AP BJP
AP BJP: బిజెపి( Bhartiya Janata Party) నూతన అధ్యక్షులు ఎవరు? పురందేశ్వరిని కొనసాగిస్తారా? అదే సామాజిక వర్గం నేతకు కేటాయిస్తారా? లేకుంటే రాయలసీమ రెడ్లకు ప్రాధాన్యమిస్తారా? మధ్య మార్గంగా బీసీలకు పదవి ఇస్తారా? పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ. బిజెపి అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి పదవీకాలం ఈ జూలైతో ముగియనుంది. దీంతో ఆమె స్థానంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక అనివార్యంగా మారింది. అయితే ఆమె పనితీరు బాగుందనుకుంటే కొనసాగించే అవకాశం ఉంది. పురందేశ్వరి కి ముందు సోము వీర్రాజు సుదీర్ఘకాలం రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన రెండేళ్ల పదవి ముగిసిన హై కమాండ్ ఆయనను కొనసాగించింది. ఇప్పుడు అదే మాదిరిగా పురందేశ్వరిని కొనసాగిస్తారని ప్రచారం నడుస్తోంది. దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి.
* హోం మంత్రి అమిత్ షా దృష్టికి
మొన్నటికి మొన్న ఏపీ పర్యటనకు వచ్చారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Amit Shah ). నేరుగా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లి అక్కడే భోజనం చేశారు. ఆ సమయంలో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ ఉన్నారు. ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి సైతం విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి గురించి ప్రస్తావన వచ్చింది. అయితే అప్పుడే పరోక్ష సంకేతాలు ఇచ్చారు పురందేశ్వరి. ప్రస్తుతం మూడు పార్టీల మధ్య సమన్వయం బాగానే ఉందని.. ఎటువంటి ఇబ్బందులు లేవని పురందేశ్వరి తన మనసులో ఉన్న మాటను చెప్పేశారు. అదే సమయంలో చంద్రబాబు సైతం బిజెపి సమన్వయం బాగుందని పరోక్షంగా పురందేశ్వరిని కొనసాగించాలని అమిత్ షా కు సూచించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ సైతం మౌనంగా ఊరుకోవడంతో పురందేశ్వరి కొనసాగడం ఖాయంగా తేలిపోయింది.
* సుజనా చౌదరికి ఛాన్స్
ఒకవేళ పురందేశ్వరిని తొలగిస్తే ఆమె స్థానంలో.. అదే సామాజిక వర్గానికి చెందిన సుజనా చౌదరిని ( Sujana Chaudhari )నియమించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవి ఆశించారు. కానీ దక్కలేదు. ఇప్పట్లో సర్దుబాటు చేయలేరు కూడా. అందుకే ఏపీ బీజేపీ చీఫ్ పదవి ఆయనకు విడిచి పెడితే గౌరవంగా ఉంటుందన్నది కూటమి పార్టీల నుంచి వస్తున్న మాట. పైగా చంద్రబాబుతో ఆయన సమన్వయం చేసుకోగలరు. అత్యంత సన్నిహితులు కూడా. ఒకవేళ బిజెపి హై కమాండ్ పురందేశ్వరిని తప్పించాలనుకుంటే మాత్రం.. చంద్రబాబు కచ్చితంగా సుజనా చౌదరి పేరును సిఫారసు చేస్తారని ప్రచారం నడుస్తోంది.
* రెడ్డి సామాజిక వర్గం నేతలు సైతం
ఇంకోవైపు రాయలసీమ రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలంటే విష్ణువర్ధన్ రెడ్డి ( Vishnuvardhan Reddy)పేరు పరిశీలనలోకి తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఆయన పార్టీలో సుదీర్ఘకాలం పనిచేస్తూ వచ్చారు. గడిచిన ఎన్నికల్లో టికెట్ ఆశించారు. కానీ దక్కలేదు. మరోవైపు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు సైతం తెరపైకి వచ్చింది. ఈ ఎన్నికల్లో ఆయన రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇంకోవైపు కడప జిల్లాకు చెందిన ఆదినారాయణ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. అయితే రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే మాత్రం ఈ ముగ్గురు నేతల పేర్లు పరిగణలోకి తీసుకోవడం ఖాయం.
* బీసీల్లో ఆశావహులు
మరోవైపు బీసీలకు అధ్యక్ష పదవి ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఎమ్మెల్యే పార్థసారధి( Parda Sarathi ) పేరు ప్రముఖంగా వినబడుతోంది. అదే సమయంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా చేసిన పివీఎన్ మాధవ్ సైతం తన పేరును పరిగణలోకి తీసుకోవాలని హై కమాండ్కు సూచిస్తున్నారు. ఇంకోవైపు శ్రీకాకుళం జిల్లాకు చెందిన పూడి తిరుపతిరావు సైతం దరఖాస్తు చేసుకున్నారు. 27 సంవత్సరాలుగా పార్టీకి ఎనలేని సేవలు అందించాలని.. ఏబీవీపీ కార్యకర్తగా అడుగుపెట్టి అనేక పదవులు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు తిరుపతి. మొత్తానికి అయితే ఏపీలో బిజెపి అధ్యక్ష పీఠానికి పెద్ద డిమాండ్ కనిపిస్తోంది. మరి ఎవరికి పదవి వరిస్తుందో చూడాలి.