Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్?

ప్రస్తుతం గౌతమ్ గంభీర్ ఐపీఎల్ లో కోల్ కతా జట్టుకు మెంటార్ గా కొనసాగుతున్నాడు. అతడి ఆధ్వర్యంలో కోల్ కతా జట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. ఇప్పటికే ప్లే ఆఫ్ వెళ్లిపోయింది.

Written By: Anabothula Bhaskar, Updated On : May 18, 2024 7:38 am

Gautam Gambhir

Follow us on

Gautam Gambhir: త్వరలో జరగబోయే టి20 వరల్డ్ కప్ టోర్నీ తర్వాత.. టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ టీమ్ ఇండియా కోచ్ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. గత మంగళవారం ప్రకటన జారీ చేసింది. రాహుల్ ద్రావిడ్ పదవి కాలాన్ని కొనసాగించే అవకాశం లేదని బీసీసీఐ సెక్రెటరీ జై షా ఇదివరకే ప్రకటించాడు. దీంతో రాహుల్ ద్రావిడ్ మళ్ళీ కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకుంటాడని అందరూ భావించారు. కానీ ఇంతవరకు రాహుల్ ద్రావిడ్ ఎటువంటి దరఖాస్తూ చేసుకోలేదు. మరోవైపు టీమ్ ఇండియా కోచ్ పదవి కోసం వివిఎస్ లక్ష్మణ్ పేరు కూడా వినిపించింది. ఆయనను ఖాయం చేశారనే వార్తలు కూడా వినిపించాయి. సోషల్ మీడియా లో ఆయన పేరును నెటిజన్లు ప్రముఖంగా ప్రస్తావించారు. వీళ్ళందరూ కాకుండా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తున్న ఫ్లెమింగ్ ను కోచ్ గా నియమిస్తారని వార్తలు వచ్చాయి. అతనితో చర్చలు కూడా జరిపారని ప్రచారం జరిగింది. తర్వాత అదంతా ఊహాగానమే అని తేలిపోయింది.. ఈ దశలో జస్టిన్ లాంగర్ టీమిండియా కోచ్ గా పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నాడని.. అతడు బిసిసిఐ పెద్దలను కలిశాడని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అవి కూడా గాలికి కొట్టుకుపోయిన పేలపిండి సామెతనే తలపించాయి.

అయితే ఇప్పుడు తాజాగా టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ ను నియమించేందుకు బీసీసీఐ ఆసక్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై బోర్డు అధికారులు ఇప్పటికే గంభీర్ ను సంప్రదించారని ప్రముఖ స్పోర్ట్స్ ఛానల్ “ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ ఫో” ప్రకటించింది..” గౌతమ్ గంభీర్ ను కోచ్ గా నియమించేందుకు బీసీసీఐ పెద్దలు ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే అతనితో చర్చలు జరిపారు. అన్ని అనుకున్నట్లు జరిగితే అతడు త్వరలో టీమ్ ఇండియా హెడ్ కోచ్ అవడం ఖాయం. గౌతమ్ గంభీర్ కు విజయవంతమైన ఆటగాడిగా పేరుంది. 2011 వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ఐసీసీ మెగా కప్ లు గెలిచిన సమయంలో అతడు టీమిండియాలో సభ్యుడని” ఈఎస్పీఎన్ తన కథనంలో పేర్కొంది.

ప్రస్తుతం గౌతమ్ గంభీర్ ఐపీఎల్ లో కోల్ కతా జట్టుకు మెంటార్ గా కొనసాగుతున్నాడు. అతడి ఆధ్వర్యంలో కోల్ కతా జట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. ఇప్పటికే ప్లే ఆఫ్ వెళ్లిపోయింది. కోల్ కతా కు మెంటార్ గా వ్యవహరించేందుకు గౌతమ్ గంభీర్ తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు. ఇక త్వరలో ఐపీఎల్ టోర్నీ పూర్తి అయిన తర్వాత కోచ్ పదవికి సంబంధించి ఒక స్పష్టత వస్తుందని తెలుస్తోంది. టీమిండియా కు కోచ్ గా పనిచేసేందుకు గౌతమ్ గంభీర్ కూడా ఆసక్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 27 తో గడువు ముగియనుంది.