Gautam Gambhir: టెస్ట్ క్రికెట్లో నెంబర్ వన్. వన్డే క్రికెట్లో నెంబర్ వన్. టి20 క్రికెట్ లోనూ నెంబర్ వన్ .. ఒకరకంగా కొన్ని సంవత్సరాల క్రితం క్రికెట్ ను టీం ఇండియా శాసించింది. నేటికీ శాసిస్తూనే ఉంది. 2023 వన్డే వరల్డ్ కప్, డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఓడిపోయినప్పటికీ భారత్ మూడు ఫార్మాట్లలో తన పట్టు కోల్పోలేదు. పైగా పొట్టి ఫార్మాట్లో విజేతగా నిలిచింది. దాదాపు 17 సంవత్సరాల తర్వాత ఛాంపియన్ గా అవతరించింది.
Also Read: 371 రన్ టార్గెట్ విధించినా.. టీమిండియా ఓడిపోవడానికి కారణాలు ఇవే
ఎప్పుడైతే గౌతమ్ గంభీర్ టీమిండియా కోచ్ గా వచ్చాడో.. అప్పటినుంచి సుదీర్ఘ ఫార్మాట్లో టీమిండియా ప్రస్థానం తిరోగమనం దిశగా ఉంది. ముఖ్యంగా స్వదేశంలో ఎన్నడూ లేని విధంగా కివీస్ జట్టు చేతిలో వైట్ వాష్ కు గురైంది. ఆడిన మూడు టెస్ట్ లు కూడా ఓటమిపాలైంది. అంతకుముందు బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన రెండు టెస్టుల సిరీస్ గెలిచింది. ఇక కంగారు జట్టుతో జరిగిన బీజీటీ సిరీస్ లో భారత్ ఒకే ఒక్క టెస్ట్ గెలిచింది. ఒక టెస్టు డ్రా అయింది. మిగతా మూడు టెస్టుల్లోనూ భారత్ ఓటమిపాలైంది. గౌతమ్ గంభీర్ కోచ్ గా వచ్చిన తర్వాత భారత్ మొత్తం 11 టెస్టులాడింది. ఇందులో కేవలం మూడు మాత్రమే విజయాలు సాధించింది. ఏకంగా ఏడు టెస్టుల్లో ఓటమిపాలైంది. గత 11 టెస్టులను పరిగణలోకి తీసుకుంటే భారత ఆటగాళ్ల ఆట తీరు ఏమాత్రం గొప్పగా లేదు.
అంత లక్ష్యం విధించినప్పటికీ
ఇంగ్లీష్ జట్టుతో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ ను భారత్ ఓటమితోనే మొదలుపెట్టింది. గెలవాల్సిన మ్యాచ్ ను దూరం చేసుకుని ఓటమిపాలైంది. తద్వారా 148 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డును భారత్ తన పేరు మీద రాసుకుంది. ఇంగ్లీష్ జట్టుతో జరిగిన తొలి టెస్ట్ లో ఏకంగా ఐదుగురు భారత ప్లేయర్లు సెంచరీలు చేశారు. ఒక బౌలర్ ఐదు వికెట్లు పడగొట్టాడు. వాస్తవానికి ప్రత్యర్థి జట్టులో ఈ ఘనతలు నమోదు కాలేదు. అయినప్పటికీ వారు విజయం సాధించారు. జట్టుకు అవసరమైన సందర్భంలో సమష్టి ప్రదర్శన చేసి అదరగొట్టారు. ఈ ఉత్సాహం భారత జట్టులో లోపించింది. ముఖ్యంగా జట్టు కూర్పులో కోచ్ గౌతమ్ గంభీర్ వైఖరి వల్ల జట్టుకు దారుణమైన ఓటమి తప్పలేదు. 371 రన్స్ టార్గెట్ విధించినప్పటికీ భారత్ ఓడిపోవడాన్ని అభిమానులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ జట్టు విషయంలో వేలు పెట్టడంతో ఈ ఇబ్బంది ఎదురవుతోందని అభిమానులు వాపోతున్నారు. సీనియర్ ప్లేయర్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ విషయంలో శిక్షకుడిగా అనవసరంగా కలుగజేసుకున్నాడని.. అందువల్లేవారు టెస్ట్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పారని అభిమానులు అంటున్నారు.
వాస్తవానికి విరాట్, రోహిత్ టెస్టులలో ఇటీవల కాలంలో అంతగా ఫామ్ లో లేరు. ఆ లోపాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ వారిద్దరు కూడా టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించేలాగా గౌతమ్ గంభీర్ వ్యవహరించాడని.. అందువల్లే వారు సుదీర్ఘ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పారని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. సీనియర్ ప్లేయర్లు లేని లోటు ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటనలో కనిపిస్తోందని.. అందువల్లే టీమిండియా గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయిందని అభిమానులు వాపోతున్నారు. ఇప్పటికైనా జట్టుకూర్పు విషయంలో సారధి గిల్ కు స్వేచ్ఛ ఇవ్వాలని.. గౌతమ్ గంభీర్ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటే టెస్ట్ ఫార్మాట్లో భారత్ ర్యాంక్ మరింత దిగజారుతుందని.. ఇది జట్టుకు మంచి పరిణామం కాదని అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. ఇప్పటికైనా గౌతమ్ గంభీర్ తన వ్యవహార శైలి మార్చుకోవాలని హితవు పలుకుతున్నారు.