Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ నియామకం దాదాపుగా ఖాయమైనట్టే. బిసిసిఐ పెద్దలు అధికారికంగా ప్రకటించడం ఒక్కటే మిగిలింది. తన నియామకం పూర్తయినట్టు.. త్వరలో కోచ్ గా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నట్టు గౌతమ్ గంభీర్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే పలు స్పోర్ట్స్ చానల్స్, మ్యాగ్జిన్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.. అందులో భాగంగా హెడ్ కోచ్ గా తన లక్ష్యాలు ఏమిటో, టీమిండియాను ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నానో గౌతమ్ గంభీర్ స్పష్టం చేస్తున్నాడు.. ఇక ఇటీవల గౌతమ్ గంభీర్ ను బీసీసీఐ పెద్దలు ఇంటర్వ్యూ చేసిన సమయంలో అతనితో పాటు డబ్ల్యూవీ రామన్ కూడా ఉన్నాడు. అయితే గౌతమ్ గంభీర్ పైపే బీసీసీఐ పెద్దలు మొగ్గు చూపించారని జాతీయ మీడియా కోడై కోస్తోంది. అయితే రామన్ సేవలను కూడా వినియోగించుకోవాలని గంభీర్ భావిస్తున్నాడు. రాహుల్ ద్రావిడ్ పదవి కాలం ముగిసిన తర్వాత.. గౌతమ్ గంభీర్ పదవీ బాధ్యతలు స్వీకరిస్తాడు. అంతేకాదు బాధ్యతలు స్వీకరించే ముందు బీసీసీఐకి 5 షరతుల విధించాడు..
ఒత్తిళ్లను ఎట్టి పరిస్థితుల్లో గౌతమ్ గంభీర్ ఒప్పుకోడట. టీమిండియా వ్యవహారాలలో ఎవరైనా జోక్యం చేసుకుంటే సహించబోడట. వనరులు కల్పించడంతోనే బీసీసీఐ బాధ్యత ముగిసిపోతుందట. బోర్డు పెద్దలయినంత మాత్రాన భారత క్రికెట్ జట్టు ఆటగాళ్ల ఆట తీరుకు సంబంధించిన వ్యవహారాలలో వేలు పెడితే అసలు తట్టుకోలేడట.
గౌతమ్ గంభీర్ సూచించిన వాళ్లను మాత్రమే సహాయక సిబ్బందిగా నియమించుకోవాలట. వాళ్లకు తాను చెప్పిన విధంగానే జీతాలు ఇవ్వాలట. అందులో ఏమాత్రం ఎదురు ప్రశ్నిస్తే అస్సలు ఊరుకోడట. ముఖ్యంగా బ్యాటింగ్, బౌలింగ్ కోచ్ లు, సహాయక సిబ్బంది, ఇతర సిబ్బంది నియామకంలో ఇతరుల పాత్ర అసలు ఉండకూడదట..
ఇక వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్ ట్రోఫీ జరుగుతుంది. సీనియర్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, రోహిత్, విరాట్ కోహ్లీలకు ఇదే చివరి మ్యాచ్. ఒకవేళ వారంతా విఫలమైతే.. వారిని జట్టు నుంచి గంభీర్ తప్పిస్తాడట. ఈ విషయంలో ఎవరైనా అడ్డు చెబితే ఊరుకోడట.
ఇక టెస్ట్ క్రికెట్ కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో.. భారత జట్టు ప్రత్యేకమైన ఆటగాళ్లను తయారు చేసుకోవాలట. టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ కోసం వర్తమాన ఆటగాళ్లను ఎంపిక చేయాలట. ఇందులో పూర్తి స్వేచ్ఛ గౌతమ్ గంభీర్ కు ఇవ్వాలట. ఇక వచ్చే వన్డే వరల్డ్ కప్ కోసం ఇప్పటి నుంచే ఒక ప్రణాళిక రూపొందించుకోవాలట. దీనికోసం బీసీసీఐ గౌతమ్ గంభీర్ కు అనుమతి ఇవ్వాలట. వచ్చేయడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో.. దానికి సంబంధించిన ఆటగాళ్ల ఎంపికపై తనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని గౌతమ్ గంభీర్ బీసీసీఐ పెద్దలకు అల్టిమేటం జారీ చేశాడట.