Frank Duckworth: క్రికెట్ లో “డక్ వర్త్” రూపకర్త ఇకలేరు..

డక్ వర్త్ కు 84 ఏళ్ళ వయసు. ఆయన మరణ వార్తను ఓ వెబ్ సైట్ ధ్రువీకరించింది. డక్ వర్త్ స్వస్థలం ఇంగ్లాండ్. ఆయన గణాంక శాఖలో నిపుణుడిగా పని చేసేవాడు.. ఆయనకు క్రికెట్ అంటే వల్ల మాలిన ఇష్టం ఉండేది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 26, 2024 6:35 pm

Frank Duckworth

Follow us on

Frank Duckworth: క్రికెట్ లో అనూహ్యంగా వర్షం పడినప్పుడు.. వాతావరణం లో వేడి ఎక్కువున్నప్పుడు.. మైదానం తేమగా ఉన్నప్పుడు.. అభిమానులకు “డక్ వర్త్ లూయిస్” అనే పదం సుపరిచితమే. డక్ వర్త్ లూయిస్ విధానంలో ఓవర్లను తగ్గించారని, లక్ష్యాన్ని కుదించారని అభిమానులు వింటూనే ఉంటారు.. అయితే ఈ డక్ వర్త్ లూయిస్ స్టెర్న్ విధానాన్ని ఆవిష్కరించిన వారిలో ఒకరైన ఫ్రాంక్ డక్ వర్త్ ఇక లేరు. ఆయన ఈనెల 21న కన్నుమూశారు. వృద్ధాప్యం వల్ల ఏర్పడిన అనారోగ్యంతో ఆయన కాలం చేశారు. అయితే ఆయన మరణ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

డక్ వర్త్ కు 84 ఏళ్ళ వయసు. ఆయన మరణ వార్తను ఓ వెబ్ సైట్ ధ్రువీకరించింది. డక్ వర్త్ స్వస్థలం ఇంగ్లాండ్. ఆయన గణాంక శాఖలో నిపుణుడిగా పని చేసేవాడు.. ఆయనకు క్రికెట్ అంటే వల్ల మాలిన ఇష్టం ఉండేది. ఈ క్రమంలో టోనీ లూయిస్ అనే వ్యక్తితో కలిసి డిఎల్ఎస్ అనే పద్ధతిని రూపొందించాడు. అనుకోని పరిస్థితుల్లో వాతావరణం మారినప్పుడు, వర్షం కురిసినప్పుడు క్రికెట్ మ్యాచ్ లో ఫలితం రాబట్టేందుకు ఆయన ఒక కొత్త సమీకరణాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. డక్ వర్త్ డీఎల్ఎస్ ను ఆవిష్కరించనప్పుడు.. వర్షం కురిసి ఆటంకం కలిగితే మ్యాచ్ ను అంపైర్లు రద్దు చేసేవారు. కానీ డక్ వర్త్ లూయిస్ తీసుకొచ్చిన విధానం ద్వారా వర్షం కురిసినప్పటికీ విజేతను నిర్ణయించేందుకు అవకాశం కలిగింది.

డక్ వర్త్ లూయిస్ విధానాన్ని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ 1997లో తొలిసారిగా అమలు చేసింది. అనంతరం వర్షం వల్ల మ్యాచ్ లకు ఆటంకం కలిగితే, లక్ష్యాలను నిర్ణయించేందుకు 2001 నుంచి ఈ పద్ధతిని ప్రామాణికంగా తీసుకోవడం మొదలుపెట్టింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతికి తర్వాతి కాలంలో ఆస్ట్రేలియాకు చెందిన గణాంక నిపుణుడు స్టీవెన్ స్టెర్న్ అనేక మార్పులు తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఈ పద్ధతికి డక్ వర్త్ లూయిస్ స్టెర్న్ ( డీఎల్ఎస్) గా పేరు పెట్టారు. కాగా లూయిస్ 2020లో అనారోగ్య కారణాల వల్ల కన్నుమూశారు. అయితే ఈ డీఎల్ఎస్ పద్ధతి కొన్ని జట్లకు వరంగా, మరికొన్ని జట్లకు శాపంగా మారిన సందర్భాలు అనేకం ఉన్నాయి.. వర్షాల వల్ల మ్యాచ్ కొనసాగించలేని పక్షంలో.. డీఎల్ఎస్ విధానాన్ని అమలు చేయడం వల్ల, అప్పటిదాకా విజయం దిశగా దూసుకెళ్లిన జట్లు ఎన్నోసార్లు ఓడిపోయాయి.