Shafali Verma: ఎప్పుడొచ్చాం కాదన్నయ్య.. బుల్లెట్ దిగిందా లేదా.. ఈ డైలాగు పోకిరి సినిమాలో ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ డైలాగు ఈ ఉమెన్ క్రికెటర్ కు నూటికి నూరుపాళ్ళు సరిపోతుంది. వేగవంతమైన ఆట.. పరుగులు తీయడంలో అసాధ్యమైన సామర్థ్యం.. ఇవన్నీ కూడా ఆమె సొంతం. అందువల్లే ఇప్పుడు ఏకంగా ప్రపంచ రికార్డును సాధించింది. తన వయసున్న మహిళా క్రికెటర్లు కలలో కూడా ఊహించని ఘనతను అందుకుంది.
మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో షఫాలి వర్మ 78 బంతుల్లో 87 పరుగులు చేసింది. స్మృతి మందానతో కలిసి తొలి వికెట్ కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసింది. తద్వారా టీమిండియా వన్డే వరల్డ్ కప్ సాధించడంలో షఫాలీ వర్మ కీలకపాత్ర పోషించింది. అంతేకాదు, దూకుడుగా బ్యాటింగ్ చేసి దక్షిణాఫ్రికా బౌలర్లకు సింహ స్వప్నం లాగా నిలిచింది. అటువంటి వర్మ ప్రస్తుతం శ్రీలంక జట్టుతో జరుగుతున్న 5 t20 మ్యాచ్ల సిరీస్లో అదరగొడుతోంది. విశాఖపట్నం వేదికగా జరిగిన రెండవ మ్యాచ్లో షఫాలీ వర్మ అదిరిపోయే రేంజ్ లో హాఫ్ సెంచరీ చేసింది. తద్వారా వరల్డ్ రికార్డు తన పేరు మీద క్రియేట్ చేసుకుంది.
షఫాలీ వర్మ వయసు ప్రస్తుతం 22 సంవత్సరాలు. ఇంత చిన్న వయసులోనే మహిళా టి20 క్రికెట్లో అత్యధిక హాఫ్ సెంచరీలు (12) సాధించింది. ఈ ఘనత అందుకున్న అతి చిన్న క్రికెటర్ గా ఆమె పేరు తెచ్చుకుంది. ఈమె తర్వాత స్టాఫానీ వెస్టిండీస్ (10), గాబి ఐర్లాండ్ (10), జెమీమా ఇండియా(7) ఉన్నారు. కాగా, టి20 క్రికెట్లో 120+ పరుగుల టార్గెట్ అత్యంత వేగంగా (11.5 ఓవర్లలో) ఫినిష్ చేయడం టీమ్ ఇండియాకు ఇదే తొలిసారి. ఇక మిగిలిన బంతుల పరంగా కూడా టీమిండియా సాధించిన అతిపెద్ద విజయం కూడా ఇదే.
షఫాలీ వర్మ వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెడుతుంది. బంతులను కూడా బలంగా కొడుతుంది. సాధ్యమైనంత వరకు ప్రత్యర్థి బౌలర్ల మీద ఆధిపత్యం ప్రదర్శించడానికి ఏమాత్రం వెనుకాడదు. పైగా దూకుడు కొనసాగించడంలో, వేగాన్ని స్థిరంగా ప్రదర్శించడంలో వర్మ తర్వాతే ఎవరైనా.