IND vs ENG Guinness Record: చిన్న జట్లు అయిన నెదర్లాండ్స్, జింబాబ్వేలపై ప్రతాపం చూపే మన టీమిండియా క్రికెటర్లు తాజాగా సెమీస్ లో బలమైన ఇంగ్లండ్ ను కొట్టలేకపోయారు. ఇంగ్లండ్ జట్టే మనల్ని పసికూనల మాదిరిగి చిత్తుచిత్తుగా ఓడించింది. కనీసం పోరాట పటిమ లేకుండా మన టీమిండియా క్రికెటర్లు చేతులెత్తేసిన వైనాన్ని క్రికెట్ అభిమానులు జీర్ణించుకోవడం లేదు. కనీసం పోరాడి ఓడినా సర్దుకుపోయేవారు. కానీ అదీ లేకపోవడంతో రగిలిపోతున్నారు.

సెమీస్ లో ఇంగ్లండ్ ను కొట్టి ఫైనల్ లో పాక్ ను చితక్కొడుతారని అందరూ ఆశపడ్డ వేళ టీమిండియా సెమీస్ లోనే ఓడిపోవడాన్ని ఎవ్వరూ జీర్ణించుకోవడం లేదు. స్టేడియంలో కెప్టెన్ రోహిత్ కన్నీళ్ల పర్యంతం అవ్వడానికి కూడా కారణం అదే. ఐపీఎల్ లో ముంబైకి 5 కప్ లు అందించిన రోహిత్ ఇలాంటి జట్టుతో టీ20 ప్రపంచకప్ లో ఏమీ చేయలేకపోయినందుకు బాధతో ఏడ్చేశాడు.
ఈ బాధ చాలదన్నట్టు మరో రికార్డు కూడా భారత్ పరువు తీసేలా ఉంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ గురువారం ట్వీట్ చేస్తూ “చరిత్రలో అత్యంత సులభమైన ఛేజింగ్ మ్యాచ్ ఇదే” అంటూ అడిలైడ్‌లో జరిగిన T20 ప్రపంచకప్ సెమీ-ఫైనల్ ను పేర్కొంది. ఇండియాను ఈజీగా ఇంగ్లండ్ ఓడించిన మ్యాచ్ నే క్రికెట్ చరిత్రలో సులువైన ఛేజింగ్ మ్యాచ్ అని పేర్కొంది.

ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకొని 20 ఓవర్లలో 168/6కి భారత్‌ను నిలువరించింది. అనంతరం ఛేజింగ్ కు దిగిన ఇంగ్లండ్ కేవలం 16 ఓవర్లలోనే వికెట్లు కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఇంత సులువుగా మ్యాచ్ ను ఇంగ్లండ్ ముగించడం రికార్డుగా నమోదైంది. చరిత్రలో అన్ని పరుగులను వికెట్ పడకుండా ఛేదించిన ఇంగ్లండ్ గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. టీ20 కప్ లలో ఇదివరకూ ఏ టీం ఇంత సులువుగా వికెట్ పడకుండా ఛేదించలేదు. అందుకే ఇంగ్లండ్ గిన్నిస్ రికార్డ్స్ లోకి ఎక్కింది. మన పరువును తీసినట్టైంది.
టీమిండియా చిత్తుగా ఓడిన మ్యాచ్ గిన్నిస్ రికార్డ్ లోకి ఎక్కడంతో మన పుండు మీద కారం చల్లినట్టైంది. ఈ ట్వీట్ పై చాలా మంది ట్విటర్ వినియోగదారులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఓటమి గిన్నిస్ లోకి ఎక్కాల్సిందే అంటూ ఎద్దేవా చేస్తున్నారు. టీమిండియా ఆటతీరుపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.