Gautam Gambhir: కోల్ కతా ను వదిలేస్తాడు..కోచ్ గా వస్తాడన్నారు.. చివరికి గంభీర్ మామూలు షాక్ ఇవ్వలేదుగా..

కోల్ కతా టైటిల్ గెలిచిన తర్వాత.. గౌతమ్ గంభీర్ ఆ సంబరాల్లో మునిగితేలాడు . తర్వాత కుటుంబంతో కలిసి వెకేషన్ వెళ్లాలనుకుంటున్నాడట. ఐపీఎల్ గెలిచిన ఆనందాన్ని.. కుటుంబ సభ్యులతో పంచుకోవాలని గౌతమ్ గంభీర్ భావిస్తున్నాడట.

Written By: Anabothula Bhaskar, Updated On : May 30, 2024 8:29 am

Gautam Gambhir

Follow us on

Gautam Gambhir: “జై షా తో మంతనాలు పూర్తయ్యాయి. షారుక్ ఖాన్ కూడా అంగీకరించాడు . ఇక అన్ని శుభశకునములే.. రేపో మాపో గౌతమ్ గంభీర్ టీమిండియా కోచ్ కాబోతున్నాడు.. అతడు దరఖాస్తు చేసుకున్నా, చేసుకోకపోయినా ఇబ్బంది లేదు.. కోల్ కతా కు కప్ దక్కించినట్టే.. టీమిండియా కూడా ఐసీసీ కప్ లు దక్కేలా చూస్తాడు”. ఇదీ కొద్దిరోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. అయితే భారత క్రికెట్ నియంత్రణ మండలి కి గౌతమ్ గంభీర్ ఒక్కసారిగా షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. షా కోచ్ పదవి ఆఫర్ చేసినప్పటికీ, గంభీర్ సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి గౌతమ్ గంభీ ర్ ను జాతీయ కోచ్ గా నియమిస్తారని మంగళవారం విపరీతంగా ప్రచారం జరిగింది. అయితే అదంతా జాతీయ మీడియా సృష్టి అని తేలిపోయింది.

ఓ స్పోర్ట్స్ ఛానల్ కు గౌతమ్ గంభీర్ ఇంటర్వ్యూ ఇవ్వగా. కోల్ కతా జట్టుకు మెంటార్ గానే కొనసాగుతానని అతడు స్పష్టం చేశాడు. కోల్ కతా జట్టును నెంబర్ వన్ గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ప్రకటించాడు. కోల్ కతా విజయ ప్రయాణం ఇప్పుడే మొదలైందని.. అత్యంత విజయవంతమైన జట్టుగా కోల్ కతా నిలిచేందుకు.. ఇంకా మూడు టైటిల్స్ గెలవాల్సి ఉందని గౌతమ్ గంభీర్ ప్రకటించాడు..” ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు 5 టైటిల్స్ ఉన్నాయి. కోల్ కతా కు మూడు టైటిల్స్ మాత్రమే ఉన్నాయి. ఈ లెక్కన ఆ రెండు జట్లను బీట్ చేయాలంటే ఇక మూడు టైటిల్స్ కోల్ కతా గెలవాలి. 17వ సీజన్లో టైటిల్ గెలవడం పట్ల సంతోషంగా ఉన్నాను.. అయితే ఆ సంతోషంతోనే ఆగిపోకూడదు. ఇక మూడు టైటిల్స్ గెలవాలి. అలా జరగాలంటే కోల్ కతా జట్టు మరింత మెరుగవ్వాలి.. ఆటగాళ్లు ఇంకా కష్టపడాలని” గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు..

కోల్ కతా టైటిల్ గెలిచిన తర్వాత.. గౌతమ్ గంభీర్ ఆ సంబరాల్లో మునిగితేలాడు . తర్వాత కుటుంబంతో కలిసి వెకేషన్ వెళ్లాలనుకుంటున్నాడట. ఐపీఎల్ గెలిచిన ఆనందాన్ని.. కుటుంబ సభ్యులతో పంచుకోవాలని గౌతమ్ గంభీర్ భావిస్తున్నాడట. అందుకే త్వరలో అతడు విహారయాత్రకు వెళ్తాడట. అంతేతప్ప తాను టీమిండియా కోచ్ గా రావాలని అనుకోవడంలేదని గౌతమ్ గంభీర్ నిర్మొహమాటంగా చెప్పేశాడు. కోల్ కతా జట్టు ప్రతి అడుగులో, ఉత్సాహం చూడాలని భావిస్తున్న అతడు.. ఆ జట్టుతోనే ప్రయాణం కొనసాగుతుందని చెప్పకనే చెప్పేశాడు. దీంతో గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్ గా రాడని స్పష్టమైపోయింది. మరి ఈ పరిస్థితుల్లో కొత్త కోచ్ గా ఎవరిని నియమిస్తారనేది తెలియాల్సి ఉంది.