Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 12వ సారి కూడా టాస్ ఓడిపోయాడు. 2023 నవంబర్లో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు రోహిత్ శర్మ వన్డేలలో టాస్ ఓడిపోతూనే ఉన్నాడు. తాజాగా ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లోనూ రోహిత్ టాస్ఓడి పోయాడు. ఈ మ్యాచ్లో టాస్ నెగ్గిన న్యూజిలాండ్ కెప్టెన్ శాంట్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు..
దుబాయ్ మైదానం స్పిన్నర్లకు అనుకూలిస్తుంది అని తెలిసినప్పటికీ కూడా న్యూజిలాండ్ కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకోవడం విశేషం. దుబాయ్ మైదానంపై ఇప్పటివరకు ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆటగాళ్లు నాలుగు మ్యాచ్లు ఆడారు. ఈ నాలుగు మ్యాచ్ లలోనూ భారత్ విజయం సాధించింది. లీగ్ దశలో న్యూజిలాండ్ జట్టుపై ముందుగా బ్యాటింగ్ చేసి… బంగ్లాదేశ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికాపై ముందుగా బౌలింగ్ చేసి విజయాలు సాధించింది. టాస్ ఓడిపోయినప్పటికీ… టీమిండియా ఆటగాళ్లు సమష్టి ప్రదర్శన చేశారు. అయితే ఫైనల్ మ్యాచ్లో టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ ఓడిపోవడం పట్ల సురేష్ రైనా స్పందించాడు. వాస్తవానికి ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ టాస్ గెలుస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అతడు టాస్ నెగ్గలేకపోయాడు. అంతేకాదు టాస్ ఓడిపోవడం లో వెస్టిండీస్ కెప్టెన్ లారా తో సమానంగా నిలిచాడు. నవంబర్ 2023 నుంచి మొదలుపెడితే మార్చి 2025 వరకు రోహిత్ శర్మ 12 మ్యాచ్లలో వరుసగా టాస్ ఓడిపోయాడు. బ్రియాన్ లారా అక్టోబర్ 1998 నుంచి మే 1999 వరకు 12 మ్యాచ్లలో టాస్ ఓడిపోయాడు.
సురేష్ రైనా ఏమన్నాడంటే
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫైనల్ మ్యాచ్లో కూడా టాస్ ఓడిపోవడం పట్ల మాజీ ఆటగాడు సురేష్ రైనా స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా తన స్పందన తెలియజేశాడు. ” రోహిత్ వరుసగా 12వ మ్యాచ్లో కూడా టాస్ ఓడిపోయాడు. వన్డే మ్యాచ్లలో టీమిండియా వరుసగా 15వసారి టాస్ ఓడిపోయింది. ఇది కొంచెం ఇబ్బందిగానే ఉన్నప్పటికీ.. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మినహా.. మిగతా అన్నిసార్లు టీమ్ ఇండియాకు అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. బహుశా అందువల్లే టాస్ గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు. అయితే ఫైనల్ మ్యాచ్లో టాస్ ఒకవేళ రోహిత్ శర్మ గనుక గెలిచి ఉంటే కచ్చితంగా బౌలింగ్ ఎంచుకునేవాడు. ఎందుకంటే దుబాయ్ మైదానం స్పిన్ బౌలింగ్ కు అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్ ఎలాగైనా గెలవాలని రోహిత్ శర్మ భావిస్తున్నాడు కాబట్టి.. అతడికి మైదానంపై సంపూర్ణమైన అవగాహన ఉంటుంది. పైగా టీమిండియా గత నాలుగు మ్యాచ్లలో ఇదే మైదానంపై గెలిచింది. అందువల్ల రోహిత్ శర్మ కోరుకున్న నిర్ణయమే అతడికి వచ్చింది. కాకపోతే టాస్ ఓడిపోయిన కూడా రోహిత్ శర్మకు అనుకూలమైన నిర్ణయం రావడం మామూలు విషయం కాదు. అయితే ఈసారి రోహిత్ శర్మ టాస్ నెగ్గాలంటే షోలే సినిమా కచ్చితంగా చూడాల (నవ్వుతూ) ని” సురేష్ రైనా వ్యాఖ్యానించాడు. టాస్ ను రోహిత్ శర్మ ఓడిపోయిన నేపథ్యంలో సురేష్ రైనా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్నాయి.