ENG vs SL : ఇంగ్లండ్ చేతిలో చిత్తుచిత్తు.. లంక మరీ ఇంత దారుణంగా మారిందేంటి?

ఇటీవల టీమిండియా పై వన్డే సిరీస్ గెలిచి శ్రీలంక సత్తా చాటింది. టీ -20 సిరీస్ ఓటమికి సరైన స్థాయిలో బదులు తీర్చుకుంది. దీంతో శ్రీలంక జట్టు గాడిన పడిందని అందరూ భావించారు. కానీ అది కేవలం పాలపొంగు మాత్రమేనని తేలిపోయింది.

Written By: NARESH, Updated On : August 21, 2024 9:49 pm

ENG vs SL

Follow us on

ENG vs SL : ఇంగ్లాండ్ జట్టుతో మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో శ్రీలంక తొలి టెస్ట్ మొదలుపెట్టింది. టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది.. ఇంగ్లాండ్ బౌలర్లు మాత్రం శ్రీలంకకు భారీ స్కోర్ చేసే అవకాశం ఇవ్వలేదు . మైదానంపై పచ్చిక అధికంగా ఉండడం, తేమ కూడా సహకరించడంతో రెచ్చిపోయి బౌలింగ్ చేశారు. ఫలితంగా శ్రీలంక బ్యాటర్లు పెవిలియన్ చేరేందుకు పోటీపడ్డారు. శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్ ధనుంజయ డిసిల్వా 74 రన్స్ చేసి, టాప్ స్కోరర్ గా నిలిచాడు. మరో ఆటగాడు మిలన్ ప్రియనాథ్ రత్న నాయకే(58*) ఆకట్టుకున్నాడు. ఇక మిగతా వారంతా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. తొలి రోజు 63.3 ఓవర్ల ఆట సాగింది. తొలిరోజు ఇన్నింగ్స్ ముగిసే సమయం నాటికి శ్రీలంక 8 వికెట్లు కోల్పోయి 207 రన్స్ చేసింది.

ఆరు పరుగులకే కరుణ రత్నే రూపంలో శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత అదే పరుగుల వద్ద నిషాన్ మధుశంక వికెట్ నష్టపోయింది. కేవలం ఆరు పరుగులకే ఓపెనర్లు పెవిలియన్ చేరుకున్నారు. ఈ క్రమంలో వచ్చిన కుశాల్ మెండిస్ 24 పరుగులు చేసి సౌకర్యవంతంగా కనిపించినప్పటికీ.. ఏంజెలో మాథ్యూస్ 0, దినేష్ చాంది మాల్ 17 పెద్దగా సపోర్టు ఇవ్వకపోవడంతో కుషాల్ ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. అతడు కూడా 24 పరుగుల వద్ద అవుట్ కావడంతో శ్రీలంక కష్టాలు మరింత పెరిగాయి. ఈ దశలో వచ్చిన డిసిల్వా 74 పరుగులు చేశాడు. అతడికి ప్రియనాథ్ ఒక్కడే సహకరించాడు. డిసిల్వా 74 పరుగుల వద్ద అవుట్ కావడంతో శ్రీలంక భారీ స్కోర్ పై ఆశలు వదిలేసుకుంది. ప్రస్తుతం క్రీజ్ లో ప్రియనాథ్ 74, విశ్వ ఫెర్నాండో 2* లో ఉన్నారు. ఇంగ్లాండ్ బోర్డర్లలో క్రిస్ వోగ్స్ మూడు వికెట్లు పడగొట్టాడు.. షోయబ్ బషీర్, అట్కిన్సన్ తల రెండు వికెట్లు పడగొట్టారు. మార్క్ వుడ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఒకానొక దశలో ఆరు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన శ్రీలంక జట్టు.. 100 పరుగులకే ఆల్ అవుట్ అవుతుందని అందరూ భావించారు. ఈ దశలో కెప్టెన్ డిసిల్వా సమయోచితంగా ఆడటంతో.. శ్రీలంక ఆమాత్రమైన స్కోర్ చేయగలిగింది. అయితే ఇంగ్లాండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో శ్రీలంక బ్యాటర్లు చాలా ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా పేస్ బౌలింగ్లో ఆడేందుకు తడబడ్డారు. ఇంగ్లాండ్ బౌలర్లు బాన్సర్లను అద్భుతంగా సంధించడంతో శ్రీలంక బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. ఏదో అర్జెంటు పని ఉందన్నట్టుగా ఇలా వచ్చి అలా డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లారు.