Eng Vs Ind: గొప్పగా ఆడాల్సిన ఆటగాళ్లు చేతులు ఎత్తేశారు. భీకరంగా పోరాడాల్సిన ప్లేయర్లు తలవంచారు. చివరికి బౌలర్లు నిలబడ్డారు. మామూలుగా కాదు.. అప్పటిదాకా బెంబేలెత్తించిన ఇంగ్లాండ్ బౌలర్లు భయపడ్డారు. ఓవర్ల మీద ఓవర్లు వేశారు.. వారిలో అసహనం పెరిగిపోయింది. కోపం తారస్థాయికి చేరింది. అయినప్పటికీ మన బౌలర్లు నిదానాన్ని మాత్రమే అనుసరించారు. సమయ మనం పాటించారు. ఈ దశలో భారత్ గెలుస్తుందనే నమ్మకాన్ని కలిగించారు. కాని చివరికి దురదృష్టం వెంటాడింది. ఊహించని విధంగా బంతి వికెట్లను తగిలి.. గుండె పగిలేలా చేసింది. వాస్తవానికి ఇక్కడ ఓటమి అంతరం 22 పరుగులే. కానీ ఓడిన విధానమే ఆవేదన కలిగిస్తోంది..
Also Read: మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా.. మన రవీంద్ర జడేజా కు లార్డ్సే కాదు..మనమూ లేచి నిలబడి చప్పట్లు కొట్టాల్సిందే!
ఐదో రోజు భారత ఇన్నింగ్స్ లో పంత్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి.. స్వల్ప వ్యవధిలోనే అవుట్ అయ్యారు.. ఇంగ్లాండ్ బౌలర్ల దూకుడు ముందు తలవంచారు. దీంతో భారత్ తీవ్రమైన ఇబ్బందులలో పడింది. దీంతో ఓటమి ఇక లాంచనమే అనే అంచనాకు అందరూ వచ్చారు. ఈ నేపథ్యంలో జడేజా బుమ్రా, సిరాజ్ ఇండియా ఓటమిని చాలాసేపు అడ్డుకున్నారు. ముఖ్యంగా జడేజా మాత్రం అద్భుతమైన ప్రదర్శన చేశాడు. నిదానంగా ఆడుతూ.. సాధ్యమైనంతవరకు జట్టును నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కానీ ఈ దశలో అతడు ఎక్కువగా స్ట్రైక్ తీసుకోకుండా బుమ్రా కు ఇచ్చాడు.. దీంతో బుమ్రా స్టోక్స్ వేసిన ఓ బంతికి టెంప్ట్ అయ్యాడు. దానిని అమాంతం గాల్లోకి కొట్టాడు. దాన్ని స్టోక్స్ అందుకున్నాడు. దీంతో బుమ్రా అవుట్ అయ్యాడు.. తర్వాత వచ్చిన సిరాజ్ కూడా బుమ్రా మాదిరిగానే డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బషీర్ వేసిన ఓవర్ లో బంతిని డిఫెన్స్ చేశాడు. అయితే సిరాజ్ పక్కనుంచి బంతి వెళ్ళింది.. అది స్టంప్ ను తగిలింది. దీంతో బెయిల్స్ కిందపడ్డాయి. దీంతో మైదానంలో ఉన్న సిరాజ్ ఒక్కసారిగా నిర్వేదంలో మునిగిపోయాడు. జడేజా అలానే చూస్తూ ఉండిపోయాడు.. ఇక మైదానంలో గ్యాలరీలో కూర్చున్న అభిమానులు ఒక్కసారిగా నిరాశలో కూరుకుపోయారు.
వాస్తవానికి సిరాజ్ కనుక ఆ బంతిని బ్యాక్ ఫుట్ లో కాకుండా ఫ్రంట్ ఫుట్ లో డిఫెండ్ చేస్తే బంతి అలా వెళ్ళేది కాదు. వికెట్ పడేది కూడా కాదు. అప్పుడు మ్యాచ్ మరింత రసవత్తరంగా సాగేది. ఒకవేళ అదే డిఫెన్స్ కొనసాగిస్తూ.. పరుగులు తీస్తే ఇండియా మ్యాచ్ ఫలితాన్ని తనకు అనుకూలంగా మలచుకునేది. ఓటమి అంతరం 22 పరుగులు మాత్రమే అయినప్పటికీ.. ఆ టార్గెట్ కాపాడుకోవడంలో ఇంగ్లాండ్ చూపించిన దూకుడు.. సాధించాలని భారత్ చేసిన ప్రయత్నం ఆకట్టుకున్నాయి.. ఇటీవలి కాలంలో ఒక టెస్ట్ మ్యాచ్ ఈ స్థాయిలో ఉత్కంఠకు గురి చేయలేదు.. అభిమానులను ముని వేళ్ళ మీద నిలబెట్టలేదు.. క్రికెట్ మక్కాగా పేరుపొందిన లార్డ్స్ లో.. అదే స్థాయిలో టెన్షన్ కు గురి చేసింది ఈ మ్యాచ్. ఆటగాళ్లు మాత్రమే కాదు అభిమానులు కూడా ఈ మ్యాచ్ ను మర్చిపోలేరు. ఒకవేళ ఈ మ్యాచ్ పై డాక్యుమెంటరీ తీస్తే అదిరిపోతుంది.. భారత బౌలర్లు చేసిన పోరాటం చిరస్థాయిగా నిలిచిపోతుంది.. ఇంగ్లాండ్ ఆటగాళ్లు చూపించిన తెగువ ఎప్పటికీ గుర్తుండిపోతుంది..
టెస్ట్ క్రికెట్ అంటే బోరింగ్ అని.. ఐదు రోజులపాటు సాగే సాగదీత వ్యవహారమని అందరూ ఒక అభిప్రాయానికి వచ్చిన వేళ అండర్సన్ -టెండూల్కర్ సిరీస్ లో మూడో మ్యాచ్ లో ఆటగాళ్ల ప్రదర్శన ఆకట్టుకుంది.. అంతేకాదు అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజా అందించింది. ఇప్పట్లో ఈ మ్యాచ్ ను ఎవరూ మర్చిపోరు.