Team India : రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం ముగిసిన తర్వాత టీమ్ ఇండియా కోచ్ గా మాజీ క్రికెటర్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ నియమితుడయ్యాడు. వచ్చీ రాగానే తన మార్క్ చూపించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాను టార్గెట్ చేశాడు. అంతేకాదు తన శిష్యుడిని కెప్టెన్ చేసేందుకు లైన్ క్లియర్ చేశాడు. దీంతో క్రీడా వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
ఇంతకీ ఏం జరిగింది
టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత.. టీమిండియాలో సీనియర్ ఆటగాళ్లు కాస్త రెస్ట్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జింబాబ్వే టూర్ కు యువ జట్టు వెళ్లింది. గిల్ నాయకత్వంలో 4-1 తేడాతో సిరీస్ దక్కించుకుంది. ఆ తర్వాత టీం ఇండియా శ్రీలంకలో పర్యటించనుంది. శ్రీలంకతో టీమిండియా ఆడే టి20 సిరీస్ కు కొత్త కెప్టెన్ రానున్నాడు. జింబాబ్వే అనామక జట్టు కాబట్టి గిల్ కు బీసీసీఐ బాధ్యతలు అప్పగించింది. కానీ శ్రీలంక విషయంలో అలాంటి ప్రయోగం చేయలేదు. అయితే ఇటీవల టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆ పొట్టి ఫార్మాట్ కు రోహిత్ శర్మ వీడ్కోలు చెప్పాడు. ఈ క్రమంలో అతని స్థానంలో కొత్త కెప్టెన్ ను నియమించాల్సిన అవసరం బీసీసీఐకి ఏర్పడింది. అయితే శ్రీలంక సిరీస్ కు హార్థిక్ పాండ్యా నాయకత్వం వహిస్తాడని నిన్నా మొన్నటి వరకు స్పోర్ట్స్ వర్గాల్లో చర్చ జరిగింది. ప్రస్తుతం జాతీయ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం హార్దిక్ పాండ్యా శ్రీలంక టోర్నికి దూరంగా ఉండనున్నాడు. ఆయన స్థానంలో సూర్య కుమార్ యాదవ్ టీమిండియా కెప్టెన్ గా వ్యవహరిస్తాడని తెలుస్తోంది.
అతడి చేతుల్లో..
టీమిండియాలోకి రాకముందు సూర్య కుమార్ యాదవ్ ఐపీఎల్ లో ఆకట్టుకున్నాడు. కోల్ కతా జట్టు లోకి 2012 లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సమయంలో కోల్ కతా జట్టు కు గౌతమ్ గంభీర్ నాయకత్వం వహిస్తున్నాడు. ఆ ఏడాది సీజన్లో కోల్ కతా విజేతగా నిలిచింది. అదే ఏడాదిలో సూర్య కుమార్ యాదవ్ తన ప్రతిభను చూపించడం మొదలుపెట్టాడు. మైదానం నలుమూలల షాట్లు కొట్టి SKY బిరుదాంకితుడయ్యాడు. ఇక అప్పట్నుంచి సూర్య కుమార్ యాదవ్ వెను తిరిగి చూసుకోలేదు.. టీమిండియా శ్రీలంక, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లతో ఆడిన 8 t20 మ్యాచ్ లకు నాయకత్వం వహించాడు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా విశ్రాంతిలో ఉండడం.. రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో కొత్త కోచ్ గౌతమ్ గంభీర్, సెలక్షన్ కమిటీ చైర్మన్ అజీత్ అగార్కర్ సూర్య కుమార్ వైపు ముగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అంతకంటే ముందు గంభీర్, అగార్కర్ హార్దిక్ పాండ్యాతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.. జట్టులో స్థిరత్వాన్ని పెంపొందించేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు అతడికి వివరించారని ప్రచారం జరుగుతోంది. జూలై 27 నుంచి 30 వరకు శ్రీలంకతో టి20 సిరీస్, ఆ తర్వాత ఆగస్టు ఒకటి నుంచి ఏడు వరకు వన్డే సిరీస్ జరుగుతుంది. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ అప్పగించడం కేవలం శ్రీలంక పర్యటనకు మాత్రమే కాదని, 2026 వరకు టీమిండియా టి20 కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ ఉంటాడని జాతీయ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.
అదే ప్రతిబంధకం
రోహిత్ శర్మ తర్వాత ఇండియా టి20 జట్టు సారధ్య బాధ్యతలు హార్దిక్ పాండ్యా కు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. పైగా టి20 వరల్డ్ కప్ లో హార్దిక్ పాండ్యా అద్భుతమైన ప్రదర్శన చూపించాడు. కానీ అనే అంశాలు అతడి నాయకత్వాన్ని ప్రభావితం చేశాయి. ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ గా అతని పేలవమైన ప్రదర్శన, ఇంకా కొన్ని కారణాలు అతడిని టి20 కెప్టెన్ గా నియమించేందుకు ప్రతిభందకంగా మారుతున్నాయి. అయితే హార్దిక్ పాండ్యా 50 ఓవర్ల ఫార్మాట్ పై మరింత అనుభవం సాధించేందుకు విజయ్ హజారే ట్రోఫీలో ఆడించాలని సెలక్టర్లు ఒక ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక వన్డేలకు సంబంధించి పాండ్యా సెలవు కోరాడని.. ఈ సిరీస్ నుంచి ఇప్పటికే రోహిత్ శర్మ మినహాయింపు కోరిన నేపథ్యంలో.. టి20, వన్డేలకు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహిస్తాడని బీసీసీఐ అధికారి ఒకరు ద్రువీకరించారు.
వాళ్లు ఉన్నప్పటికీ
సూర్య కుమార్ యాదవ్ కంటే గిల్, కేఎల్ రాహుల్ ముందు వరుసలో ఉన్నప్పటికీ జాతీయ జట్టు నిబంధనలకు లోబడి దేశీయ టోర్నమెంట్లలో వాళ్లు ఆడకపోవడంతో.. కెప్టెన్సీ కోసం బీసీసీఐ రాహుల్, గిల్ పేర్లను ప్రతిపాదనలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది. అయితే రోహిత్, విరాట్ కోహ్లీ, బుమ్రా వంటి ఆటగాళ్లకు మాత్రమే మినహాయింపు ఉందని, మిగతా ఆటగాళ్లకు అలాంటి వెసలు బాటు లేదని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఆగస్టు నుంచి దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో టెస్ట్ బ్యాటర్లందరూ పాల్గొనే లా బీసీసీఐ ప్రణాళికల రూపొందించింది. ఇందులో ప్రతిభ చూపిన వారికే త్వరలో జరిగే బంగ్లాదేశ్, న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ లలో ఆడే అవకాశం లభిస్తుందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.