Gambhir And Rishabh Pant: గౌతమ్ గంభీర్ ముక్కోపి. తను అనుకున్నది మాత్రమే జరగాలనుకునే రకం. అందువల్లే టెస్ట్ ఫార్మాట్ నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ తప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై క్లారిటీ మాత్రం ఇంతవరకు ఎవరూ ఇవ్వలేదు. వారు ముగ్గురు టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నప్పుడు గౌతమ్ గంభీర్ ట్విట్టర్లో తనదైన ఫేర్వెల్ ప్రకటించాడు.
Also Read: 371 రన్ టార్గెట్ విధించినా.. టీమిండియా ఓడిపోవడానికి కారణాలు ఇవే
ఇక ఇటీవల ఇంగ్లీష్ జట్టుతో జరిగిన తొలి టెస్ట్ లో భారత ఆటగాళ్లు సెంచరీల మోత మోగించారు. ఐదుగురు ప్లేయర్లు శతకాలు సాధించారు. ఇంగ్లాండ్ ఎదుట భారీగానే పరుగుల లక్ష్యాన్ని విధించారు. బౌలింగ్ లోపం.. ఫీల్డింగ్ వైఫల్యం వల్ల భారత్ తగిన మూల్యాన్ని చెల్లించుకోవలసి వచ్చింది. దాదాపు 148 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ హిస్టరీలో భారత్ అత్యంత దారుణమైన రికార్డును తన పేరు మీద నమోదు చేసుకుంది. ఐదుగురు పేర్లు సెంచరీలు చేసినప్పటికీ, ఒక బౌలర్ ఐదు వికెట్లు పడగొట్టినప్పటికీ, ప్రత్యర్థి జట్టు ఎదుట 371 రన్స్ టార్గెట్ విధించినప్పటికీ భారత్ ఓడిపోయింది. వాస్తవానికి టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇన్ని అరుదైన ఘనతలు నమోదైనప్పటికీ భారత్ ఓడిపోవడం పట్ల సగటు అభిమాని ఆవేదన, ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. టీమిండియా లో అనేక మార్పులు చోటు చేసుకోవాలని.. ప్రక్షాళన జరిగితేనే తదుపరి స్థాయిలో విజయాలు లభిస్తాయని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
అతడికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా
టీమిండియా లో ఇటీవల విరాట్, అంతకుముందు రోహిత్, అతని కంటే ముందు రవిచంద్రన్ అశ్విన్ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నామని ప్రకటించారు. వాస్తవానికి అశ్విన్ మినహా మిగతా ఇద్దరు సుదీర్ఘ ఫార్మాట్లో అంతగా ఆకట్టుకోలేకపోతున్నారు. దానిని కారణంగా చూపి వారిపై గంభీర్ పలు సందర్భాల్లో కీలక వ్యాఖ్యలు చేశాడు. కాకపోతే అవన్నీ కూడా అంతర్గత సమావేశాలలోనే జరగడం విశేషం. గంభీర్ వ్యవహార శైలికి నొచ్చుకున్న రోహిత్, విరాట్ టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకున్నారు. అయితే ప్రస్తుతం గంభీర్ మరో ఆటగాడిని లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల అతడు చేసిన వ్యాఖ్యలు దానికి బలం చేకూర్చుతున్నాయి.
ఇంగ్లీష్ జట్టు ఎదుట భారీ లక్ష్యాన్ని విధించినప్పటికీ భారత్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కోచ్ హోదాలో గౌతమ్ గంభీర్ మాట్లాడాడు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశాడు.. బృందంగా ఆడినప్పుడు గెలుస్తామని.. అదే సమయంలో బృందంగానే ఓడిపోతామని గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు. ఈ క్రమంలో విలేకరులు రిషబ్ పంత్ రెండు ఇన్నింగ్స్ లలో చేసిన శతకాలను ప్రస్తావించారు. దానిపై గౌతమ్ గంభీర్ క్లారిటీ ఇచ్చాడు. పంతు మాత్రమే కాకుండా జైస్వాల్, కేఎల్ రాహుల్, గిల్ కూడా సెంచరీలు చేశారని గౌతమ్ గంభీర్ గుర్తు చేశాడు. ఈ క్రమంలో పంత్ చేసిన బ్యాక్ టు బ్యాక్ సెంచరీలను అతడు విస్మరించే ప్రయత్నం చేశాడు. ఈ లెక్కన చూస్తే గౌతమ్ గంభీర్ పంత్ పై కక్ష పెంచుకున్నాడని తెలుస్తోంది. గతంలో ఆస్ట్రేలియా టూర్ లో కూడా రిషబ్ పంత్ ను రిజర్వ్ బెంచ్ కే పరిమితం చేయాలని గౌతమ్ గంభీర్ భావించినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత అవి తేలిపోయాయి. పైగా గౌతమ్ గంభీర్ ఇచ్చిన అవకాశాన్ని రిషబ్ పంత్ ఆ సిరీస్ లో సద్వినియోగం చేసుకున్నాడు. అయితే ఇప్పుడు సూపర్ ఫామ్ లో ఉన్న రిషబ్ ను గౌతమ్ గంభీర్ దూరం పెట్టే అవకాశాలు లేకపోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అతనికి రెండో టెస్టులో చోటు అనుమానమేనని విమర్శలు కూడా ఉన్నాయి. అయితే అలాంటిదేమీ ఉండదని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. పంత్ అంటే గౌతమ్ గంభీర్ కు ఇష్టమేనని.. అందువల్లే అతడిని ఇంగ్లీష్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కు ఎంపిక చేసాడని గుర్తు చేస్తున్నారు. ఏదో మాట మాట్లాడినంత మాత్రాన దానిని వ్యతిరేక కోణంలో చూడవద్దని.. పంత్, గౌతమ్ గంభీర్ మధ్య మంచి బాండింగ్ ఉందని వారు గుర్తు చేస్తున్నారు.