India Vs England 5th Test: ధర్మశాల వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో టెస్ట్ మొదలైంది. మూడు టెస్టులు ఓడిపోయి.. సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు.. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలనే కసి తో ఉంది. మరోవైపు సిరీస్ గెలిచినప్పటికీ WTC ర్యాంకింగ్స్ లో మొదటి స్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని.. అందుకే ఈ మ్యాచ్ లో కూడా గెలవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. దీంతో అనామక టెస్ట్ కాస్తా సీరియస్ గేమ్ అయిపోయింది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మైదానం బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందనే అంచనా తో.. అతడు ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఆ ప్రాంతం శీతల వాతావరణం ఉండటంతో.. మధ్యాహ్నం వరకు మైదానం బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని.. తర్వాత పేస్ బౌలర్లకు సహకరిస్తుందనే ఉద్దేశంతో స్టోక్స్ బ్యాటింగ్ కు మొగ్గు చూపాడు. ఓపెనర్లుగా క్రావ్ లే, డకెట్ బరిలోకి దిగారు. వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు 22 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జస్ ప్రీత్ బుమ్రా, సిరాజ్ బౌలింగ్ వేస్తున్నారు.
ఈ మ్యాచ్ కు దిగేముందు భారత జట్టు స్వల్ప మార్పులు చేసింది. గత మూడు టెస్టుల్లో విఫలమైన రజత్ పాటిదార్ ఆఖరి టెస్ట్ కి దూరమయ్యాడు. అయినప్పటికీ టీం మేనేజ్మెంట్ అతని ఆడించాలనుకుంది. కానీ ప్రాక్టీస్ చేస్తుండగా గాయం కావడంతో అతడి స్థానంలో దేవదత్ పడిక్కల్ ను జట్టులోకి తీసుకున్నారు. ధర్మశాల మ్యాచ్ తో అతడు జట్టులకి ఎంట్రీ ఇచ్చాడు.. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, యువ సంచలనాలు సర్ఫ రాజ్ ఖాన్, ధృవ్ జురెల్ మిడిల్ ఆర్డర్ భారాన్ని మోయాల్సి ఉంది. రవీంద్ర జడేజా, కులదీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ బాధ్యతలు పంచుకుంటారు. జస్ ప్రీత్ బుమ్రా, సిరాజ్ పేస్ బరువును మోస్తున్నారు.
ఇంగ్లాండ్ జట్టు కూడా ఇద్దరు పేస్, ముగ్గురు స్పిన్నర్లతో రంగంలోకి దిగింది. జేమ్స్ అండర్సన్, మార్క్ వుడ్ పేస్ బౌలింగ్ బాధ్యతలను పంచుకుంటారు.. వీరికి ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కూడా తోడవుతాడు. టామ్ హార్ట్ లీ, షోయబ్ బషీర్ స్పిన్ బరువు మోస్తారు. గత టెస్టులో బషీర్ మెరుగైన బౌలింగ్ చేయడంతో.. ఈ టెస్ట్ లో అతనిపై ఇంగ్లాండు జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది. మరోవైపు మైదానం పేస్ బౌలింగ్ కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో అండర్సన్, మార్కు వుడ్ రాణించాలని ఇంగ్లాండు జట్టు కోరుకుంటున్నది.