Dinesh Karthik: క్రికెట్ అంటే జెంటిల్మెన్ గేమ్. ఆ జెంటిల్మెన్ గేమ్ కు చాలా మంది నగిషీలు అద్దారు. అలాంటి వారిలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు దినేష్ కార్తీక్ ముందు వరుసలో ఉంటాడు. కీపింగ్ లో చిరుత లాగా కదులుతాడు. బ్యాటింగ్ చిచ్చరపిడుగు లాగా చేస్తాడు. అందుకే అతనంటే బెంగళూరు ఆటగాళ్లకే కాదు, అభిమానులకు కూడా చాలా ఇష్టం. అయితే అలాంటి ఆటగాడు బుధవారం రాత్రి అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ జట్టు జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్లో బెంగళూరు ఓడిపోయిన నేపథ్యంలో.. ఆ ఓటమి భారంతో.. చెమర్చిన కళ్ళతో ఐపిఎల్ కు గుడ్ బై చెప్పాడు. ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరు ఓటమి పాలు కావడంతో తట్టుకోలేక పొట్టి క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. కన్నీరు పెట్టుకుంటూ మైదానాన్ని వీడాడు. దీంతో బెంగళూరు ఆటగాళ్లు అతడికి గార్డ్ హాఫ్ హానర్ ఇచ్చారు.
వాస్తవానికి బెంగళూరు జట్టు వచ్చే ఐపీఎల్ కు అతడిని రిటైన్ చేసుకోవడం లేదా వేలంలోకి తీసుకోవడం జరగదు. అందువల్లే దినేష్ కార్తీక్ ఐపీఎల్ కు గుడ్ బై చెప్పినట్టు తెలుస్తోంది. వాస్తవానికి అతడు అధికారికంగా వీడ్కోలు చెప్పనప్పటికీ సహచర ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తూ ముందుకు కదిలారు. అయితే దానిని అతడు అంగీకరించాడు. తన చేతికి ఉన్న గ్లవ్స్ తీసేసి విచార వదనంతో మైదానాన్ని వదిలిపెట్టాడు. ఈ సమయంలో బెంగళూరు అభిమానులు డీకే డీకే అంటూ నినాదాలు చేశారు. అధికారికంగా చెప్పకపోయినప్పటికీ.. ఇదే తన చివరి ఐపిఎల్ మ్యాచ్ అని తన చేతల ద్వారా డీకే నిరూపించాడు.
కీలకమైన ప్లే ఆఫ్ మ్యాచ్లో ఓడిపోవడంతో బెంగళూరు ఆటగాళ్లు విచారంలో మునిగిపోయారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా భావోద్వేగానికి గురయ్యాడు. దుఃఖ చారిత కళ్ళతో దినేష్ కార్తీక్ ను ఆలింగంనం చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో బెంగళూరు చివరి వరకు పోరాడినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. కీలకమైన ఆటగాళ్లు వెంట వెంటనే అవుట్ కావడంతో బెంగళూరు భారీ స్కోరు చేయలేకపోయింది. ఒకవేళ బెంగళూరు జట్టు 200 కు పైగా పరుగులు చేసి ఉంటే ఆట మరో విధంగా ఉండేది. టాస్ ఓడిపోవడం కూడా బెంగళూరు విజయవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసింది.
దినేష్ కార్తీక్ ఐపీఎల్లో 257 పైగా మ్యాచులు ఆడాడు. 4842 రన్స్ చేశాడు. ఇందులో 22 అర్థ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో టాప్ టెన్ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో దినేష్ కార్తీక్ కూడా ఉండడం విశేషం. బెంగళూరు జట్టులో దినేష్ కార్తీక్ చేరిన తర్వాతే అతడిలో అసలు సిసలైన ఆట క్రీడా ప్రపంచానికి తెలిసింది. ఐతే చివరి మ్యాచ్ లో డీకే 13 బంతుల్లో 11 రన్స్ చేశాడు. డీకే నేషనల్ టీమ్ కు రెగ్యులర్ గా ఆడకపోవడం వల్ల మధ్యలో కామెంటేటర్ గా కూడా పని చేశాడు.