Virender Sehwag and Aarti Ahlawat divorce
Virendra Sehwag divorce: రాను రాను కుటుంబ వ్యవస్థ సర్వనాశనమైపోతోంది. ఆర్థిక స్వేచ్ఛ పెరగడం.. వ్యక్తిగత అలవాట్లు ఎక్కువ కావడం.. స్వతంత్రంగా జీవించాలని కోరిక పెరగడం.. ఎదుటి వ్యక్తి అజమాయిషి నచ్చకపోవడం.. వంటివి సంసారాలలో నిప్పులు పోస్తున్నాయి. ఇంకా కొంతమంది సంసారాల్లో అయితే మూడో వ్యక్తి ప్రవేశించడంతో చిన్నాభిన్నమవుతున్నాయి. దీంతో ఏం చేయాలో అర్థం కాక.. ఎలాంటి అడుగులు వేయాలో తెలియక.. సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారు. సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం ఈరోజు కొత్త విషయం కాకపోయినప్పటికీ.. ఇటీవల కాలంలో పెరిగిపోయింది. మొన్నటిదాకా గొప్పగా జీవించిన జంటలు.. సామాజిక మాధ్యమాలలో తెగ కనిపించిన జంటలు విడాకులు తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇటీవలి కాలంలో ఏఆర్ రెహమాన్ దంపతులు విడాకులు తీసుకోవడం సంచలనాన్ని కలిగించగా… ఇప్పుడు టీమిండియా ఒకప్పటి డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ – ఆర్తి అహ్లావత్ దంపతులు విడాకులు తీసుకుంటారనే వార్తలు రావడం క్రికెట్ ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది. వీరేంద్ర సెహ్వాగ్, ఆర్తి దంపతులు ఇన్ స్టా గ్రామ్ లలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు.. అంతకంటే ముందే కొద్ది నెలలుగా వీరు ఎడ మొహం పెడ మొహం గా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఒక గత ఏడాది దీపావళి వేడుకల సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్ ఒంటరిగా పండగ జరుపుకున్నాడు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా షేర్ చేశాడు. అదే అప్పట్లో ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
అదేనా కారణం
భారత క్రికెట్ వర్గాల్లో గత ఏడాది చివర్లో హార్దిక్ పాండ్యా – నటాషా దంపతులు తమ విడాకులను ప్రకటించారు. కలిసి ఉండలేమని.. అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు.. తమ సంతానానికి మాత్రం తల్లిదండ్రులుగా ప్రేమను పంచుతామని పేర్కొన్నారు. ఇక యజువేంద్ర చాహల్ – ధన శ్రీ విడాకులు తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.. వీరిద్దరు కూడా తమ విడాకుల విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని ఇంతవరకు ఖండించలేదు.. తమ వ్యక్తిగత స్వేచ్ఛకు విలువ ఇవ్వండి అని మాత్రమే కోరుతున్నారు. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్ – ఆర్తి చేరిపోయారు.. సెహ్వాగ్, ఆర్తి 2004లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇద్దరు అబ్బాయిలు సంతానం.. మొదట్లో అన్యోన్యంగానే ఉండేవారు. వీరేంద్ర సెహ్వాగ్ ఆ స్థాయిలో రాణించడం వెనుక ఆర్తి కూడా తన వంతు ప్రోత్సాహాన్ని అందించింది. భర్త ఆడే మ్యాచ్ లకు తప్పకుండా హాజరయ్యేది. ఇన్నాళ్లపాటు అన్యోన్యంగా సాగిన వీరి సంసారం ఒకసారిగా సంక్షోభంలో కూరుకుపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ” వ్యక్తిగత స్వచ్ఛను అపరిమితంగా కోరుకోవడం.. ఎదుటి వ్యక్తిని అజమాయిషీ ని కోరుకోలేకపోవడం వంటి పరిణామాలతో సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారు. వైవాహిక బంధాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదు. అందువల్లే త్వరగా రా విడాకులు తీసుకుంటున్నారని” మనస్తత్వశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.