Eng Vs Ind 3rd Test Ravindra Jadeja: మామూలుగా అయితే ఆటగాడు దూకుడుగా క్రికెట్ ఆడితే అభిమానులు చప్పట్లు కొడతారు. బౌలర్ల మీద ప్రతాపం చూపిస్తే ఎగిరి గంతులు వేస్తారు. ఇంకా కొట్టు.. అలానే కసి తీరా కొట్టు అంటూ నినాదాలు చేస్తుంటారు. వాస్తవానికి క్రికెట్ అంటే దూకుడు మాత్రమే కాదు.. వేగం మాత్రమే కాదు.. అంతకుమించిన సమయోచితం.. ధీరత్వాన్ని, ఓపికను ఏకకాలంలో ప్రదర్శించే ప్రణాళికాతత్వం. ఇవన్నీ తన ఆటలో చూపించాడు కాబట్టే.. రవీంద్ర జడేజా లార్డ్స్ మైదానంలో జరిగిన టెస్టులో హీరోగా నిలిచాడు. ఈ మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నప్పటికీ.. అతడు మాత్రం కోట్లాది అభిమానుల హృదయాలను మరోసారి గెలిచాడు.
Also Read: నరాలు తెగే ఉత్కంఠ.. బంతి బంతికి మారిన సమీకరణం.. లార్డ్స్ టెస్ట్ లో విజేత ఎవరంటే…
2022 ఐపీఎల్ ఫైనల్ జరిగినప్పుడు.. గుజరాత్ జట్టుతో చెన్నై తలపడుతోంది. ఈ సమయంలో చెన్నై జట్టు కీలక వికెట్లను కోల్పోయింది. ఈ నేపథ్యంలో మైదానంలోకి వచ్చిన రవీంద్ర జడేజా వీరోచితంగా ఆడాడు. బీభత్సంగా బ్యాటింగ్ చేశాడు. బౌలర్లు ఎంత కఠినమైన బంతులు వేస్తున్నప్పటికీ దూకుడు తనాన్ని ప్రదర్శించాడు. తద్వారా చెన్నై జట్టుకు ట్రోఫీ అందించాడు. జట్టు భారాన్ని మొత్తం ఒక్కడు మోసాడు. ఆ సమయంలో అలసిపోలేదు. వెన్ను చూపించలేదు. ధీరత్వం అంటే ఎలా ఉంటుందో ప్రదర్శించాడు.. ఎదురుదాడికి దిగితే ఎలాంటి ఫలితాలు వస్తాయో నిరూపించాడు.
పొట్టి ఫార్మాట్లో అలాంటి ఆట బాగుంటుంది. చూస్తున్న ప్రేక్షకులకు సరికొత్త ఆనందాన్ని అందిస్తుంది. కానీ సుదీర్ఘ ఫార్మాట్లో అలా ఆడేందుకు అవకాశం ఉండదు. ఆడాలని ఏ ఆటగాడు కూడా కోరుకోడు. ఎందుకంటే టెస్ట్ అంటే దూకుడు కాదు. సమయోచితం.. సందర్భోచితం. అది తెలుసు కాబట్టే లార్డ్స్ మైదానంలో జడేజా సహనాన్ని ప్రదర్శించాడు. భూదేవి లాగా ఓపికను పాటించాడు. ఫలితంగా ఇంగ్లాండ్ జట్టుకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్లో బుమ్రా, నితీష్ కుమార్ రెడ్డి లేదా చివరికి సిరాజ్ నిలబడినా సరే ఫలితం ఇంకో విధంగా ఉండేది.. అప్పటిదాకా నాలుగు వికెట్లను వెంటవెంటనే పడగొట్టిన ఇంగ్లాండ్ బౌలర్లు.. జడేజా వరకు వచ్చేసరికి సైలెంట్ అయిపోయాడు. జడేజా నిలబడటమే కాదు, బుమ్రా, సిరాజ్ లాంటి ప్లేయర్లను సైతం నిలబడేలా చేశాడు. జడేజా 61 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు.. వాస్తవానికి అతడు 181 బంతులు ఎదుర్కొన్నాడు. 39.3 ఓవర్ లో టీమిండియా స్కోరు 112 పరుగుల వద్ద ఉన్నప్పుడు నితీష్ అవుట్ అయ్యాడు.. 74.5 ఓవర్ వద్ద జట్టు స్కోరు 170 పరుగులు ఉన్నప్పుడు సిరాజ్ అవుట్ అయ్యాడు. అంటే ఇద్దరు బౌలర్లతో జడేజా దాదాపు 35 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయించాడు.
ఇటీవలి కాలంలో ఒక టెస్ట్ మ్యాచ్ ఈ స్థాయిలో ఉత్కంఠకు గురి చేయలేదు. బంతి బంతికి సమీకరణం మారింది. ప్రతి పరుగు అత్యంత విలువైనదిగా రూపాంతరం చెందింది.. గత రెండు టెస్టులలో బ్యాటర్లు ఆధిపత్యం చెలాయిస్తే.. బౌలర్లు మూడు టెస్టులో చివరి రెండు ఇన్నింగ్స్ లలో అదరగొట్టారు. మొత్తంగా బౌలింగ్ షో చేశారు.. మొత్తానికి లార్డ్స్ మైదానం లో సంచలనం సృష్టించారు.. రవీంద్ర జడేజా అవుట్ అయిన తర్వాత స్టేడియం మొత్తం లేచి నిలబడి చప్పట్లు కొట్టింది. ఈ గౌరవం పొందడానికి నిజంగా అతడు అర్హుడు.. ఎందుకంటే అతడు ఆడిన ఆట అటువంటిది కాబట్టి..
LORD’S GIVING STANDING OVATION TO JADEJA AND INDIA. pic.twitter.com/h8A6OtIijx
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 14, 2025