https://oktelugu.com/

Dinesh Karthik Retirement: దినేష్ కార్తీక్ వీడ్కోలు.. కోహ్లీ కన్నీళ్లు.. దీపిక సంతోషం..

వీడ్కోలు పలికిన అనంతరం కార్తీక్ డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తుండగా.. అతడికి ఇరువైపులా నిలబడి చప్పట్లు కొడుతూ సాగనంపారు. దీనికి సంబంధించిన వీడియోను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : May 25, 2024 / 09:27 AM IST

    Dinesh Karthik Retirement

    Follow us on

    Dinesh Karthik Retirement: టీమిండియా సీనియర్ ఆటగాడు, క్రికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఐపీఎల్ కు వీడ్కోలు పలికాడు. ఇటీవల జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి కూడా నిష్క్రమించింది. ఈ ఓటమి భారాన్ని తట్టుకోలేక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఐపీఎల్ కు రిటర్మెంట్ ప్రకటించాడు. కార్తీక్ ఐపీఎల్ కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో తోటి ఆటగాళ్లు అతడు జట్టుకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. మైదానంలో గార్డ్ ఆఫ్ హానర్ తో గౌరవించారు. వీడ్కోలు పలికిన అనంతరం కార్తీక్ డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తుండగా.. అతడికి ఇరువైపులా నిలబడి చప్పట్లు కొడుతూ సాగనంపారు. దీనికి సంబంధించిన వీడియోను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.

    ఈ వీడియోలో దినేష్ కార్తీక్ తో ఉన్న అనుబంధం గురించి టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మాట్లాడాడు..” 2009లో నేను దినేష్ కార్తీక్ ను తొలిసారి దక్షిణాఫ్రికాలో కలిశాను. అప్పుడు మేము ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆ దేశంలో పర్యటిస్తున్నాం. ఆ సందర్భంగా అతనితో నాకు పరిచయం ఏర్పడింది. అతను కేవలం క్రికెటర్ మాత్రమే కాదు. గొప్ప జ్ఞానవంతుడు. చాలా లోతుగా ఆలోచిస్తాడు. 2022లో ఫామ్ కోల్పోయి చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు.. కార్తీక్ నాతో రోజు మాట్లాడేవాడు. నా ఆట శైలి ఎలా ఉందో అతడు పరిశీలించి.. మొహమాటం లేకుండా చెప్పేసేవాడు. దాంతో నాకు చాలా విషయాలలో ఒక స్పష్టత వచ్చింది. అది అంతిమంగా నా బ్యాటింగ్ మారేందుకు కారణమైంది. కార్తీక్ నాలో ఉన్న లోపాలను ఎత్తి చూపకుంటే ఆట తీరు మారేది కాదు. అతడు టీమ్ ను వదిలి వెళ్ళడం బాధాకరంగా ఉంది. అయినప్పటికీ అతడు బెంగళూరు తోనే ఏదో ఒక రూపంలో ప్రయాణం చేస్తాడని ఆశిస్తున్నానని” విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు.

    ఇక ఈ వీడియోలో దినేష్ కార్తీక్ భార్య దీపిక కూడా కనిపించింది. కార్తీక్ కెరియర్ గురించి మాట్లాడింది..”కార్తీక్ నాకు ఒక స్నేహితుడు, భర్త, సహచరుడు, ఒక మహిళ జీవితంలో ఎటువంటి పాత్ర పోషించాలో అన్ని పాత్రలు అతడివే. అందులో ఎటువంటి సందేహం లేదు. అతడు క్రికెట్ ను ఆడిన తీరు.. సాగించిన కెరియర్ పట్ల నేను చాలా గర్వంగా ఉన్నాను. వీడ్కోలు తర్వాత అతడు మాతో ఎక్కువ సమయం గడుపుతాడనే ఆలోచన సంతోషం కలిగిస్తోంది. అతనితో గడపడం అంటే నాకు, నా పిల్లలకు చాలా ఇష్టం. అతనితో ప్రయాణం బాగుంటుంది. సరదాగా సాగిపోతుంది. ఇట్టే గడిచిపోయిందా అనిపిస్తుందని” దీపిక పేర్కొంది..కాగా, దినేష్ కార్తీక్ అంతకు ముందే పెళ్లయింది. కానీ ఆమె దినేష్ కార్తీక్ స్నేహితుడు, సహచర క్రికెటర్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ తర్వాత దినేష్ కార్తీక్ ఆమెకు విడాకులు ఇచ్చాడు. కొద్ది రోజులకు దీపికతో పరిచయమైంది. అది ప్రేమగా మారింది. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. దీపిక అంతర్జాతీయ స్క్వాష్ క్రీడాకారిణి అన్న విషయం తెలిసిందే.