగ్ బ్యాటర్, బిజెపి ఎంపీ గౌతమ్ గంభీర్ శనివారం సంచలన ప్రకటన చేశాడు. తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు.. గౌతమ్ గంభీర్ ప్రస్తుతం ఉత్తర ఢిల్లీ బిజెపి పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతున్నాడు.. గత పార్లమెంట్ ఎన్నికల్లో అతడు రాజకీయాల్లోకి వచ్చాడు. బిజెపి పార్టీలో చేరడంతో.. ఉత్తర ఢిల్లీ ఎంపీ టికెట్ కేటాయించింది.. ఆ ఎన్నికల్లో గౌతమ్ గంభీర్ 7,87,799 ఓట్లు సాధించాడు. మొత్తం పోలైన ఓట్లల్లో 54% ఓట్లు సాధించి విజయం సాధించాడు. ఇన్ని రోజులపాటు ఢిల్లీ ఉత్తర పార్లమెంటు సభ్యుడిగా గౌతమ్ గంభీర్ కొనసాగాడు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశాడు.. పలు సందర్భాల్లో ఆప్ నేతల తీరును విమర్శించాడు. ఒకానొక సందర్భంలో గౌతమ్ గంభీర్ కు మంత్రి పదవి వస్తుందని చర్చ జరిగింది. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. అప్పటినుంచి ఆయన ఒకింత నిరాశలో ఉన్నట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
కొద్దిరోజుల నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న గౌతమ్ గంభీర్ శనివారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా అనూహ్య ప్రకటన చేశారు. తాను ప్రత్యక్ష రాజకీయాల వైదొలుగుతున్నట్టు వెల్లడించారు..”నేను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పకుంటున్నాను. నాకు రాజకీయంగా అవకాశాలు కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, హోం శాఖ మంత్రి అమిత్ షాకు, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కృతజ్ఞతలు. నేను కొన్ని క్రికెట్ ఒప్పందాలలో ఉన్నాను. అందువల్ల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. నాకు అవకాశం కల్పించిన అందరికీ కృతజ్ఞతలు” అంటూ గంభీర్ రాసుకొచ్చాడు. “కోల్ కతా నైట్ రైడర్స్ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నావు.. ఆ జట్టు బిజెపికి వ్యతిరేకమైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సొంత రాష్ట్రానికి చెందింది. ఆ జట్టు ఓనర్ షారుక్ ఖాన్. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున నీకు టికెట్ దక్కే అవకాశం లేదు. అందుకే రాజకీయాల నుంచి తప్పకుంటున్నావని” ఓ నెటిజన్ గంభీర్ ట్వీట్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. ఇది ప్రస్తుతం తెగ సర్క్యూలేట్ అవుతోంది.
ఉత్తర ఢిల్లీ నియోజకవర్గంలో ఈసారి గంభీర్ కు టికెట్ నిరాకకరించడం వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని బిజెపి వర్గాలు అంటున్నాయి. కొంతకాలంగా ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారని, పార్టీ కార్యక్రమాలను పట్టించుకోవడంలేదని.. అందువల్లే అధిష్టానం ఆయనకు టికెట్ ఇవ్వబోమని చెప్పేసిందని బిజెపి కార్యకర్తలు అంటున్నారు. టికెట్ రాదని తెలిసే గంభీర్ రాజకీయాలనుంచి పక్కకు తప్పుకున్నారని.. క్రికెట్ ఒప్పందాలు ఉన్నాయని చెప్పడం విషయాన్ని పక్కదోవ పట్టించడమేనని వారు చెపుతున్నారు.. కాగా గంభీర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.