Hardik Pandya : టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించాడు. జట్టులో తనదైన మార్పులు చేర్పులు చేపడుతున్నాడు.. ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ఫైనల్స్, టి20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ దృష్టిలో పెట్టుకొని టీమ్ ఇండియాను అత్యంత శక్తివంతమైన జట్టుగా రూపొందించేందుకు తన వంతు కసరత్తు మొదలుపెట్టాడు. ఇందులో భాగంగానే త్వరలో శ్రీలంకలో పర్యటించే టీమ్ ఇండియాలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టాడు. టి20 కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ ను నియమించాడు. వాస్తవానికి టి20 జట్టుకు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను నియమిస్తారని అందరూ అనుకున్నారు. చివరికి వైస్ కెప్టెన్సీ కూడా హార్దిక్ పాండ్యాకు ఇవ్వలేదు. గిల్ కు వైస్ కెప్టెన్ గా నియమించారు. అయితే జట్టు కూర్పుపై అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తొలిసారి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు వారిదైన శైలులో సమాధానాలు ఇచ్చారు.” హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా ఎందుకు ఎంపిక చేయలేదని” మీడియా అడిగిన ప్రశ్నకు సాలిడ్ రిప్లై ఇచ్చారు..
అతడే కెప్టెన్ అనుకున్నారు
టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత పొట్టి ఫార్మాట్ కు రోహిత్ శర్మ వీడ్కోలు పలికాడు. రోహిత్ తప్పుకున్న నేపథ్యంలో ఆ స్థానంలో హార్దిక్ పాండ్యా నియమితుడౌతాడని అందరూ అనుకున్నారు. కానీ హఠాత్తుగా సూర్య కుమార్ యాదవ్ సారధి అయిపోయాడు. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ కావడమే ఆలస్యం సూర్యకుమార్ యాదవ్ ను అదృష్టం ఒక్కసారిగా తలుపు తట్టింది. 2012 ఐపీఎల్ లో కోల్ కతా జట్టులోకి సూర్యకుమార్ యాదవ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సీజన్లో అద్భుతంగా రాణించి SKY గా పేరుపొందాడు. ఆ సీజన్లో కోల్ కతా విజేతగా నిలిచింది. అప్పటినుంచి గౌతమ్ గంభీర్, సూర్య కుమార్ యాదవ్ కు మంచి బాండింగ్ ఏర్పడింది.. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా రావడంతో మరో మాటకు తావులేకుండా సూర్యకుమార్ యాదవ్ ను టీ 20 ఫార్మాట్ లో కెప్టెన్ గా నియమించాడు. కాదు 2026 t20 వరల్డ్ కప్ వరకు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా ఉంటాడని బీసీసీఐ వర్గాల సమాచారం.
ఏం సమాధానం చెప్పారంటే..
కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ ఎంపిక గురించి మీడియా సమావేశంలో ప్రశ్న ఎదురైన నేపథ్యంలో గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కార్ స్పందించారు. ” ఫిట్ నెస్ దృష్ట్యా హార్దిక్ కు కెప్టెన్సీ ఇవ్వలేదు. అన్ని సమయాలలో జట్టుకు అందుబాటులో ఉండే ఆటగాడిని సారధిగా నియమించాలని భావించాం. అందుకే హార్దిక్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించలేదు. అయినప్పటికీ హార్దిక్ పాండ్యా మాకు ఎంతో విలువైన ఆటగాడు. అర్హుల జాబితాలో సూర్య కుమార్ యాదవ్ ముందు వరుసలో ఉన్నాడు కాబట్టి అతడిని కెప్టెన్ గా నియమించాం. హార్దిక్ పాండ్యా అత్యుత్తమ ఆటగాడు. ఎంతో నైపుణ్యం ఉన్నవాడు.. కానీ సమకాలిన క్రికెట్ లో ఒక ఆటగాడికి ఫిట్ నెస్ అనేది అత్యంత ముఖ్యం. పైగా జట్టుకు అన్నివేళలా అందుబాటులో ఉండే ఆటగాడు కావాలి. ఈ కారణాల దృష్ట్యా సూర్య కుమార్ యాదవ్ ను నాయకుడిగా నియమించాం. అర్హత ఉన్న ఆటగాళ్లలో అతడు ముఖ్యమైనవాడు. టి20 ఫార్మాట్ లో సిసలైన బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ ఒకడని” గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ పేర్కొన్నారు.. అంతేకాదు సూర్యకుమార్ యాదవ్ ఎంపిక విషయంలో తాము డ్రెస్సింగ్ రూమ్ అభిప్రాయాలను కూడా తీసుకున్నామని వారు వెల్లడించారు..
అయితే ఇటీవల తన సతీమణితో విడాకులు తీసుకున్న నేపథ్యంలో.. వ్యక్తిగతంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న హార్దిక్ పాండ్యాపై ఒత్తిడి పెంచలేకే బీసీసీఐ పెద్దలు, హెడ్ కోచ్, చీఫ్ సెలెక్టర్ కెప్టెన్ గా ఎంపిక చేయలేదని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ ఊహగానాలు మాత్రమేనని అజిత్ అగార్కర్, గౌతమ్ గంభీర్ వ్యాఖ్యల నేపథ్యంలో తేలిపోయింది.