Basit Ali :  బౌలింగ్ కోచ్ కు కనీస గౌరవం ఇవ్వలేదు.. పైగా మా వాళ్లల్లో విపరీతమైన అహం..పాక్ ఆటగాళ్లను ఏకిపడేసిన మాజీ క్రికెటర్..

దిగ్గజ ఆటగాళ్లతో అలరారిన పాకిస్తాన్ జట్టు.. నేడు సాదా సీదా ఆటగాళ్లతో నిండిపోయింది. పైగా వారిలో బౌలింగ్ కోచ్ కు గౌరవం ఇవ్వాలనే కనీస సోయి కూడా లేదు. ఈ మాట అన్నది మరెవరో కాదు..పాక్ జట్టు మాజీ క్రికెటర్.

Written By: Anabothula Bhaskar, Updated On : September 24, 2024 5:56 pm

Basit Ali Comments

Follow us on

Basit Ali :   అమెరికా చేతిలో ఓడిపోయింది. భారత్ చేతిలో భంగపాటుకు గురైంది. ఇటీవల బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ కోల్పోయింది. అది కూడా స్వదేశంలో ..ఇంతటి దుస్థితి ఎదుర్కొంటున్నప్పటికీ పాకిస్తాన్ క్రికెటర్లలో కనువిప్పు కలగడం లేదు. వారి ఆట తీరు మారడం లేదు.. దీంతో పాకిస్తాన్ క్రికెటర్ల పై ఆ దేశానికి చెందిన మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి బసిత్ అలీ అనే క్రికెటర్ చేరాడు.. ఈ సందర్భంగా పాకిస్తాన్ జట్టు ఆటగాళ్లు అసలు రూపాన్ని బయటపెట్టాడు. ” కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్ జట్టు ఆట తీరు దారుణంగా ఉంది. ముఖ్యంగా పావని అధ్వానంగా మారింది. దీనికి పాకిస్తాన్ బౌలర్ల అహమే ప్రధాన కారణం అనడంలో అనుమానం లేదు. ఎందుకంటే మేమే గొప్ప అనే భావన పాకిస్తాన్ బౌలర్లలో ఉంటుంది. ఈ మాట చెప్పడానికి నేనేమీ సిగ్గుపడటం లేదు. అప్పటి బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ను చిన్న చూపు చూశారు. అతనిపై నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. దీంతో అతడు భారత జట్టు బౌలింగ్ కోచ్ గా నియమితులయ్యాడు. కానీ అతడికి భారత జట్టులో లభిస్తున్న గౌరవం వేరే తీరుగా ఉంది. మా దేశంలో అతడు బౌలింగ్ కోచ్ గా ఉన్నప్పుడు బౌలర్లు పెద్దగా రాణించలేదు. అదే అతడు కోచ్ గా నియమితుడైన తర్వాత భారత బౌలింగ్ పూర్తిగా మారింది. ఇటీవల బంగ్లాదేశ్ టెస్ట్ అందుకు ఉదాహరణ. మా దేశంలో బంగ్లాదేశ్ పర్యటించి 2-0 తేడాతో సిరీస్ ఎగరేసుకుపోయింది. అదే భారత్ లో పర్యటిస్తున్నప్పుడు 280 పరుగుల తేడాతో ఓడిపోయిందని” బసిత్ అలీ వ్యాఖ్యానించాడు.

కోచ్ ఏమంటున్నారంటే

బసిత్ అలీ వ్యాఖ్యల నేపథ్యంలో.. పాకిస్తాన్ కోచ్ గిలెస్పీ స్పందించాడు. ఇటీవల వన్డే ప్రపంచ కప్, టీ – 20 వరల్డ్ కప్, బంగ్లాదేశ్ సిరీస్ లో పాకిస్తాన్ దారుణమైన వైఫల్యాలను మూటకట్టుకుంది. ఈ నేపథ్యంలో జట్టు ఆటతీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే గిలెస్పీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి..” పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మోహ్ సిన్ నఖ్వీ ఆధ్వర్యంలో శిబిరం నిర్వహించాం. భవిష్యత్ కాలంలో మూడు ఫార్మాట్ లలో పాకిస్తాన్ జట్టును నంబర్ వన్ గా నిలపాలనేది మా ధ్యేయం. ప్రతి ఆటగాడు జట్టు విజయాల కోసం కృషి చేయాలి. ఆటగాళ్లకు మేము సహాయం అందిస్తాం. ఆటగాళ్ల సమస్యలను విన్నాం. ఆటగాళ్లకు దేశంపై ప్రేమ ఉంది. వారి గర్వాన్ని మేము మరింత పెంచుతాం. వారికి ప్రేరణగా నిలుస్తాం. ఆటగాళ్ల మొత్తం పూర్తి జాగ్రత్త ఉన్నారు. మెరుగ్గా రాణించాలని తపన పడుతున్నారని” గిలెస్పీ వ్యాఖ్యానించాడు.