Homeక్రీడలుక్రికెట్‌Euro Cup 2024 : ఆద్యంతం ఉత్కంఠ.. చివరి నిమిషంలో గోల్.. యూరో కప్ సెమీఫైనల్...

Euro Cup 2024 : ఆద్యంతం ఉత్కంఠ.. చివరి నిమిషంలో గోల్.. యూరో కప్ సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ సంచలనం..

Euro Cup 2024 : యూరో కప్ లో రెండవ సెమీస్ మ్యాచ్ లోనూ సంచలనం నమోదయింది. తొలి సెమీస్ మ్యాచ్లో ఫ్రాన్స్ జట్టును ఓడించి స్పెయిన్ ఫైనల్ దూసుకెళ్లింది. ఇక డార్ట్ మండ్ వేదికగా జరిగిన రెండవ సెమీఫైనల్ మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై ఇంగ్లాండ్ జట్టు సంచలన విజయం సాధించింది. 2-1 తేడాతో విజయం సాధించిన ఇంగ్లీష్ జట్టు రెండోసారి యూరో కప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ అద్యంతం తీవ్ర ఉత్కంఠ కలిగించింది. ఆఖరి నిమిషంలో గోల్ సాధించిన ఇంగ్లాండ్ ఆటగాడు ఓలీ వాట్కిన్స్.. తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు..

మ్యాచ్ ప్రారంభమైన తొలి అర్ధ భాగం పదో నిమిషం వరకు ఇంగ్లాండ్ జట్టు పై నెదర్లాండ్స్ పై చేయి సాధించింది. ముఖ్యంగా బంతిని పాస్ చేయడంలో నెదర్లాండ్స్ ఆటగాళ్లు విజయవంతమయ్యారు. పదేపదే ఇంగ్లాండ్ గోల్డ్ పోస్ట్ పైకి దూసుకెళ్లారు. ఇంగ్లీష్ జట్టు ఆటగాళ్ళను డిఫెన్స్ లో పడేశారు. తామే మ్యాచ్ గెలుస్తామనే సంకేతాలను నెదర్లాండ్స్ అభిమానుల్లో కలిగించారు. ఇదే సమయంలో ఆట ఏడవ నిమిషంలో నెదర్లాండ్స్ మిడ్ ఫీల్డర్ క్టెవీ సైమన్స్ అద్భుతమైన గోల్ చేసి.. డచ్ జట్టుకు శుభారంభాన్ని అందించాడు. దీంతో ప్రారంభంలోనే నెదర్లాండ్స్ జట్టు 1-0 లీడ్ లోకి వెళ్ళింది. ఈ సమయంలో ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ హ్యారీ కేన్ పెనాల్టీ గోల్ చేసి డచ్ ఆధిక్యాన్ని 1-1 తో సమం చేశాడు. ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి రెండు జట్లూ చెరో గోల్ తో సమానంగా నిలిచాయి.

ఇక సెకండ్ హాఫ్ లో ఇంగ్లాండ్ – నెదర్లాండ్స్ నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడ్డాయి. నెదర్లాండ్స్ జట్టు తరఫున డోనియల్ మాలెన్ స్థానంలో వుత్ వెఘోర్ట్స్ సబ్ స్టిట్యూట్ ఆటగాడిగా మైదానంలోకి వచ్చారు. మరోవైపు ఇంగ్లాండ్ జట్టులో కీరన్ స్థానంలో ల్యూక్ షా వచ్చాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టు మ్యాచ్ 20 నిమిషాలకు ముగుస్తుందనగా.. మరో రెండు కీలక మార్పులు చేసింది. స్టార్ ఆటగాళ్లు కేన్, ఫోడెన్ బయటికి పంపించింది. వారి స్థానాలలో వాట్కిన్స్, పామర్ మైదానంలోకి వచ్చారు. అయితే సెకండ్ హాఫ్ టైం ఎండ్ అవుతున్నప్పటికీ రెండు జట్లు ఒక్క గోల్ కూడా సాధించలేకపోయాయి. ఈ క్రమంలో పెనాల్టీ షూట్ అవుట్ జరుగుతుందని అందరూ ఒక అంచనాకొచ్చారు. మ్యాచ్ చివరి నిమిషం (90 మినిట్) లో ఇంగ్లాండ్ జట్టులోకి సబ్ స్టి ట్యూట్ వచ్చిన వాట్కిన్స్ మైదానంలో సంచలనం సృష్టించాడు.. నెదర్లాండ్స్ గోల్డ్ కీపర్ ను బురిడీ కొట్టిస్తూ అద్భుతమైన గోల్ చేశాడు. ఈ గోల్ ద్వారా ఇంగ్లాండ్ జట్టు రెండవసారి యూరో కప్ లో ఫైనల్ కు వెళ్ళింది. జూలై 15న జరిగే ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు స్పెయిన్ ను ఢీకొంటుంది.

మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ లో స్పెయిన్, ఫ్రాన్స్ పరస్పరం తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో కూడా ముందుగా ఫ్రాన్స్ గోల్ చేసింది. ఆ తర్వాత స్పెయిన్ బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా పుంజుకుంది. 2-1 తేడాతో ఫ్రాన్స్ జట్టును ఓడించింది. 2022 ఖతార్ లో జరిగిన ఫిఫా సాకర్ లో ఫైనల్ వెళ్లిన ఫ్రాన్స్.. అర్జెంటీనా చేతిలో ఓడిపోయింది.  యూరో కప్ సాధించి ఆ ఓటమి బాధను మర్చిపోవాలని ఫ్రాన్స్ భావించింది. కానీ ఆ జట్టు ఆశలపై స్పెయిన్ నీళ్లు చల్లింది. దీంతో ఫ్రాన్స్ ఆటగాళ్లు మైదానంలో నిర్వేదంలో కూరుకు పోయారు. ఇక ఆ జట్టు అభిమానులైతే సోషల్ మీడియాలో వేదనా భరితమైన పోస్టులు పెట్టారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version